తిరుపతి: స్థానిక సంస్థల ఎన్నికల వేళ అకారణంగా 142 నామినేషన్లు తిరస్కరించారని వైఎస్సార్‌సీపీ నేత, ప్రభుత్వ మాజీ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. అనేక కష్టాలు పడి నామినేషన్లు దాఖలు చేశామని, నామినేషన్లు తిరస్కరణకు గురైన అభ్యర్థులు ఆర్డీవో దగ్గరకు అప్పీల్‌కు వెళ్లారని చెప్పారు.
తిరుపతిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘‘తప్పు చేసిన వారిని బోనులో నిలబెడతాం. చంద్రబాబుకు అధికారులు ఊడిగం చేస్తున్నారు. అధికారులంటే ఎంత ఉన్నతంగా ఉండాలి? వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను అన్యాయంగా చించేశారు. చంద్రబాబు నైతికంగా దిగజారిపోయారు. చంద్రబాబు అనుమతి లేకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా? టీడీపీకి ఊడిగం చేసేందుకే అధికారులు ఉన్నారా?’’ అని అన్నారు.
‘‘చంద్రగిరి నియోజకవర్గంలో అప్రజాస్వామికంగా అనైతికంగా వ్యవహారించారు. మొత్తం 142 నామినేషన్ లు తిరస్కరించారు. అంతా దుర్మార్గంగా మారిపోయారు. న్యాయస్థానంలో అలుపెరగని పోరాటం చేస్తాం. ఎన్నికల నామినేషన్లు, పేపర్లు తొలగించారు. టీడీపీకి అధికారులు ఊడిగం చేస్తున్నారు, ఇంత మంది రాజకీయ జీవితం దెబ్బకొట్టారు. అభ్యర్థులను మెడపెట్టి తోసేశారు’’ అని తెలిపారు.
సి.మల్లవరం ఎంపీటీసీ అభ్యర్థుల ఐదు సెట్లు పేపర్లు డిక్లరేషన్ ఫామ్ లేకుండా చింపివేశారని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తెలిపారు. ఎన్నికలు అంటే కామెడీ అయిపోయిందని చెప్పారు. ఇదే సంస్కృతి కొనసాగితే ఎప్పటికీ ఎన్నికలు జరగవని తెలిపారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ తో దాడులు చేసినా..నామినేషన్లు వేశామని చెప్పారు. ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు కుట్రలు చేశారని అన్నారు.
ఇదీ చదవండి: మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌పై టీడీపీ గూండాలు దాడికి యత్నం


