తాడేపల్లి: పింఛన్ల పంపిణీలో టీడీపీ నేతలు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని వైఎస్సార్‌సీపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు వైఎస్సార్‌సీపీ లేఖ రాసింది. పింఛన్ల పంపిణీ పేరుతో టీడీపీ నేతలు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని, పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు జోక్యం చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొంది.
‘పింఛన్ల పంపిణీని ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకునే ప్రమాదం ఉంది. అక్టోబర్ 30న పింఛన్ల పంపిణీ సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు జోక్యం చేసుకోకుండా చర్యలు తీసుకోవాలి. లబ్ధిదారులను అధికార పార్టీకి అనుకూలంగా ప్రభావితం చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలి. పింఛన్ల పంపిణీ ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే జరిగేలా ఆదేశాలు ఇవ్వాలి.
జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు, ఎన్నికల అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేయాలి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలి. పింఛన్ల పంపిణీ ప్రారంభానికి ముందే ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలి’ అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి లేఖలో కోరారు.
ఇదీ చదవండి: సైకిల్‌ను తుక్కు తుక్కుగా ఓడించాలి: ఆర్కే రోజా


