డిజిటల్ మోసాల్లో బ్యాంకులదే బాధ్యత: సుప్రీంకోర్టు స్పష్టం | Banks must compensate digital fraud victims SC | Sakshi
Sakshi News home page

డిజిటల్ మోసాల్లో బ్యాంకులదే బాధ్యత: సుప్రీంకోర్టు స్పష్టం

Oct 29 2026 5:50 PM | Updated on Oct 29 2026 6:26 PM

 Banks must compensate digital fraud victims SC

న్యూఢిల్లీ: డిజిటల్ మోసాల కారణంగా ఖాతాదారులు కోల్పోయిన సొమ్మును తిరిగి చెల్లించే బాధ్యత బ్యాంకులపై కూడా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బ్యాంకులు తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైన కారణంగానే మోసం జరిగినట్లు విచారణలో తేలితే, బాధితులకు వారు కోల్పోయిన మొత్తానికి సమానమైన నష్టపరిహారం చెల్లించేలా నిబంధనలు రూపొందించాలని సూచించింది. డిజిటల్ అరెస్ట్‌ వంటి సైబర్‌ నేరాలను అడ్డుకోవడంలో ఆర్థిక సంస్థలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొంది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఈ అంశంపై విచారణ జరిపింది. న్యాయమూర్తులు జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్‌ వి. మోహన కూడా ఈ ధర్మాసనంలో ఉన్నారు. డిజిటల్ మోసాల బాధితుల సమస్యలపై సుప్రీంకోర్టు స్వయంగా చేపట్టిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. “బాధితులను రక్షించడం బ్యాంకర్ల బాధ్యత. ఈ విషయంలో సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు?” అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు.

సాధారణంగా ఒక ఖాతాదారుడు ఒక్కోసారి రూ.10,000 లేదా రూ.20,000 మాత్రమే విత్‌డ్రా చేస్తుంటే, అకస్మాత్తుగా రూ.50,000 తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆ లావాదేవీని అనుమానాస్పదంగా గుర్తించకూడదా? అని ప్రశ్నించారు. ఖాతాదారుల లావాదేవీల తీరుకు భిన్నంగా జరిగే అనుమానాస్పద చెల్లింపులను తాత్కాలికంగా నిలిపివేయడం, వాటి గురించి సంబంధిత అధికారులకు ఆటోమేటిక్‌గా సమాచారం అందించడం, లావాదేవీల నిజానిజాలను ప్రత్యక్షంగా నిర్ధారించడం వంటి చర్యలు అవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది. “ఇలాంటి మోసం జరిగినప్పుడు బ్యాంకు బాధితుడికి పరిహారం చెల్లించడంతోపాటు, ప్రాసిక్యూషన్‌ను కూడా ఎదుర్కొనేలా ఆదేశించాలని మేం ప్రతిపాదిస్తున్నాం. ఇది తప్పనిసరిగా జరగాలి” అని సూర్యకాంత్‌ పేర్కొన్నారు.

ఈ ఏడాది రూ.800 కోట్ల నష్టం
డిజిటల్ అరెస్ట్‌ మోసాల కేసులు గత ఏడాదితో పోలిస్తే సుమారు 50 శాతం తగ్గాయని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్‌ ఆర్‌. వెంకటరమణి కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు జోక్యం, ప్రభుత్వ శాఖల సమన్వయం, ప్రజల్లో అవగాహన కార్యక్రమాల వల్ల ఈ తగ్గుదల నమోదైందని వివరించారు. అయితే, ఈ ఏడాది కూడా ఇలాంటి మోసాల వల్ల దేశంలో దాదాపు రూ.800 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రధాన న్యాయమూర్తి గుర్తుచేశారు. బ్యాంకుల జవాబుదారీతనం, మ్యూల్‌ ఖాతాల వినియోగం వంటి అంశాలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. మ్యూల్‌ ఖాతాలను సైబర్‌ నేరగాళ్లు మోసాల ద్వారా వచ్చిన డబ్బును స్వీకరించడానికి, ఇతర ఖాతాలకు బదిలీ చేయడానికి ఉపయోగిస్తారు.

ఆర్‌బీఐ నిబంధనలపై తదుపరి దృష్టి
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రూపొందిస్తున్న 2026 కేవైసీ సవరణ మార్గదర్శకాలను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. తదుపరి విచారణ నాటికి అన్ని అధీకృత ఆర్థిక సంస్థల జాబితాను సమర్పించాలని ఆర్‌బీఐని ఆదేశించింది. ప్రతి బ్యాంకును విడివిడిగా కేసులో చేర్చాల్సిన అవసరం లేకుండా, వర్తించే అన్ని సంస్థలకు ఆదేశాలు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తోంది.

కొత్త నిబంధనల్లో బ్యాంకుల బాధ్యతలు, అనుమానాస్పద లావాదేవీలను గుర్తించే విధానం, బాధితులకు పరిహారం చెల్లించే అంశాలకు ప్రాధాన్యం లభించనుంది. ఈ మార్గదర్శకాలు ఎలా రూపొందుతాయి, బ్యాంకుల నిర్లక్ష్యం వల్ల నష్టపోయిన ఖాతాదారులకు పరిహారం అందించే విధానం ఎలా అమలవుతుంది అన్నది కీలకంగా మారింది.

ఇదీ చదవండి: సైకిల్‌ను తుక్కు తుక్కుగా ఓడించాలి: ఆర్కే రోజా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement