500 సినిమాల కథలు లీక్
ఈ–సినీ ప్రమాణ్ నుంచి స్క్రిప్టులు, కట్ ఆర్డర్ల సమాచారం బహిర్గతం
ఇంటర్నెట్ ఆర్కైవ్‌లో డిజిటల్ డేటా అప్‌లోడ్
సినీపరిశ్రమలో ఇది ఆందోళనకరం
దర్శకుడు, మా–ఏపీ వ్యవస్థాపకుడు దిలీప్‌రాజా
సాక్షి, అమరావతి: కేంద్ర చలనచిత్ర ధ్రువీకరణ బోర్డు (సీబీఎఫ్‌సీ)కు చెందిన ఈ–సినీ ప్రమాణ్ పోర్టల్ నుంచి దాదాపు 500 సినిమాలకు సంబంధించిన పత్రాలు లీకైనట్లు సినీదర్శకుడు, మా–ఏపీ వ్యవస్థాపకుడు దిలీప్‌రాజా వెల్లడించారు. విడుదలకు సిద్ధమవుతున్న సినిమాలకు సంబంధించిన కథలు, సెన్సార్ కట్స్ వివరాలు, పంపిణీ ఒప్పందాల సమాచారం బహిర్గతమవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఆయన సోవువారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. సెన్సార్ సర్టిఫికెట్ కోసం నిర్మాతలు సమర్పించిన స్క్రిప్టులు, బోర్డు సూచించిన కట్స్, పంపిణీదారులతో కుదుర్చుకున్న ఒప్పందాల వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కినట్లు చెప్పారు.
‘లీకైన పత్రాలను గుర్తుతెలియని వ్యక్తి డిజిటల్ లైబ్రరీ ఇంటర్నెట్ ఆర్కైవ్‌లో అప్‌లోడ్ చేసినట్లు సమాచారం. మాజీ సీబీఎఫ్‌సీ చైర్మన్ ప్రసూన్‌జోషి పేరును పోలిన రష్యన్ డిస్‌ప్లే నేమ్‌తో ఈ ఫైళ్లను అందుబాటులో ఉంచినట్లు తెలుస్తోంది. సినిమా విడుదలకు ముందే కథలు, స్క్రీన్‌ప్లేలు బయటకు వస్తే వాటి సృజనాత్మక విలువ దెబ్బతినే ప్రమాదం ఉంది. కొత్త కథలను ఇతరులు అనుకరించడం లేదా దుర్వినియోగం చేయడం ద్వారా నిర్మాతలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. పంపిణీ ఒప్పందాలు, లైసెన్సింగ్ ఫీజుల వివరాలు బయటపడితే సినిమా వ్యాపార చర్చలపైనా ప్రభావం పడవచ్చు.
సెక్యూరిటీ ఆడిట్‌కు సీబీఎఫ్‌సీ
ఈ–సినీ ప్రమాణ్ పోర్టల్ ద్వారా నిర్మాతలు ఆన్‌లైన్‌లో సెన్సార్ సర్టిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజుల చెల్లింపు, దరఖాస్తుల స్థితి పరిశీలన, సర్టిఫికెట్ల డౌన్‌లోడ్ వంటి సేవలు ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయి. పోర్టల్ భద్రతను సమీక్షించేందుకు సెక్యూరిటీ ఆడిట్ చేపట్టడంతోపాటు సైబర్ క్రైౖమ్ విభాగం, కేంద్ర ప్రభుత్వ సైబర్ భద్రతా సంస్థ సర్ట్–ఇన్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో అసలు ఎంతమంది నిర్మాతలకు చెందిన సమాచారం లీకైంది, దాన్ని ఎవరెవరు డౌన్‌లోడ్ చేశారు, దుర్వినియోగం జరిగిందా అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది’ అని చెప్పారు. పోర్టల్ భద్రతను మరింత పటిష్టం చేసి, నిర్మాతల సున్నితమైన సమాచారాన్ని కాపాడాలని ఆయన కోరారు.


