లాభాలపై 16 శాతం పరిమితి ఎందుకు విధించరు?
వ్యవస్థ మొత్తం కంపెనీల సాయానికే పనిచేస్తున్నట్టుందని వ్యాఖ్య
ధరలు తగ్గకపోవా అని ప్రజలు పగటి కలలు కనాలా?
మందుల ధరలపై కేంద్రంపై సుప్రీంకోర్టు భగ్గు
న్యూఢిల్లీ: మందుల ఎంఆర్‌పీకి, రీటైలర్లకు ఇచ్చే ధరలకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసంపై సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ‘‘ఈ లూటీని ఎలా సమర్థించుకుంటారో’’చెప్పాలని ఘాటుగా విమర్శించింది. మందుల తయారీదారులు ఇలా విచ్చలవిడిగా వ్యవహరించేందుకు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించింది.
ఔషధ ధరల నియంత్రణకు ఏర్పాటైన నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ నిర్వీర్యమైనట్లు కనిపిస్తోందన్న జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల బెంచ్... వ్యవస్థ మొత్తం ఫార్మా కంపెనీలకు సాయపడేలా ఎందుకు పనిచేస్తోందని ప్రభుత్వాన్ని నిలదీసింది. మందుల ధరలపై నియంత్రణతోపాటు మందులకు సంబంధించిన మరో అంశంపై దాఖలైన రెండు పిటిషన్లపై తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.
అంతకుముందు కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీ మాట్లాడుతూ కేన్సర్ మందుల ధరల విషయంలో లాభాలను 30 శాతానికి పరిమితం చేశామని బెంచ్‌కు తెలపగా... అన్ని రకాల మందుల లాభాలపై 16 శాతం గరిష్ట పరిమితి ఎందుకు విధించకూడదని ప్రశ్నించింది. ‘‘ఫార్మా రంగం మొత్తాన్ని నియంత్రించకూడదన్నది ప్రభుత్వ విధానం’’అని ఐశ్వర్య భాటీ సమాధానమిచ్చారు.
రీటైలర్లకు రూ.15కు అందే మందులు కూడా రూ.250కు అమ్ముతున్నారని, ప్రభుత్వమే ఈ లూటీకి అనుమతిస్తోందని వ్యాఖ్యానించింది. ఈ దశలో ఐశ్వర్య భాటీ ప్రభుత్వ విధానాన్ని గుర్తు చేయగా బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ... ‘‘అలాగని విచ్చలవిడిగా దోచుకునేందుకు అనుమతించాలా’’అని ఫార్మా కంపెనీలను ఉద్దేశించి వ్యాఖ్యానించింది.
కంపెనీలకు సాయం చేయడమే ప్రభుత్వ పనా?
ఎంఆర్‌పీ, వినియోగదారుడికి దక్కే ధరల మధ్య వ్యత్యాసాన్ని ప్రస్తావిస్తూ... ‘‘ఎందుకు మొత్తం వ్యవస్థ వారికి (తయారీదారులు) సాయపడేందుకు ప్రయతి్నస్తోంది?’’అని నేరుగా ప్రశ్నించింది. మెడికల్ డిస్ట్రిబ్యూటర్ భార్య ఒకరి కేసును ఉదహరించింది. కేన్సర్ చికిత్సకు వెళితే ఒక ఆసుపత్రి ఒక ఇంజెక్షన్‌కు రూ.1.30 లక్షలు వసూలు చేసిందని, డిస్ట్రిబ్యూటర్ వద్ద అదే ఇంజెక్షన్ రూ.11 వేలకు దొరుకుతోందని తెలిపింది. ఈ వ్యవహారమంతా చూస్తూంటే... నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఏదో ఒక రోజు మందుల ధరలు తగ్గించకుండా ఉంటుందా? అని సామాన్య ప్రజలు పగటి కలలు కంటున్నట్టు ఉందని వ్యాఖ్యానించింది.
ధరల పెరుగుదల నియంత్రణకు సంబంధించిన అంశం కాదని, మూడు, నాలుగు రెట్ల కంటే ఎక్కు వ్యత్యాసముందని, ఈ భారీ తేడాలను ఎలా సమర్థించుకుంటారని ఐశ్వర్య భాటీని ప్రశ్నించింది. రోగులకు బేరాలాడే సామర్థ్యం ఉండదని తెలిపిన బెంచ్... ‘‘అన్ని మందులనూ జెనెరిక్ ముందులుగా పరిగణించి ఉంటే బాగుండు’’అని వ్యాఖ్యానించింది. రోగుల ప్రాణాల విషయానికి వచ్చినప్పుడు పెట్టుబడిదారుల దృక్కోణంతో మాట్లాడకూడదని రోగి ప్రాణాలను, వ్యాపారాన్ని పోల్చవద్దని ప్రభుత్వ న్యాయవాదికి స్పష్టం చేశారు.


