‘చదువు బెంగ’ తీరింది! | Collector responds to Sakshi report | Sakshi
Sakshi News home page

‘చదువు బెంగ’ తీరింది!

Oct 27 2026 4:02 AM | Updated on Oct 27 2026 4:02 AM

Collector responds to Sakshi report

‘సాక్షి’ కథనానికి స్పందించిన కలెక్టర్‌

మూడ్రోజుల్లో బాసర ట్రిపుల్‌ ఐటీలో భౌతిక తరగతులు

ఇన్‌టెక్‌వెల్‌ నుంచి నీటి సరఫరాకు చర్యలు

మోటార్ల మరమ్మతులకు రూ.8 లక్షలు విడుదల  

భైంసా/బాసర: నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీలో నీటి ఎద్దడితో విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడుతుండటంతో ఈ నెల 25న ‘సాక్షి’మెయిన్‌లో ‘గంగ లేక చదువుకు బెంగ’శీర్షికన ప్రచురితమైన కథనానికి జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా స్పందించారు. విద్యార్థులకు నీటి ఇబ్బందులు కలుగకుండా, రెండు మూడు రోజుల్లో భౌతిక తరగతులు ప్రారంభించేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. సోమవారం ఆయన ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ను సందర్శించి నీటి సరఫరా వ్యవస్థను పరిశీలించారు. గోదావరి నుంచి క్యాంపస్‌కు నీటి సరఫరా చేసే ఇన్‌టెక్‌ వెల్‌ వద్ద మూడు మోటార్లు ఉండగా.. ప్రస్తుతం ఒకటే పనిచేస్తోందని, రెండు మోటార్ల మరమ్మతుకు రూ.8 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. 

సాంకేతిక నిపుణుల బృందం ఇప్పటికే ఇన్‌టెక్‌వెల్‌ పరిశీలించిందని, పది రోజుల్లో మరమ్మతు పూర్తి చేసి మోటార్లను అందుబాటులో తీసుకొస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది సుమారు 10 వేల మంది ఉంటారని, రోజుకు దాదాపు 15 లక్షల లీటర్ల నీరు అవసరమని, ప్రస్తుతం పనిచేస్తున్న మోటార్‌ రోజుకు సుమారు 25 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తుందని తెలిపారు. అవసరమైతే గ్రామ పంచాయతీ ఇన్‌టెక్‌వెల్‌ నుంచి అదనపు నీటిని అందించడంతోపాటు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తామని చెప్పారు. క్యాంపస్‌లోని 29 ఎకరాల నీటికుంటను శుభ్రం చేసి వినియోగంలోకి తీసుకొస్తామన్నారు.  

ఇన్‌టెక్‌ వెల్‌ పరిశీలన 
అంతకుముందు కలెక్టర్‌ గోదావరి నది వద్ద ఉన్న ట్రిపుల్‌ ఐటీకి నీటిని సరఫరా చేసే ఇన్‌టెక్‌ వెల్‌ను పరిశీలించారు. రెండు మోటార్లకు అవసరమైన పరికరాలను తెప్పించి వీలైనంత త్వరగా మరమ్మతులు పూర్తిచేయాలని సూచించారు. తర్వాత వర్సిటీ ప్రాంగణంలోని నీటికుంట, పంపుహౌస్‌ పరిశీలించారు. కార్యక్రమాల్లో భైంసా సబ్‌ కలెక్టర్‌ అజ్మీరా సంకేత్‌ కుమార్, తహసీల్దార్‌ పవన్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement