చిత్తూరు జిల్లా: కూటమి ప్రభుత్వాన‍్ని ఓటమి భయం వెంటాడుతోందని మాజీ మంత్రి ఆర్కే రోజా చెప్పారు. నగరి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆర్కే రోజా ఈ సందర్భంగా సత్రవాడ నుంచి కేవీపీఆర్ పేట, ఏకాంబరం కుప్పం, పుదుపేట నగరి క్లాక్ టవర్ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ, ఓపెన్ ట్యాప్ ర్యాలీలో పాల్గొన్నారు.
ఇందులో రోజా మాట్లాడుతూ.. ‘‘నగరి మున్సిపాలిటీలో చైర్మన్‌ను ఏకగ్రీవంగా చేసుకుని కుట్ర రాజీకీయాలు చేస్తున్నారు. నిజంగా దమ్ము, దైర్యం ఉంటే పోటీ చేసి గెలవాలి. వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారు. నగరి మున్సిపల్ కమిషనర్ బాలాజీ నాయక్ టీడీపీ తొత్తుగా పని చేశారు.
సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో నగరి మున్సిపాలిటీ ఏకగ్రీవం చేశారు. మా చైర్మన్ అభ్యర్ధి స్క్రూటీనీలో నామినేషన్ ఒకే అయిన తర్వాత ఎలా నామినేషన్ తిరస్కరిస్తారు? నగరి మున్సిపాలిటీ చైర్మన్ ఏకగ్రీవంపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశాము. దేవుడ్ని నమ్మిన వాళ్లం.. న్యాయస్థానాలపై నమ్మకం ఉంది.
నగరి మున్సిపాలిటీలో రౌడీ మూక, వెన్నుపోటు మూక ఈ రోజు ఓటర్లను బెదిరిస్తోంది. వైఎస్సార్‌సీపీ పాలనలో జరిగిన అభివృద్ధి చూసి ఓటు వేయాలి. రెండున్నరేళ్లుగా ఒక్క అభివృద్ధి పని కూడా నగరిలో చేపట్టలేదు. కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి. నగరి మున్సిపాలిటీ ఎన్నికల్లో సైకిల్‌ను తుక్కు తుక్కుగా ఓడించాలి. నగరి మున్సిపాలిటీని దొంగల బారిన నుంచి కాపాడాలి’’ అని తెలిపారు.
ఇదీ చదవండి: ముందే హెచ్చరికలున్నా.. మంత్రులను ఎందుకు పంపలేదు?


