టీడీపీ నేత ఆలం నరసానాయుడు ఆర్డీఓ కార్యాలయంలో ఉండి అప్పీళ్ల ప్రక్రియను ప్రభావితం చేస్తున్నారంటూ ఆధారం చూపుతున్న మాజీ మంత్రి సాకే శైలజానాథ్
జిల్లా పరిషత్ ఎన్నికల నామినేషన్ల అప్పీళ్లను ఏకపక్షంగా తిరస్కరిస్తున్న అధికారులు
నెల్లూరులో విచారణ చేయకుండానే అన్నీ తిరస్కరించిన ఆర్డీఓ
కార్యాలయానికి రాకుండానే అభ్యర్థులకు పోలీసుల ద్వారా మెసేజ్
కావలి ఆర్డీఓ నిర్ణయం రేపటికి వాయిదా
న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయిస్తున్న అభ్యర్థులు
సాక్షి, నెట్‌వర్క్: స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరస్కరణకు గురైన నామినేషన్ల అప్పీళ్ల పరిష్కారంలోనూ పలువురు అధికారులు ‘పచ్చ’పాతంతోనే వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థుల అప్పీళ్లకు ఆమోదం తెలిపి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల అప్పీళ్లను నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. దీంతో న్యాయం కోసం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను హైకోర్టును ఆశ్రయించడానికి నిర్ణయించారు.
నెల్లూరులో ఆర్డీవో కార్యాలయానికి రాకుండానే
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విపక్ష ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లను పలుచోట్ల రిటర్నింగ్ అధికారులు ఏకపక్షంగా తిరస్కరించారు. వీటిపై ఆర్డీఓ వద్ద అప్పీల్ చేసుకోగా, అక్కడ కూడా ఏకపక్షంగా తిరస్కరించారు. నెల్లూరు రూరల్ మండలం పెనుబర్తి నుంచి ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వాల్మీకి శ్యామల, ములుమూడి ఎంపీటీసీ స్థానానికి సీపీఎం నుంచి అట్లా అనిల్‌కుమార్, అట్లా అంజయ్య, సీపీఐ నుంచి రఫీ, రాపూరు మండలానికి చెందిన మరో ఏడుగురు అభ్యర్థులు అప్పీల్ చేశారు. వాల్మీకి శ్యామల నామినేషన్లలో ఎన్నికల వ్యయ ఖర్చుల డిక్లరేషన్‌పై సంతకం లేదని రిజెక్ట్ చేశారు.
వాస్తవంగా ఆ సంతకం రిటర్నింగ్ అధికారి సమక్షంలోనే తీసుకోవాలి. కానీ రిటర్నింగ్ అధికారి ఉద్దేశపూర్వకంగా అభ్యర్థి వద్ద సంతకం తీసుకోకుండానే నామినేషన్ తీసుకొని స్క్రూటినీ రిజెక్ట్ చేశారు. అయినా అభ్యర్థి న్యాయవాదుల వాదనలు వినేందుకు ఆర్డీఓ తన కార్యాలయానికి రాకుండానే ఏకపక్షంగా వారి అప్పీళ్లను తిరస్కరించి పోలీసుల ద్వారా సమాచారం అందజేశారు. కావలి ఆర్డీఓ తన నిర్ణయాన్ని మంగళవారానికి వాయిదా వేసినట్లు సోమవారం రాత్రి పొద్దుపోయాక వెల్లడించారు. ఆత్మకూరు ఆర్డీఓ వద్దకు రెండు అప్పీళ్లు రాగా, రెండింటినీ తిరస్కరించారు.
అనంతపురంలో వైఎస్సార్‌సీపీకో న్యాయం, టీడీపీకో న్యాయం
అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో సుమారు 48 అప్పీళ్లు వచ్చాయి. సోమవారం ఆర్డీఓ ప్రేమంతకుమార్ ఆధ్వర్యంలో అప్పీళ్లను పరిశీలించారు. అయితే, టీడీపీ అభ్యర్థి నామినేషన్‌కు మాత్రమే ఆమోదం తెలిపి, మిగిలిన వాటిన్నింటినీ తిరస్కరించారు. అనంతపురం రూరల్ మండలం కందుకూరు–1 ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కామక్కగారి మురళి నామినేషన్‌ను కుల ధ్రువీకరణ పత్రం జిరాక్స్ సమర్పించారనే కారణంతో తిరస్కరించారు. దీనిపై అప్పీలుకు వెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇదే కారణంపై ఆర్‌ఓ తిరస్కరించిన రాచానపల్లి–1 ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థి డి.రమ్య నామినేషన్‌కు మాత్రం అప్పీల్లో ఆమోదం తెలిపారు.
ఒకే కారణంతో తిరస్కరించిన నామినేషన్ల విషయంలో పార్టీని బట్టి వేర్వేరుగా తీర్పునివ్వడం విమర్శలకు తావిస్తోంది. అప్పీళ్ల ప్రక్రియ అధికార టీడీపీ నేతల కనుసన్నల్లో జరుగుతోందంటూ వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అనంతపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. శింగనమల నియోజకవర్గ టీడీపీ నేత ఆలం వెంకట నరసా నాయుడు ఆర్డీఓ కార్యాలయంలో కూర్చొని అప్పీళ్లను ప్రభావితం చేశారని చెప్పారు. దీనిపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఓ. ఆనంద్‌కు శైలజానాధ్ ఫోన్‌లో ఫిర్యాదు చేశారు.
వైఎస్సార్ కడప జిల్లాలో ఆర్డరూ ఇవ్వరు!
వైఎస్సార్ కడప జిల్లా పరిషత్ ఎన్నికల్లో అధికారులు తిరస్కరించిన 12 వైఎస్సార్‌సీపీ నామినేషన్లపై అభ్యర్థులు అప్పీల్‌కు వెళ్లగా... మొత్తం 12 అప్పీళ్లను కలెక్టర్ తిరస్కరించారు. అభ్యర్థులకు తిరస్కరణ ఆర్డర్ ఇంకా ఇవ్వలేదు. ఆర్డర్ ఇస్తే వెంటనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారనే ఉద్దేశంతోనే కావాలనే జాప్యం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది. చిత్తూరు జిల్లాలో 9 అప్పీళ్లను అధికారులు తిరస్కరించారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో తిరస్కరించిన వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థుల్లో 16 మంది ఆదివారం గుంటూరు ఆర్డీఓకు అప్పీల్ చేశారు. ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావు రెండు సెగ్మెంట్లలోని మూడింటికే ఆమోదం తెలిపి, మిగతా వాటిని తిరస్కరించారు. అలాగే, చేబ్రోలు మండలంలో అప్పీల్‌కు వచ్చిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల 10 నామినేషన్లలో ఆరింటికి ఆమోదం తెలిపి, నాలుగింటిని తిరస్కరించారు.
తిరుపతిలో జాబితాలు బయటపెట్టని అధికారులు
తిరుపతి ఆర్డీవో పరిధిలోని చంద్రగిరి, రైల్వేకోడూరు, నగరి నియోజక వర్గం పరిధిలోని వడమాలపేట, పుత్తూరు మండలాలకు చెందిన పలువురు ఎంపీటీసీ అభ్యర్థులు తమ నామినేషన్ల తిరస్కరణపై అప్పీలు చేసుకున్నారు. వీటిపై తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్ సోమవారం విచారణ చేపట్టారు. మొత్తం 137 అప్పీలుకు రాగా 29 నామినేషన్లకు మాత్రమే ఆమోదం తెలిపారు. 108 అప్పీళ్లను తిరస్కరించారు.
రామచంద్రాపురం మండలంలో 5, తిరుపతి రూరల్ మండలంలో 10, ఎర్రావారిపాళెం మండలంలో 4 ఎంపీటీసీ స్థానాల నామినేషన్లపై దాఖలైన అప్పీళ్లను ఆర్డీవో తిరస్కరించారు. శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోని సత్యవేడు, శ్రీకాళహస్తి, వెంకటగిరి నియోజక వర్గాల్లోని 11 మండలాల్లో 41 నామినేషన్లు అప్పీలుకు రాగా, వీటిలో 12 ఆమోదించగా, 29 తిరస్కరించినట్టు ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. అయితే, వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మాత్రం అధికారులు బయటపెట్టడంలేదు.
ఆర్‌వో చెప్పింది ఓ కారణం.. ఆర్డీఓ చెప్పింది మరో కారణం..!
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్కాపురం ఆర్డీవో పరిధిలో 14 అప్పీళ్లు రాగా వాటిలో మూడింటిని అధికారులు సోమవారం పరిష్కరించారు. కనిగిరి నియోజకవర్గం సీఎస్‌పురం మండలం ఆర్‌కే.పల్లి ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మూరం మొరార్జి, రేగులచెలక ఎంపీటీసీ అభ్యర్థి కుక్కా సుబ్బలక్ష్మమ్మ, నల్లమడుగుల ఎంపీటీసీ అభ్యర్థి సూరిపోగు ఆంథోనిల అప్పీల్ చేయగా, కనిగిరి ఆర్డీవో వాటిని తిరస్కరించినట్లు అభ్యర్థులు తెలిపారు. ఆర్‌కే.పల్లి ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్ పార్ట్–3 పేజ్ లేదని, ఓటర్ల జాబితాలో సీరియల్ నంబర్ సరిగా లేదని ఆర్‌ఓ తిరస్కరించగా, కొన్నిచోట్ల ఓవర్ రైటింగ్ ఉందన్న కారణంతో తిరస్కరించినట్లు ఆర్డీవో ప్రకటించారని అభ్యర్థి తెలిపారు.
కాగా రేగులచెలక ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్‌ను కూడా పార్ట్–3 పేజ్ లేనందున తిరస్కరించినట్ల ఆర్‌వో రాతపూర్వకంగా తెలపగా., ఆర్డీవో కోర్టులో మాత్రం ఆస్తుల వివరాలు, బంగారు నగలు, డిపాజిట్లు, భవనాలు, లొకేషన్, సర్వే నంబర్లు మొదలైన వివరాలు సరిలేవని, ఓవర్‌రైటింగ్ ఉందని, అభ్యర్థి ఆథరైజ్‌డ్ సంతకం చేయలేదని కారణాలు చూపినట్లు అభ్యర్థి తెలిపారు. కందుకూరు నియోజకవర్గంలో 36 అప్పీళ్లపై సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ విచారణ జరిపినప్పటికీ, నిర్ణయం ప్రకటించలేదు.


