‘స్థానిక’ ఎన్నికల్లో గూండాగిరినే నమ్ముకున్న టీడీపీ
నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం వల్లే 17 మున్సిపాలిటీలు ఏకగ్రీవం
ఎన్నెన్నో సాక్ష్యాలున్నా ఏమాత్రం పట్టించుకోని ఎస్‌ఈసీ
ఎన్నికల ప్రక్రియలో అడుగడుగునా అక్రమాలు, దౌర్జన్యకాండ
నగరి చైర్మన్ పదవికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నామినేషన్ ఆమోదం.. తీరా జాబితాలో పేరు గల్లంతు
అడ్డంకులు దాటుకుని నామినేషన్ వేసినా సాకులతో తిరస్కరణ
17 ఏకగ్రీవాల్లో 15 టీడీపీ, బీజేపీ, జనసేనలకు చెరొకటి
కార్పొరేషన్లలోని వార్డుల్లో టీడీపీ 110, బీజేపీ, జనసేనలకు చెరో మూడు
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు అంతే లేకుండా పోయింది. రోజుకో అరాచకం, అక్రమం వెలుగు చూస్తోంది. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఎన్నికల అధికారులు అభ్యర్థుల నామినేషన్లు సైతం తారుమారు చేశారు. కూటమి పార్టీల ఏకగ్రీవాల కోసం ఎన్నికల అధికారులు ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టే నడుచుకున్నారు. నగరి మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ తరుఫున చైర్మన్ అభ్యర్థిగా ఈవీ బాలకృష్ణన్ వేసిన నామినేషన్‌ను అధికారులు తారుమారు చేశారు. నామినేషన్ల పరిశీలనలో ఆయన నామినేషన్ ఆమోదించినట్టు ఈ నెల 19న లేఖ కూడా ఇచ్చిన అధికారులు.. అదే రోజు పరిశీలన కార్యక్రమం ముగిశాక.. జాబితా ఫారం–4లో మాత్రం ఆయన పేరును ప్రకటించలేదు.
నామినేషన్లు ముగిసిన 18వ తేదీ నాటికి ఆ మున్సిపాలిటీలో మొత్తం 19 మంది అభ్యర్థులు చైర్మన్ పదవికి పోటీలో ఉండగా, పరిశీలన అనంతరం కేవలం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామినేషన్ మాత్రమే చెల్లుబాటు అయినట్లుగా చూపారు. అదే రోజు ఈ విషయంపై వైఎస్సార్‌సీపీ నేతలు అభ్యంతరం తెలిపినా ప్రభుత్వ పెద్దల సూచనతో అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషన్ మొత్తం 87 మున్సిపాలిటీల్లో 17 చోట్ల అధికార కూటమి పార్టీల చైర్మన్ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచినట్టు ప్రకటించింది.

నగరి మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి ఈవీ బాలకృష్ణన్ నామినేషన్‌ను ఆమోదించినట్లు అధికారులు ఇచ్చిన లేఖ
టీడీపీ 15, జనసేన, బీజేపీలు చెరొకటి చొప్పున గెలిచినట్టు ప్రకటించారు. ఎన్నికలు జరుగుతున్న 13 నగర కార్పొరేషన్లలో మొత్తం 922 వార్డుల్లో 117 వార్డులు ఏకగ్రీవమైనట్టు ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్.. అందులో టీడీపీ 110 చోట్ల, బీజేపీ, జనసేనలు మూడేసి చోట్ల ఏకగ్రీవంగా గెలిచినట్టు పేర్కొంది. ఎన్నికలు జరిగే 87 మున్సిపాలిటీల్లో మొత్తం 3,020 వార్డులకు గాను 602 చోట్ల ఏకగ్రీవాలైనట్లు పేర్కొన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్.. అందులో 512 చోట్ల టీడీపీ, 36 చోట్ల జనసేన, 27 చోట్ల బీజేపీ, 18 చోట్ల వైఎఎస్సార్‌సీపీ, తొమ్మిది చోట్ల ఇతరులు ఏకగ్రీవమైనట్టు ప్రకటించింది.

