తెలంగాణ రైజింగ్‌–2047 లక్ష్యం సాధ్యమే.. కేంద్రమంత్రి | Piyush Goyal attended the curtain raiser event for the Telangana Rising Global Summit 2026 | Sakshi
Sakshi News home page

తెలంగాణ రైజింగ్‌–2047 లక్ష్యం సాధ్యమే.. కేంద్రమంత్రి

Oct 30 2026 3:00 AM | Updated on Oct 30 2026 3:00 AM

Piyush Goyal attended the curtain raiser event for the  Telangana Rising Global Summit 2026
  •   తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సంపూర్ణ సహకారం
  •   ఫార్మా, ఏరోస్పేస్‌, ఏఐ, క్వాంటం కంప్యూటింగ్‌ రంగాల్లో అపార అవకాశాలు
  •   తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ క‌ర్టెన్ రైజ‌ర్‌లో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ నిర్దేశించుకున్న ‘తెలంగాణ రైజింగ్‌–2047’ లక్ష్యం సవాలుతో కూడుకున్నదే అయినప్పటికీ.. సమష్టి కృషితో దానిని సాధించవచ్చనికేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్ అన్నారు.  తెలంగాణ అభివృద్ధి విష‌యంలో కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా స‌హ‌కరిస్తుంద‌న్నారు. నిన్న (గురువారం) తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్-2026 క‌ర్టెన్ రైజ‌ర్ కార్య‌క్ర‌మానికి ఆయన  ముఖ్య అతిథిగా హాజ‌రయ్యారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఫార్మా, అంతరిక్షం, ఏరోస్పేస్‌, రక్షణ, ఎలక్ట్రానిక్స్‌, కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటం కంప్యూటింగ్‌, ఆహార శుద్ధి, పరిశోధన, ఆవిష్కరణల రంగాల్లో విస్తృత అవకాశాలున్నాయని చెప్పారు. పెట్టుబడులు పెట్టే ముందు పారిశ్రామికవేత్తలు ప్రధానంగా ఆశించేది విధానాల్లో స్థిరత్వం, నిబంధనల్లో స్పష్టత, వ్యాపార నిర్వహణలో పారదర్శకతేనని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.

ఇందుకు తెలంగాణ చరిత్రలోని కాకతీయుల కాలం నాటి ఉదాహరణను ప్రస్తావించారు. క్రీ.శ. 1244లో కాకతీయ పాలకుడు గణపతిదేవుడు మోటుపల్లి ఓడరేవులో జారీ చేసిన అభయ శాసనం సముద్ర వాణిజ్యంలో కీలక సంస్కరణలకు నాంది పలికిందన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యాన్ని స్వాగ‌తిస్తున్న‌ట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ తెలిపారు.

 తెలంగాణ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లు

తెలంగాణ నుంచి ఎగుమతులు పెంచేందుకు రాష్ట్రం ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ సూచించారు. రాష్ట్రంలోని అత్యధిక ఎగుమతి సామర్థ్యం ఉన్న 50 ఉత్పత్తులు, సేవలను గుర్తించాలన్నారు. తెలంగాణలోని జీఐ గుర్తింపు పొందిన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో మరింత గుర్తింపు తీసుకురావాలని సూచించారు. ఇందుకు నాణ్యమైన ప్యాకేజింగ్‌, బ్రాండింగ్‌, ఉత్పత్తుల మూలాలను గుర్తించే ట్రేసబిలిటీ వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు.

తాండూరు కందిపప్పు, చపాటా మిర్చి, నిజామాబాద్‌ పసుపు వంటి ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లలో మంచి అవకాశాలున్నాయని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. వాటికి అంతర్జాతీయంగా మెరుగైన ధర లభించేలా చర్యలు తీసుకుంటే రైతుల ఆదాయం పెరుగుతుందని చెప్పారు.ఇటీవల తాండూరు ఎర్ర కందిపప్పు ఉత్పత్తులను హైదరాబాద్‌ నుంచి ఆస్ట్రేలియాకు ఎగుమతి చేయడం తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులకు ఉన్న అవకాశాలకు నిదర్శనమని కేంద్ర మంత్రి అన్నారు.

 ఫార్మా రంగంలో ఆవిష్కరణలకు ప్రాధాన్యం

తెలంగాణ ఫార్మా రంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని గోయల్‌ సూచించారు. జనరిక్‌ ఔషధాల తయారీకి మాత్రమే పరిమితం కాకుండా, అధిక విలువ కలిగిన బ్రాండెడ్‌ ఔషధాలు, వినూత్న ఔషధాలు, బయోసిమిలర్ల తయారీపై దృష్టి పెట్టాలని సూచించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని  అంతరిక్షం, విమానయాన రంగాలు, విమాన విడిభాగాల తయారీ, నిర్వహణ-మరమ్మతు సేవలు (ఎంఆర్‌ఓ), రక్షణ పరికరాలు, ఎలక్ట్రానిక్స్‌, కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్‌, మెషీన్‌ లెర్నింగ్‌ రంగాల్లో తెలంగాణ పెట్టుబడులను ప్రోత్సహించాలని చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement