రాష్ట్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
అరాచకాలు, ఏకగ్రీవాలపై బాధిత అభ్యర్థులు ఎన్నికల ట్రిబ్యునళ్లను ఆశ్రయించవచ్చు
ట్రిబ్యునళ్లలో సీసీటీవీ ఫుటేజీని సాక్ష్యంగా చూపవచ్చు
ఎన్నికల పిటిషన్ల దాఖలుకు కాల పరిమితి ముగిసే వరకు ఫుటేజీ భద్రపరచాలి
సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పషీ్టకరణ.. వైఎస్సార్‌సీపీ పిటిషన్ల పరిష్కారం
ఏకంగా 53 శాతం ఏకగ్రీవాలు జరిగాయి
నామినేషన్లు వేయకుండా 1,200 మందిని అడ్డగించారు
పెద్ద సంఖ్యలో మా పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారు
నామినేషన్ కేంద్రాల దరిదాపుల్లోకి కూడా వెళ్లనివ్వలేదు
ఎన్నికల ప్రక్రియను ఆపమని మేం కోరడం లేదు
అధికార పార్టీ అరాచకాలు, దుర్మార్గాలను నిలువరించాలని అభ్యర్థిస్తున్నాం
సుప్రీంకోర్టుకు నివేదించిన వైఎస్సార్‌సీపీ తరఫు సీనియర్ న్యాయవాదులు
సాక్షి, న్యూఢిల్లీ: స్థానిక ఎన్నికల్లో చోటుచేసుకుంటున్న అక్రమాలపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. నామినేషన్ల తిరస్కరణ, నామినేషన్ల దాఖలుకు అడ్డంకులు, ఏకగ్రీవ ఎన్నికలపై అభ్యంతరాలు ఉన్న బాధితులు ఎన్నికల అనంతరం చట్ట ప్రకారం ఎలక్షన్ పిటిషన్ల ద్వారా సంబంధిత ట్రిబ్యునళ్లను ఆశ్రయించాలని సూచించింది. ఈ వివాదాలపై భవిష్యత్తులో ఎన్నికల ట్రిబ్యునళ్లు విచారణ చేపట్టే అవకాశం ఉన్నందున నామినేషన్ల ప్రక్రియ, పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను కాల పరిమితి (లిమిటేషన్ పీరియడ్) వరకే కాకుండా, ఎన్నికల పిటిషన్లు దాఖలు చేయడానికి ఉన్న గడువు ముగిసే వరకు భద్రపరచాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నిర్దేశించింది.
తద్వారా పిటిషనర్లు తమ వాదనలకు మద్దతుగా వాటిని సాక్ష్యాలుగా ఉపయోగించుకునేందుకు వీలుంటుందని స్పష్టం చేసింది. ఎన్నికల్లో పారదర్శకత, నిష్పాక్షికత ఆవశ్యకతను ఉద్ఘాటిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు మంగళవారం తీర్పునిచ్చింది. బాధితులు ఎన్నికల పిటిషన్ల ద్వారా సవాలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఏపీ పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల గడువు పొడిగింపు, పారదర్శక ప్రక్రియ కోరుతూ వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను ముగించింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అధికార కూటమి నేతల ఆగడాలు, దుర్మార్గాలు పెచ్చుమీరిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కీలక తీర్పు వెలువరించింది.
తదుపరి అన్ని ఎన్నికలకు వర్తింపు
నామినేషన్ కేంద్రాల వద్ద సీసీటీవీలు ఏర్పాటు చేయడంతో పాటు, ఆ ఫుటేజీని భద్రపరచాలంటూ ఇచి్చన ఉత్తర్వులను తదుపరి జరిగే అన్ని ఎన్నికలకు వర్తింపచేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ దిశగా తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై ఉందని గుర్తు చేసింది. ఈ విషయంలో ఎన్నికల కమిషన్‌కు సైతం తగిన ఆదేశాలు ఇస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. అధికార పార్టీ నేతల దుర్మార్గాల కారణంగా నామినేషన్లు వేయలేకపోవడం, రిటర్నింగ్ అధికారుల కుమ్మక్కుతో నామినేషన్ల తిరస్కరణ, వీటిపై దాఖలు చేసిన అప్పీళ్లను ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఆర్డీవోలు కొట్టేయడం వంటి ఘటనలు భారీ ఎత్తున జరిగిన నేపథ్యంలో, వీటిపై ఎన్నికల పిటిషన్లు దాఖలు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
‘కావాలనే నామినేషన్లను అడ్డుకున్నారా? రిటరి్నంగ్ అధికారులు ఏకపక్షంగా నామినేషన్లు తిరస్కరించారా? ఆర్డీవోలు చట్ట విరుద్ధంగా అప్పీళ్లు కొట్టేశారా? అనే అంశాలపై ఎన్నికల ట్రిబ్యునళ్లు విచారణ జరపాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో నామినేషన్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీని సదరు ఎన్నికల పిటిషన్లలో ఆయా అభ్యర్థులు సాక్ష్యంగా చూపేందుకు వీలుకలిగేలా ఆదేశాలు ఇస్తున్నట్లు తెలిపింది.
అరాచకాలకు పోలీసులు, అధికారుల సహకారం: ధర్మాసనానికి విన్నవించిన సీనియర్ న్యాయవాదులు
రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో ఏకంగా 53 శాతానికి పైగా స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని వైఎస్సార్‌సీపీ తరఫు సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ‘విపక్ష అభ్యర్థులను భయాందోళనలకు గురిచేస్తూ, నామినేషన్ కేంద్రాల దరిదాపుల్లోకి కూడా వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. ఇందుకు పోలీసులు, ఎన్నికల అధికారులు యథేచ్ఛగా సహకరించారు. రాష్ట్రంలో దాదాపు 1,200 మంది అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకు సమర్పించాం’ అని ఆయన ధర్మాసనానికి నివేదించారు.
సుప్రీంకోర్టు ఆదేశాల అమలు విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ చిత్తశుద్ధితో వ్యవహరించలేదన్నారు. నామమాత్రంగానే చర్యలు చేపట్టిందని తెలిపారు. తాము ఎన్నికలను నిలిపివేయాలని కోరడం లేదని, అయితే ఎన్నికల ప్రక్రియ ఎంత అరాచకంగా, దుర్మార్గంగా సాగుతోందో ఈ కోర్టు గమనించాల్సిన అవసరం ఉందన్నారు. గత విచారణ సమయంలో తాము సమరి్పంచిన ఆధారాలపై సంతృప్తి చెందిన తరువాతనే నామినేషన్ల గడువు పెంపునకు, నామినేషన్ కేంద్రాల పెంపునకు ఈ కోర్టు ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు.
ఎన్నికలను సాఫీగా నిర్వహించేందుకు ఆదేశాలు ఇస్తాం.. ఆల్ ది బెస్ట్: సీజేఐ
ఎన్నికలను సాఫీగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘానికి విస్పష్టమైన ఉత్తర్వులు ఇస్తామని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ‘ఇక ఎన్నికల్లో పోటీ చేయండి, ఆల్ ది బెస్ట్‘ అని వైఎస్సార్‌సీపీ న్యాయవాదులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
హైకోర్టు రోజువారీ పర్యవేక్షణ వద్దు: ప్రభుత్వం, ఎస్‌ఈసీ తరఫు న్యాయవాదుల విన్నపం
ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు రోజువారీ ప్రాతిపదికన పర్యవేక్షించేలా ఆదేశిస్తామని ఒక దశలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. దీనిపై అటు ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) తరఫున సొలిసిటర్ జనరల్ (ఎస్‌జీ) తుషార్ మెహతా, ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా అభ్యంతరం తెలిపారు. ఈ పని చేస్తే హైకోర్టులో దాఖలయ్యే పిటిషన్లకు అంతే లేకుండా పోతుందన్నారు. ఇది కొత్త సమస్యలను సృష్టిస్తుందని వివరించారు. గత వారం ధర్మాసనం ఇచి్చన ఆదేశాలను అమలు చేశామని, అభ్యర్థులు కోరిన చోటల్లా భద్రత కల్పించామని లూథ్రా చెప్పారు.
దౌర్జన్యాలపై చేతులు ముడుచుకు కూర్చోలేమన్న ధర్మాసనం
స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడమే కాకుండా, భౌతిక దాడులతో అధికార పార్టీల నేతలు విధ్వంసం సృష్టిస్తున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అత్యవసరంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యాజ్యంపై ఈ నెల 21న న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్య బాగ్జీ, జస్టిస్ వి.మోహన ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. వైఎస్సార్‌సీపీ తరఫు సీనియర్ న్యాయవాదులు మణీందర్ సింగ్, నిఖిల్ గోయల్, న్యాయవాది మెహఫజ్ నజీ్కలు వాదనలు వినిపించారు. అధికార పార్టీ నేతల విధ్వంసం, అరాచకాలు, ఆగడాలపై అన్ని ఆధారాలను వైఎస్సార్‌సీపీ సుప్రీంకోర్టు ముందు ఉంచింది.
వాటిని పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, కండబలం చూపుతూ దౌర్జన్యం చేస్తుంటే తాము చేతులు ముడుచుకుని కూర్చోలేమని తేల్చి చెప్పింది. అధికార పార్టీ నేతలపై ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడాన్ని ఆక్షేపించింది. అంత హింస జరుగుతుంటే నామినేషన్ల కేంద్రాల వద్ద శాంతి భద్రతలు లేకుంటే ఎలా? ఇలాంటి పరిస్థితుల్లో నామినేషన్లు వేయడానికి ఎవరొస్తారు? సామాన్యులు నామినేషన్ కేంద్రాలవైపు కన్నెత్తి చూసే ధైర్యం చేయగలరా? అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. విపక్షంతో సహా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అందరికీ సమానంగా ఉండాలని, అరాచకాలను అడ్డుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేసింది.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు తక్షణ భద్రత కల్పించాలని, నామినేషన్ కేంద్రాల వద్ద సీసీటీవీలు కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అధికార పార్టీ నేతల తీరు వల్ల నామినేషన్లు వేయలేని చోట్ల 48 గంటల పాటు గడువు పెంచాలని ఎస్‌ఈసీకి తేల్చి చెప్పింది. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లే నామినేషన్లు స్వీకరించేలా ఏర్పాట్లు చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. తమ ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని అటు డీజీపీని, ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.