చివరకు టీడీపీ అభ్యర్థి నామినేషన్ మాత్రమే చెల్లుబాటు అయినట్లుగా అధికారులు ఇచ్చిన ప్రకటన
దేశమంతా చూసినా కళ్లు మూసుకున్న ఎస్‌ఈసీ
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అధికార పార్టీ గూండాలు భారీ సంఖ్యలో నామినేషన్ల కేంద్రాల్లో.. ఆ చుట్టు పక్కల మోహరించి, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు నామినేష్లన్లు వేసే పరిస్థితి లేకుండా తీవ్ర హింసాత్మక ఘటనలకు పాల్పడటం తెలిసిందే. ఈ దుర్మార్గాలన్నింటిలో పోలీసులు, అధికారులు ప్రేక్షక పాత్రకే పరిమితమవ్వడమూ విదితమే. పలు చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు లాక్కొని చింపేసిన దృశ్యాలు పలు టీవీ చానళ్లలో ప్రసారం అయ్యాయి. అయినా ఎస్‌ఈసీ ఏమాత్రం స్పందించక పోవడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది.
కడప కార్పోరేషన్ పరిధిలోనే నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్‌పై సైతం టీడీపీ గూండాలు దాడి చేసి నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. ఇలా అడ్డంకులు అధిగమించి నామినేషన్లు దాఖలు చేసిన వారిని సైతం అధికార పార్టీ గూండాలు బెదిరించి పలువురి నామినేషన్లను ఉపసంహరింపజేశారు. ఇంకొన్ని చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల స్థానంలో టీడీపీ నేతలే నామినేషన్లు వేసి.. తర్వాత ఉపసంహరించుకుని ఏకగ్రీవం చేసుకోవడం రాష్ట్ర ఎన్నికల చరిత్రలో సరికొత్త నీచ అంకం. 87 మున్సిపాలిటీలలో 361 నామినేషన్లు ఉపసంహరించుకోగా, అందులో చైర్మన్ పదవులు ఏకగ్రీవం అయిన 17 మున్సిపాలిటీల్లోనే 81 ఉండటం గమనార్హం.
దౌర్జన్యం చేసి.. బెదిరించి..
» పల్నాడు జిల్లా పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవులు ఏకగ్రీవం కాగా, ఆయా చోట్ల నామినేషన్ దాఖలు సమయంలో వందల మంది అధికార పార్టీ గూండాలు నామినేషన్ల కేంద్రాల్లో తిష్టవేసి పేట్రేగిపోయారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా భయభ్రాంతులకు గురి చేశారు. ఈ గూండాగిరిని పోలీసులు చోద్యం చూశారు.
» వైఎస్సార్ కడప జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గంలోని పులివెందులలో నామినేషన్లు వేయడానికి వెళ్లే అభ్యర్థుల కార్లపై పోలీసులే దాడులు చేయడం, కాల్పులు జరపడంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు 20 వార్డులకు నామినేషన్లు దాఖలు చేయలేని పరిస్థితి.
» మైదుకూరు మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ వాళ్లను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్న అధికార పార్టీ గూండాలు.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేసినట్టు ఫేక్ డ్రామా ఆడారు. మైదుకూరు చైర్మన్ పదవికి టీడీపీ నాయకులే వైఎస్సార్‌సీపీ తరుఫున ఫేక్ నామినేషన్లు వేసి, తర్వాత వాటిని ఉపసంహరించుకోవడంతో అక్కడ చైర్మన్ పదవి ఏకగ్రీవమైంది. ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో సైతం పోలీసులను అడ్డంపెట్టుకొని అధికార కూటమి పార్టీ గూండాలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంతో ఆ స్థానం ఏకగ్రీవ జాబితాలోకి వెళ్లింది.
» బద్వేలు, ప్రొద్దుటూరు, రాజంపేట మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు చైర్మన్ పదవికి నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ.. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అధికారులు అవి చెల్లుబాటు కావని ప్రకటించడంతో ఆ మూడు చోట్ల చైర్మన్ పదవులు ఏకగ్రీవమయ్యాయి.
» నంద్యాల జిల్లా ఆత్మకూరు, ఆ«ళ్లగడ్డ మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవులకు నామినేషన్లు దాఖలు చేసిన వారిని అధికార పార్టీ గూండాలు బెదిరించి బలవంతంగా ఉపసంహరింపజేశారు.
» ప్రకాశం జిల్లా దర్శిలో జనసేనకు కేటాయించిన సీట్లలో అధికార తెలుగుదేశం ఇన్‌చార్జి తనకు అనుకూల వ్యక్తినే పోటీలో ఉంచి.. ఇతరులెవ్వరూ నామినేషన్ వేయకుండా రౌడీలను దించి అడ్డుకున్నాడు. కనిగిరి మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినప్పటికీ, దానిని చెల్లుబాటు కాకుండా అడ్డుకున్నారు. అనంతపురం జిల్లా గుత్తిలోనూ ఇదే దౌర్జన్యంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని రంగంలో లేకుండా చేశారు.


