ఆర్టీపీపీకి చీకటి రోజులు | RTPP power generation drops due to coal and water shortages | Sakshi
Sakshi News home page

ఆర్టీపీపీకి చీకటి రోజులు

Oct 27 2026 3:03 AM | Updated on Oct 27 2026 3:03 AM

RTPP power generation drops due to coal and water shortages

బొగ్గు, నీటి కొరత కారణంగా పడిపోయిన విద్యుత్‌ ఉత్పత్తి 

వైఎస్‌ జగన్‌ హయాంలో ప్లాంట్‌లో విద్యుత్‌ ఉత్పత్తికి పటిష్ట చర్యలు

ప్రస్తుతం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో ప్లాంట్‌కు గడ్డుకాలం 

మూడు రోజులకు మాత్రమే సరిపడే బొగ్గు నిల్వలు 

బొగ్గు రవాణా ఆగితే విద్యుత్‌ ఉత్పత్తి పూర్తిగా నిలిచినట్టే..

ఎర్రగుంట్ల: రాయలసీమ ముఖద్వారమైన కడప జిల్లాలోని డాక్టర్‌ ఎంవీఆర్‌ రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)లో బొగ్గు, నీటి నిల్వలు నిండుకోవడంతో విద్యుత్‌ ఉత్పత్తి తీవ్ర సంక్షోభంలో పడింది. ఈ ప్లాంట్‌లో మొత్తం ఆరు యూనిట్ల ద్వారా 1650 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరగాల్సి ఉంది. ఇందులో మొదటి ఐదు యూనిట్లలో ఒక్కో దానికి 210 మెగావాట్లు, ఆరో యూనిట్‌కు 600 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. అయితే ప్రస్తుతం ఎదురవుతున్న బొగ్గు, నీటి కొరత కారణంగా 1650 మెగావాట్లకు కేవలం 1050 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. 

ప్లాంట్‌లోని అన్ని యూనిట్లు నిరంతరాయంగా నడవాలంటే రోజుకు 21 వేల టన్నుల బొగ్గు అవసరం ఉంది. ప్రస్తుతం కేవలం మూడు రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఏ రోజైనా బొగ్గు వ్యాగన్లు రావడం నిలిచిపోతే విద్యుత్‌ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ప్లాంట్‌ నడవడానికి రోజుకు 70 క్యూసెక్కుల నీరు అవసరం కాగా, వర్షాలు లేక గండికోట, బ్రహ్మసాగర్‌ ప్రాజెక్టులలో నీటి సామర్థ్యం తగ్గిపోవడంతో ప్రస్తుతం ప్లాంట్‌ పరిధిలోని ఉన్న నీటితోనే కాలం వెళ్లదీస్తున్నారు.

నాడు గట్టెక్కించిన వైఎస్‌ జగన్‌ .. 
గతంలో 2014 నుంచి 2019 మధ్య కాలంలోనూ ఆర్టీపీపీకి ఇలాంటి బొగ్గు గండం ఏర్పడి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఆ తర్వాత వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న పటిష్ట చర్యల కారణంగా బొగ్గు నిల్వలు ఏకంగా 3 లక్షల టన్నుల వరకు చేరాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్లాంట్‌ మళ్లీ పాత రోజుల్లోకి జారుకుంది. 

ఈ తీవ్ర కొరతపై ఆర్టీపీపీ ప్రధాన ఇంజనీర్‌ వాసుదేవరావును వివరణ కోరగా, ప్రస్తుతం ప్లాంట్‌లో కేవలం మూడు రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయన్నారు. ప్రస్తుతం 1000 నుంచి 1050 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోందన్నారు. నీటి లభ్యత తక్కువగా ఉందన్నారు. ఏపీజెన్‌కో యాజమాన్యం ఆదేశాల మేరకే ఉత్పత్తి జరుగుతోందని ఆయన వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement