ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు | YSRCP complains to the SEC once again regarding the ruling partys irregularities | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు

Oct 27 2026 3:36 AM | Updated on Oct 27 2026 3:36 AM

YSRCP complains to the SEC once again regarding the ruling partys irregularities

ఎస్‌ఈసీ చేతులెత్తేసినా మేం పోరాటం చేస్తాం 

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలపై ఎస్‌ఈసీకి వైఎస్సార్‌సీపీ మరో మారు ఫిర్యాదు 

సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలు, దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేసి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విఫలమైందని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. అయినా, ప్రజాస్వామ్య పరిరక్షణకు వైఎస్సార్‌సీపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలు, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘనకు గురవుతున్నాయని పేర్కొంటూ వైఎస్సార్‌సీపీ నేతలు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు, పార్టీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి, ఎస్సీ సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ యోనా రాజు తదితరులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠకు సోమవారం ఫిర్యాదు చేశారు. 

ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థుల హక్కులకు భంగం కలుగుతున్న తీరును ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. అధికార పార్టీ అండతో ఎన్నికల అక్రమాలు, నామినేషన్ల తిరస్కరణలు, అభ్యర్థులకు బెదిరింపులు, పోలీసుల దౌర్జన్యాలను వివరించారు. రాజకీయ పార్టీలతోనే కాకుండా, నిర్వీర్యమవుతున్న వ్యవస్థలు, బాధ్యతలను విస్మరిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తోనూ పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఎస్‌ఈసీ తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించకపోయినా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, అభ్యర్థుల హక్కులు, ప్రజల ఓటు హక్కు, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు రాజకీయంగా, న్యాయపరంగా పోరాటాన్ని కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. 

సుప్రీం కోర్టు ఆదేశాలనూ అధికారులు పట్టించుకోవడంలేదు 
అనంతరం ఎస్‌ఈసీ కార్యాలయం వద్ద నేతలు మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ నామినేషన్ల దశ నుంచే అక్రమాలకు పాల్పడుతోందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు. చంద్రగిరిలో తమ పార్టీకి చెందిన 142 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయన్నారు. కందుకూరుతో పాటు అనేక ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. అవసరం లేని ధ్రువపత్రాలను సాకుగా చూపి నామినేషన్లు తిరస్కరిస్తున్నారని మండిపడ్డారు. అప్పీళ్లలోనూ అభ్యర్థుల వాదనలు వినడం లేదని, సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోవడంలేదని చెప్పారు. 

పోలీసు, రెవెన్యూ అధికారుల్లో కొందరు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ అభ్యర్థులను బెదిరించడం, అక్రమంగా అరెస్టులు చేయడం, నామినేషన్‌ పత్రాలను చించేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. నకిరికల్లు జెడ్పీటీసీ అభ్యర్థి కందుల హనుమాయమ్మ భర్త లక్ష్మారెడ్డిని పోలీసులు తీసుకెళ్లి ఎక్కడ ఉంచారో కూడా చెప్పడంలేదని తెలిపారు. ఇలా అనేకానేక అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలను అధికారులు అమలు చేయడం లేదు అని చెప్పారు. వైఎస్సార్‌సీపీ పేరుతో సంబంధం లేని వ్యక్తులు నామినేషన్లు వేయడం, రాజకీయ పార్టీల గుర్తులు లేకుండా బ్యాలెట్‌ పత్రాలు రూపొందించాలనే సర్క్యులర్‌ వంటి అంశాలపై సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. 

ఎస్‌ఈసీ న్యాయం చేయకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు మాట్లాడుతూ.. ఈ నెల 13 నుంచి పలుమార్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కలిసి వినతిపత్రాలు ఇచ్చి, ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలపై అభ్యంతరాలను తెలియజేస్తున్నామని, అయినా ఎటువంటి చర్యలు లేవని తెలిపారు. చివరకు వార్డు మెంబర్‌ ఎన్నికలను కూడా చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు వాడుకుంటూ జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ పరువును దెబ్బతీస్తోందన్నారు. ఒక వ్యక్తి, ఒక కుటుంబం ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్య వ్యవస్థలను పక్కదారి పట్టించడం సమంజసం కాదని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement