సాక్షి,న్యూఢిల్లీ : తెలంగాణ రాజకీయాల్లో, రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘ కాలంగా సంచలనం సృష్టిస్తున్న మియాపూర్ భూముల వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తుది తీర్పు వెలువరించింది. వివాదాస్పద 550 ఎకరాల విలువైన భూములు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానివేనని అత్యున్నత న్యాయ స్థానం స్పష్టం చేసింది.
హైదరాబాద్ శివారులోని మియాపూర్ సర్వే నెంబర్ 100, ఇతర సర్వే నెంబర్లలో ఉన్న వందలాది ఎకరాల భూములకు సంబంధించి ప్రైవేట్ వ్యక్తులు, హౌసింగ్ సొసైటీలు, వివిధ వ్యక్తుల తరఫున కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసిన వారిలో బండారి రామచందర్ తదితరులు దాఖలు చేసిన సివిల్ అప్పీళ్లను కోర్టు కొట్టివేసింది.
1949 నాటి జాగీర్ల రద్దు చట్టం ప్రకారమే ఈ భూములన్నీ అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వ పరం అయ్యాయని ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది. ఆ నాటి కాలంలోనే సంబంధిత జాగీర్దార్లు ప్రభుత్వానికి భూములు ఇచ్చి అందుకు నష్టపరిహారాన్ని కూడా తీసుకున్నారని కోర్టు తేల్చిచెప్పింది.
కబ్జాదారులు, కొందరి వ్యక్తులు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై పహాణీల్లో అక్రమంగా తమ పేర్లను నమోదు చేయించుకున్నారని సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రికార్డులను తారుమారు చేసి ప్రభుత్వ భూమిని కాజేసేందుకు యత్నించారని పేర్కొంది.
మియాపూర్ భూములపై కబ్జాదారులు, ప్రైవేట్ వ్యక్తులు సమర్పించిన పత్రాలన్నీ నకిలీవేనని ధర్మాసనం కుండబద్దలు కొట్టింది. ఎలాంటి చట్టబద్ధమైన ఆధారాలు లేకుండా ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించుకోవడానికి చేసిన ప్రయత్నాలను సర్వోన్నత న్యాయస్థానం పూర్తిగా తప్పుపట్టింది. వేల కోట్ల రూపాయల విలువైన అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులు కాజేసేందుకు చేసిన కుట్రలకు సుప్రీంకోర్టు తుది తీర్పుతో గట్టి చెక్ పడినట్లయింది. ఈ తీర్పు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి భారీ చట్టపరమైన ఊరట లభించినట్టయింది.


