మొబైల్‌ ఫోన్‌ ఉంటేనే ‘రైలు బీమా’ | Supreme Court directive on railway accident insurance | Sakshi
Sakshi News home page

మొబైల్‌ ఫోన్‌ ఉంటేనే ‘రైలు బీమా’

Oct 27 2026 4:13 AM | Updated on Oct 27 2026 4:13 AM

Supreme Court directive on railway accident insurance

ఆ వెసులుబాటు దక్కాలంటే డిజిటల్‌ చెల్లింపు తప్పనిసరి 

ఈ రెండింటిని వినియోగించలేని సామాన్యులు బీమాకు ‘అనర్హులే’ 

కౌంటర్‌ టికెట్‌ కొనేవారికీ బీమా తప్పనిసరంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశం 

నేటి నుంచి అది అమల్లోకి..

సాక్షి, హైదరాబాద్‌: రైల్వే కౌంటర్ల ద్వారా టికెట్‌ కొనే ప్రయాణికులకూ రైలు ప్రమాద బీమా వర్తించబోతోంది. కానీ, ఈ వెసులుబాటు దక్కాలంటే ప్రయాణికుడి వద్ద మొబైల్‌ ఫోన్‌ తప్పనిసరి. అంటే, మొబైల్‌ ఫోన్‌ వెసులుబాటు లేని ప్రయాణికులు ఈ ప్రమాద బీమా అవకాశం లేదన్నమాట. రైలు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులకు బీమా అందుబాటులో ఉంది. 

అయితే, కేవలం ఆన్‌లైన్‌ ద్వారా టికెట్‌ కొనేవారికి వర్తిస్తుంది. కానీ, కౌంటర్లలో టికెట్‌ కొనేవారికి వర్తించటం లేదు. దీన్ని ఇటీవల సుప్రీంకోర్టు తప్పుపట్టిన విషయం తెలిసిందే. కౌంటర్‌ టికెట్‌ కొనేవారికి కూడా ఈ బీమా వర్తింపచేయాలని రైల్వే శాఖను ఆదేశించింది. రైల్వే కౌంటర్లలో టికెట్‌ కొనేవారికీ ఈనెల 27 నుంచి బీమా సదుపాయాన్ని వర్తింపచేయనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. కానీ దీని వెనుక ఉన్న ’డిజిటల్‌’నిబంధనలు ఇప్పుడు అతి సామాన్య, మొబైల్‌ ఫోన్‌ వాడకంలేని వారికి శాపంగా మారాయి.   

చిల్లర సమస్యతో డిజిటల్‌ చెల్లింపుల వైపు.. 
అక్టోబర్‌ 27 నుంచి కౌంటర్లలో టికెట్లు కొనే ప్రయాణికులూ ప్రమాద బీమా పొందేందుకు అవకాశం కల్పించనున్నారు. ఒక్కో ప్రయాణికుడికి బీమా ప్రీమియం 45 పైసలు. అయితే ఇంత తక్కువ మొత్తాన్ని నగదు రూపంలో వసూలు చేయడం సాధ్యం కాకపోవడంతో ప్రీమియం చెల్లింపును డిజిటల్‌ పద్ధతిలోనే చేయాలని రైల్వే శాఖ స్పష్టం చేసింది. బీమా తీసుకోవాలనుకునే ప్రయాణికుల నుంచి టికెట్‌ చార్జీతోపాటు ప్రీమియాన్ని డిజిటల్‌లో వసూలు చేయాలని సూచించింది. బీమా సదుపాయాన్ని ఎంచుకున్న ప్రయాణికుల మొబైల్‌ నంబరును రిజర్వేషన్‌ కౌంటర్‌ సిబ్బంది తప్పనిసరిగా నమోదు చేయాలి. 

పాలసీ జారీకి అవసరమైన వివరాలను బీమా సంస్థకు పంపడంతోపాటు, పాలసీ సమాచారాన్ని ప్రయాణికుడికి ఫోన్‌ ద్వారా తెలుపుతారు. కౌంటర్లలో టికెట్లు కొనుగోలు చేసేవారిలో గ్రామీణ ప్రజలు, నిరక్షరాస్యులు, అతి పేదలు, డిజిటల్‌ చెల్లింపులపై అవగాహన తక్కువగా ఉన్నవారు కూడా ఉంటారు. వీరిలో కొందరికి స్మార్ట్‌ఫోన్లు లేకపోవచ్చు. సొంతంగా మొబైల్‌ ఫోన్‌ లేకున్నా, తాత్కాలికంగా ఇతరుల ఫోన్‌ ద్వారా ఆ ప్రక్రియ పూర్తి చేయటానికి వీలుంది. కానీ, ఇతరుల ఫోన్‌ను సందర్భానుసారం వినియోగించే వెసులుబాటు లేని వారు మాత్రం బీమాకు అనర్హులుగా మారినట్టే.  

రూ.10 లక్షల వరకు రక్షణ.. 
రైలు ప్రమాదానికి గురైనప్పుడు, ప్రయాణికులు ప్రమాదానికి గురైనప్పుడు బీమా మొత్తాన్ని పొందొచ్చు. ప్రమాదం కారణంగా మరణించినా, శాశ్వత, పూర్తి అంగవైకల్యం కలిగినా రూ.10 లక్షల వరకు పరిహారం లభిస్తుంది. శాశ్వత పాక్షిక అంగవైకల్యానికి రూ.7.5 లక్షల వరకు, గాయాల కారణంగా చికిత్స పొందితే ఆసుపత్రి ఖర్చులకు రూ.2 లక్షల వరకు, మృతదేహం తరలింపునకు రూ.10 వేల వరకు బీమా రక్షణ ఉంటుంది. అయితే కౌంటర్‌ టికెట్లకు బీమా వర్తింపజేస్తున్నప్పటికీ, డిజిటల్‌ చెల్లింపులను తప్పనిసరి చేయటం వల్ల సాంకేతిక పరిజ్ఞానం లేని ప్రయాణికులకు ప్రయోజనం పూర్తిస్థాయిలో అందుతుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నిత్యం 2 లక్షల మంది కౌంటర్‌ ద్వారా టికెట్‌ పొందుతున్నట్టు అంచనా. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement