ఢిల్లీ హైకోర్టు సీజేగా జస్టిస్ శామ్ కోషి బదిలీ
మరో రెండు రాష్ట్రాలకూ నూతన సీజేల ఎంపిక
సుప్రీంకోర్టు కొలీజియం కీలక సిఫార్సులు
సాక్షి, న్యూఢిల్లీ: కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ తపబ్రత చక్రవర్తిని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) పదోన్నతి కల్సిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. అలాగే, ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ పి.శామ్ కోషిని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి కల్సిస్తూ తీర్మానం చేసింది. ఈ రెండు రాష్ట్రాలతోపాటు గుజరాత్, ఉత్తరాఖండ్ హైకోర్టులకూ నూతన ప్రధాన న్యాయమూర్తులను కొలీజియం సిఫార్సు చేసింది.
ప్రస్తుతం గుజరాత్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ మనాష్ రంజన్ పాఠక్‌కు అదే హైకోర్టు (గుజరాత్)లో ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించింది. పట్నా హైకోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్ సుదీర్ సింగ్‌ను ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా సిఫార్సు చేసింది. సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం ఈమేరకు నిర్ణయాలు తీసుకుంది. ఈ జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపనుండగా, రాష్ట్రపతి ఆమోదం లభించిన వెంటనే అధికారిక గెజిట్ వెలువడనుంది.
జస్టిస్ తపబ్రత చక్రవర్తి నేపథ్యం
న్యాయవాద కుటుంబ నేపథ్యం ఉన్న ఆయన 1967లో జన్మించారు. 1991 జనవరి 29న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. కలకత్తా హైకోర్టులో సివిల్, రాజ్యాంగ, సర్వీసు, విద్యా సంబంధిత కేసుల్లో 22 ఏళ్ల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. అక్టోబర్ 30, 2013న కలకత్తా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, మార్చి 14, 2016న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుదీర్ఘ న్యాయవాద, న్యాయమూర్తి అనుభవం ఉన్న ఆయన తెలంగాణ హైకోర్టు సీజేగా రానున్నారు.
జస్టిస్ పి.శామ్ కోషి నేపథ్యం
1967, ఏప్రిల్ 30న జన్మించిన ఆయన 1987లో కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ, 1990లో న్యాయశాస్త్ర పట్టా పొందారు. 1991, మార్చి 9న న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. తొలుత మధ్యప్రదేశ్ హైకోర్టు జబల్‌పూర్ బెంచ్‌లో 2000 అక్టోబర్ వరకు సివిల్, రాజ్యాంగ, సర్వీసు, కార్మిక సంబంధిత కేసుల్లో వాదనలు వినిపించారు. అనంతరం 2013 సెప్టెంబర్ వరకు ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో న్యాయవాదిగా కొనసాగారు. 2002 నుంచి 2004 వరకు ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా, 2005–06లో డిప్యూటీ అడ్వొకేట్ జనరల్‌గా పనిచేశారు.
2013, సెప్టెంబర్ 16న ఛత్తీస్‌గఢ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 మార్చి 8న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 2023, జూలై 27న తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. 2025, జూలై 18 నుంచి 19వ తేదీ వరకు తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి విధులు నిర్వహించారు. తర్వాత అక్టోబర్ 6న తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు ఢిల్లీ హైకోర్టు సీజేగా పదోన్నతి కల్సిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.


