నిద్రిస్తున్న బాలికను ఎత్తుకుపోయి లైంగికదాడి, హత్య
గంజాయి మత్తులో చేశానని ఒప్పుకున్న నిందితుడు
దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు
నిందితుడి బంధువు జనసేన ఎంపీటీసీగా పోటీ
ఘటనకు ముందు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్టు సమాచారం.. న్యాయం చేయాలని జాతీయ రహదారిపై బాలిక బంధువుల రాస్తారోకో
నాగులుప్పలపాడు: అమ్మమ్మ పక్కన నిద్రిస్తున్న ఆరేళ్ల చిన్నారిపై జనసేన కార్యకర్త మదపుటేనుగులా విరుచుకుపడ్డాడు. ఎత్తుకుపోయి నోట్లో గంజాయి, గుడ్డలు కుక్కి చిత్రవధ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అక్కడితో వదలక గొంతునులిమి కిరాతకంగా హత్యచేశాడు. ఆపై పాడుపడిన ఇంట్లో బాలికను పడేసి వెళ్లాడు. స్థానికులు అనుమానాస్పదంగా ఉన్న నిందితుడిని పట్టుకుని నిలదీయడంతో తాను చేసిన ఘాతుకాన్ని ఒప్పుకున్నాడు. దీంతో గ్రామస్తులు అతడిని కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు.. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు 3వ తరగతి, ఆరేళ్ల కుమార్తె ఒకటో తరగతి చదువుతున్నారు. ఐదేళ్ల వయసున్న మరో బాబు ఉన్నాడు. సొంత గ్రామంలో పనులు లేక బిడ్డలను నాగులుప్పలపాడు మండలంలోని ఓ గ్రామంలో ఉంటున్న పిల్లల అమ్మమ్మ వద్ద వదిలి దంపతులు హైదరాబాద్‌లో బేల్దారి పనులకు వెళ్లారు. ముగ్గురు పిల్లలు అమ్మమ్మ వద్ద ఉంటూ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు.
నోట్లో గంజాయి కుక్కి.. గుడ్డలు అదిమి..
ఒంగోలు మండలం గుడిమెట్లపాడుకు చెందిన అజ్జం ఆనంద్ (25) చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో జులాయిగా తిరుగుతూ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఏడాది వయసున్న బాబు ఉన్నాడు. 2 నెలల కిందట భార్యతో గొడవపడి అలిగి గుడిమెట్లపాడు గ్రామం నుంచి తన అమ్మమ్మ ఊరుకు వచ్చాడు. ఆనంద్ అమ్మమ్మ ఉపాధి కోసం పొగాకు గ్రేడింగ్‌కు వెళ్లడంతో ఆనంద్ ఇక్కడే చిన్నచిన్న పనులు చేసుకుంటూ గంజాయి, మద్యం తాగుతూ బాధ్యతా రాహిత్యంగా తిరుగుతుండేవాడు. జనసేనలో క్రియాశీలక కార్యకర్తగాఉన్నాడు.
ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి గ్రామంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన తరఫున ఎంపీటీసీగా పోటీచేస్తున్న తన సమీప బంధువు ఎన్నికల ప్రచారంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్న ఆనంద్ అనంతరం ఎస్సీ కాలనీ సమీపంలోని స్థూపం వద్ద మరో ఇద్దరు మిత్రులతో కలిసి మద్యం, గంజాయి తాగాడు. మత్తులో అర్ధరాత్రి 2 గంటల సమయంలో అమ్మమ్మ పక్కన నిద్రిస్తున్న ఆరేళ్ల చిన్నారిని భుజాన వేసుకుని ఆనంద్ తన ఇంటికి తీసుకెళ్లి బాలిక నోట్లో గంజాయి కుక్కి, గుడ్డలు నోటిలో అదిమి చిత్రవధ చేసి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలికకు ఊపిరాడక మృతిచెందిందని గమనించిన ఆనంద్ సమీపంలో పాడుబడిన ఇంట్లో పడేసి అక్కడ నుంచి తప్పించుకోవాలని యత్నించాడు.

జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న గ్రామస్తులు (ఇన్‌సెట్‌లో) ఘటనకు కారకుడైన అజ్జం ఆనంద్ (ఫైల్)
ఇంతలో చుట్టుపక్కల వారు అలజడికి లేచి ఆనంద్ ప్రవర్తన సరిగా లేదని గమనించి గట్టిగా నిలదీయడంతో చిన్నారిపై అఘాయిత్యం చేసి చంపేసిన విషయాన్ని అంగీకరించాడు. దీంతో ఆనంద్ చెప్పిన ప్రదేశంలో బాలికను గుర్తించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. నిందితుడిని గ్రామస్తులు స్తంభానికి కట్టేసి కొట్టి పోలీసులకు అప్పగించారు. చిన్నారి మృతికి న్యాయం చేయాలని గ్రామస్తులు 216 జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, డాగ్ స్క్వాడ్‌తో పరిశీలించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.
బాధితులకు మేరుగు పరామర్శ
చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని 216 జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న బాధిత కుటుంబ సభ్యులను, బంధువులను సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున సోమవారం మధ్యాహ్నం పరామర్శించారు. రాస్తారోకో చేస్తున్న వారితో మాట్లాడి ఘటన జరిగిన తీరును తెలుసుకొని చలించిపోయిన మేరుగు రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు బాలిక మృతికి న్యాయం చేయాలని డిమాండ్ చేయడంతో పాటు కలెక్టర్, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి సత్వర న్యాయం చేయాలని కోరారు.
ఒంగోలు రిమ్స్ మార్చురీలో ఉన్న బాలిక మృతదేహాన్ని కలెక్టర్ పి.రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు పరిశీలించి బంధువులతో మాట్లాడారు. నిందితుడు గంజాయి మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసిందని, పోక్సో కేసు నమోదు చేయడమే కాకుండా ఫాస్ట్ ట్రాక్ విచారణ జరిపేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజాబాబు అన్నారు.


