పల్నాడు జిల్లా: మాజీ మంత్రి విడదల రజినీ సోమవారం జిల్లా ఎస్పీని కలిశారు. తనపై దౌర్జన్యం చేసిన ఎస్ఐ ప్రియాంకపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విడదల రజిని మాట్లాడుతూ టీడీపీ గూండాలపై మండిపడ్డారు.
‘‘పల్నాడు జిల్లా ఎస్పీని కలిసి ఎస్సై ప్రియాంక చేసిన దౌర్జన్యంపై ఫిర్యాదు చేశాను. ఆమెపై వెంటనే కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నాను. పోలీసులు కేసు నమోదు చేయకపోతే న్యాయ పోరాటం చేస్తానని ఎస్పీకి చెప్పాను. చిలకలూరిపేట నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అడ్డం పెట్టుకుని టీడీపీ గూండాలు అరాచకం సృష్టించారు.
వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్ దాఖలు చేయనివ్వకుండా టీడీపీ అడ్డుకుంటోంది. చిలకలూరిపేట మున్సిపాలిటీకి పోటీ చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను బెదిరించి నిబంధనలకు విరుద్ధంగా బలవంతంగా టీడీపీ నాయకులు విత్ డ్రా చేయించారు. ప్రచారంలో ఉన్న వైఎస్సార్‌సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కుటుంబ సభ్యులు బెదిరించి కిడ్నాప్ చేశారు. చివరకు టీడీపీలో చేర్చుకుని పార్టీ మారిందని కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇవాళ అధికారం ఉంది కదా అని విర్రవీగితే కచ్చితంగా ప్రజలు మీకు గుణపాఠం చెబుతారు’’ అని విడదల రజినీ తెలిపారు.
ఇదీ చదవండి: మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌పై టీడీపీ గూండాలు దాడికి యత్నం


