మియాపూర్‌ భూములు సర్కారువే.. | Supreme Court Verdict On Miyapur Land Dispute Case | Sakshi
Sakshi News home page

మియాపూర్‌ భూములు సర్కారువే..

Oct 30 2026 4:43 AM | Updated on Oct 30 2026 4:43 AM

Supreme Court Verdict On Miyapur Land Dispute Case

మియాపూర్‌లోని100,101 సర్వేనంబర్‌లో ఉన్న భూమి

550 ఎకరాల 39 గుంటల స్థలంపై సుప్రీంకోర్టు తుది తీర్పు 

రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై పహాణీల్లో అక్రమంగా పేర్ల నమోదు 

1949 జాగీర్ల రద్దు చట్టంతోనే భూములు ప్రభుత్వ పరం 

కబ్జాదారుల పత్రాలన్నీ నకిలీవేనని తేల్చేసిన ధర్మాసనం 

వీటి విలువ రూ.20 వేల కోట్లకు పైనే!

సాక్షి, న్యూఢిల్లీ: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌ గ్రామంలో ఉన్న 550 ఎకరాల 39 గుంటల అత్యంత విలువైన భూమిపై రాష్ట్ర ప్రభుత్వానిదే పూర్తి హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ భూములపై యాజమాన్య హక్కులు కోరుతూ బండారి రామచందర్‌తో పాటు ఇతర వ్యక్తులు, కోఆపరేటివ్‌ సొసైటీలు దాఖలు చేసిన పలు సివిల్‌ అప్పీళ్లను కొట్టివేసింది. ఈ వివాదంలో ఉమ్మ డి ఏపీ హైకోర్టు 2003 ఏప్రిల్‌ 16న ఇచ్చిన  తీర్పును సమరి్థస్తూ జస్టిస్‌ ఎంఎం సుందరేశ్, జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం గురువారం 44 పేజీల తుది తీర్పు వెలువరించింది. 

సర్కారీ పోరంబోకు.. ఆపై జాగీరు 
మియాపూర్‌లోని సర్వే నంబర్‌ 100లో 277.05 ఎకరాలు, సర్వే నంబర్‌ 101లో 273.34 ఎకరాలు కలిపి మొత్తం 550 ఎకరాల 39 గుంటల భూమి దశాబ్దాలుగా వివాదంలో ఉంది. 1912లో జరిగిన సర్వే ప్రకారం ఈ భూములను సెత్వార్, క్లాసర్‌ రికార్డుల్లో ’సర్కారీ పోరంబోకు’గా నమోదు చేశారు. ఆ తర్వాత 1927లో జస్టిస్‌ రీల్లీ నేతృత్వంలోని పైగా కమిషన్‌ నివేదిక ఆధారంగా నిజాం నవాబు ఈ మియాపూర్‌ గ్రామాన్ని రఫీ ఉన్నీసా బేగానికి జాగీరుగా కేటాయించారు. 1929లో ఆరో నిజాం జారీ చేసిన ఫర్మాన్‌ ద్వారా ఈ జాగీర్లు ఆమె వారసులకు దక్కాయి.

1949 ఆగస్టు 15న ఏపీ (తెలంగాణ ప్రాంత) జాగీర్ల రద్దు చట్టం అమలులోకి రావడంతో ఈ భూములన్నీ రాష్ట్ర ప్రభుత్వం (అప్పట్లో హైదరాబాద్‌ స్టేట్‌– దివానీ) పరమయ్యాయి. ఆ చట్టం ప్రకారం జాగీర్దార్లకు కేవలం నష్టపరిహారం (కమ్యుటేషన్‌ మొత్తం) మాత్రమే దక్కుతుంది. రఫీ ఉన్నీసా బేగం కుమారుడు నవాబ్‌ మహమ్మద్‌ ఖైసరుద్దీన్‌ ఖాన్‌ రూ.1,20,303 కమ్యుటేషన్‌ పరిహారాన్ని తీసుకున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.

పరిహారం తీసుకున్న తర్వాత ఈ భూములపై అతనికి గానీ, వారసులకు గానీ ఎలాంటి హక్కులు ఉండవని కోర్టు స్పష్టం చేసింది. ఈ భూములకు సంబంధించి 1950–53 మధ్య రెవెన్యూ రికార్డులు, పహాణీల్లో కొందరు అధికారుల అండతో అక్రమంగా రహీమున్నీసా బేగం పేరును పట్టాదారుగా చేర్చినట్లు పేర్కొంది. జాగీర్ల రద్దు చట్టం ప్రకారం భూములు ప్రభుత్వానికి బదిలీ అయిన తర్వాత అధికారులకు రికార్డులు మార్చే అధికారమే లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.  

ల్యాండ్‌ గ్రాబింగ్‌ కోర్టు తీర్పుల సమర్థింపు 
వివిధ ఆధారాలు చూపుతూ మొత్తం మూడు వర్గాలు ఈ భూములపై హక్కులు కోరాయి. నవాబ్‌ ఖైసరుద్దీన్‌ ఖాన్‌ వారసులు ఒక వర్గం కాగా, అబ్దుల్‌ సలాం భార్య రహీమున్నీసా బేగం వారసులు, నవాబ్‌ మొయినుద్దౌలా బహదూర్‌ భార్య రహీమున్నీసా వారసులు మరో రెండు వర్గాలుగా దావా వేశారు. ఈ వ్యవహారంపై గతంలో ల్యాండ్‌ గ్రాబింగ్‌ కోర్టు విచారణ జరిపి ప్రైవేటు వ్యక్తులను భూకబ్జాదారులుగా ప్రకటించింది. హైకోర్టు కూడా దీనిని సమర్ధించింది. పహాణీల్లో అక్రమంగా పేర్లు చేర్చినంత మాత్రాన, నిజాం ఫర్మాన్‌ చూపినంత మాత్రాన యాజమాన్య హక్కులు రావని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ భూములు ఇప్పటికే హైదరాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హుడా)కి బదిలీ అయిన విషయాన్ని తీర్పులో ప్రస్తావించింది. అత్యంత విలువైన ప్రభుత్వ భూములను కాజేసేందుకు ప్రైవేటు వ్యక్తులు కుట్ర చేశారని స్పష్టం చేసింది. 

సీఎం చొరవతో..: ప్రభుత్వం 
మియాపూర్‌ భూ వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో విజయం లభించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌ రెడ్డి ఈ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపింది. సుప్రీంకోర్టు అప్పీళ్లను కొట్టివేయడంతో రూ.వేల కోట్ల విలువైన భూములపై ప్రభుత్వ హక్కుల పరిరక్షణకు కీలక ముందడుగు పడిందని చెప్పవచ్చు. ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పు వెలువడటం పట్ల హెచ్‌ఎండీఏ, మున్సిపల్, రెవెన్యూ వర్గాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. ఈ భూముల విలువ రూ.20 వేల కోట్లకు పైగా ఉంటుందని హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement