రఘురామకృష్ణరాజుపై సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే.. | CBI investigation into Raghuramakrishnaraju must take place | Sakshi
Sakshi News home page

రఘురామకృష్ణరాజుపై సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే..

Oct 27 2026 3:45 AM | Updated on Oct 27 2026 3:45 AM

CBI investigation into Raghuramakrishnaraju must take place

రూ.238 కోట్ల బ్యాంకింగ్‌ కుంభకోణంలో టీడీపీ నేత, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజుకు సుప్రీం బిగ్‌షాక్‌

ఇండ్‌ భారత్‌ పవర్‌ డైరెక్టర్లపై ఎఫ్‌ఐఆర్‌ రద్దుకు ధర్మాసనం నో

ఈ కేసులో కృష్ణరాజుసహా పలువురి క్వాష్‌ పిటిషన్లు కొట్టివేత

మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యానికి నిరాకరణ

16 వారాల్లో చార్జ్‌షీట్‌ దాఖలు చేయాలని దర్యాప్తు అధికారికి ఆదేశాలు

రఘురామ తదితరులపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో విస్తుపోయే వాస్తవాలు

కోట్లాది రూపాయలు దారి మళ్లించినట్లు ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో నిర్ధారణ

సాక్షి, న్యూఢిల్లీ: బ్యాంకు రుణాలను పక్కదారి పట్టించి, నకిలీ పత్రాలతో రూ.237.84 కోట్ల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న  టీడీపీ నేత, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజుతోపాటు ఇండ్‌ భారత్‌ పవర్‌ జెన్‌కామ్‌ లిమిటెడ్‌ డైరెక్టర్లకు సుప్రీంకోర్టు సోమవారం బిగ్‌షాకిచ్చింది. తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ ఇండ్‌ భారత్‌ పవర్‌ జెన్‌కామ్‌ లిమిటెడ్‌ (ఏ1)తో­పాటు కంపెనీ డైరెక్టర్లు కనుమూరు రఘురామకృష్ణరాజు, కనుమూరు రమాదేవి, కనుమూరు ఇందిరా ప్రియదర్శిని, అంబేడ్కర్‌ రాజ్‌కుమా­ర్‌ గంటా, దుంపల మధుసూధన రెడ్డి, నారాయణ ప్రసాద్‌ భగవతుల, రామచంద్ర అయ్యర్‌ బాలకృష్ణన్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. న్యాయమూర్తులు జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ శీల్‌ నాగులతో కూ­డిన  ధర్మాసనం ఈ మేరకు కీలక తీర్పును వెలువరించింది. ఆర్థిక నేరాల దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున కేసును కొట్టివేయబోమని మద్రాస్‌ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సమర్థించింది.    

కొత్త వాదనలపై ధర్మాసనం అసహనం 
విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ దవే కొత్త వాదనలు వినిపించడంపై ధర్మాసనం అసహనం వ్యక్తంచేసింది. ‘కేవలం ఫోరెన్సిక్‌ నివేదిక ఆధారంగానే ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యింది. టర్మ్‌ లోన్ల కోసం రికార్డులను సృష్టించారన్నది అవాస్తవం. ఈ వ్యవహారంలో స్వతంత్ర డైరెక్టర్లకు సంబంధించిన వాదనలను మద్రాస్‌ హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు’ అని దవే చేసిన వాదనలకు ధర్మాసనం స్పందిస్తూ, ‘ఈ వాదనలు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా ఎందుకు వినిపించలేదు’ అంటూ ప్రశ్నించింది.

‘దర్యాప్తు ప్రక్రియలో మేము జోక్యం చేసుకోలేం. దర్యాప్తు అధికారి  16 వారాల్లోగా విచారణ పూర్తి చేసి చార్జిషీట్‌ దాఖలు చేయాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఉన్నందున, దర్యాప్తు యథాతథంగా కొనసాగుతుంది’ అని స్పష్టంచేసింది. క్వాష్‌ పిటిషన్లను కొట్టివేస్తూ గతంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు  కేవలం ఆ పిటిషన్ల పరిష్కారం కోసమేనని సుప్రీంకోర్టు పేర్కొంటూ, ఆ వ్యాఖ్యలు దర్యాప్తు అధికారి చేపట్టే స్వతంత్ర విచారణపై ఎలాంటి ప్రభావం చూపబోవని తీర్పులో వెల్లడించింది.  

రుణాల దారిమళ్లింపు క్రమమిది.. 
»  ఇండ్‌ భారత్‌ పవర్‌ జెన్‌కామ్‌ లిమిటెడ్‌ (ఏ1) పేరుతో డైరెక్టర్లు పవర్‌ ప్లాంట్ల ఏర్పాటు, ఇతర వ్యాపార అవసరాల నిమిత్తం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నేతృత్వంలోని బ్యాంకింగ్‌ కన్సార్షియం నుంచి సుమారు రూ.237.84 కోట్లు రుణాలుగా పొందారు. 
» అయితే డైరెక్టర్లు ఈ నిధులను అసలు ప్రాజెక్టులకు వినియోగించకుండా, నకిలీ కొనుగోలు పత్రాలు, తప్పుడు అకౌంట్ల ద్వారా గ్రూప్‌ కంపెనీలకు మళ్లించారని  బ్యాంకులు ఫిర్యాదు చేశాయి. 2012–2017 మధ్య కాలంలో జరిగిన ఈ వ్యవహారంపై బీడీఓ ఇండియా ఎల్‌ఎల్‌పీ ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించగా నిధుల మళ్లింపు వెలుగులోకి వచ్చింది.  
»  ఎస్‌బీఐ డీజీఎం ఎస్‌. రవిచంద్రన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2021 మార్చి 24న  నేరపూరిత కుట్ర, చీటింగ్, ఫోర్జరీ, అవినీతి నిరోధక చట్టం (ఐపీసీ 120–బీ, 420, 467, 468, 471, పీసీ యాక్ట్‌ 13(2)) కింద  సీబీఐ ఢిల్లీలో ఈ కేసును నమోదుచేసింది. 
»  ఇంటర్‌ కార్పొరేట్‌ డిపాజిట్ల (ఐసీడీ) రూపంలో ఇండ్‌ భారత్‌ పవర్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్, ఆర్కే ఎనర్జీ లిమిటెడ్, ఇండ్‌ భారత్‌ థర్మల్‌ పవర్‌ లిమిటెడ్‌ వంటి సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా వందల కోట్ల రూపాయలు బదిలీ చేసినట్లు గుర్తించారు. అలాగే వందల  కోట్ల రూపాయల వ్యయాలకు సంబంధించి ఎలాంటి బిల్లులు, ఆధారాలను సమర్పించలేదు.  
»  బ్యాంకులకు ప్రైమరీ సెక్యూరిటీగా ఉన్న సుమారు రూ. 94.56 కోట్ల విలువైన బొగ్గు నిల్వలను బ్యాంకుల అనుమతి లేకుండానే పనికిరాకుండా పోయినట్లు చూపిస్తూ రికార్డుల నుంచి మాయం చేశారు.  
»  కన్సార్టియం బ్యాంకుల ద్వారానే లావాదేవీలు జరపాలన్న నిబంధనలను ఉల్లంఘించి, ఇతర బ్యాంకుల ద్వారా కోట్లాది రూపాయలు మళ్లించి అక్రమాలకు పాల్పడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement