ఉపగ్రహ చిత్రాలు, గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ ఎంతో ఉపయుక్తం
రాష్ట్రాల ఆర్థిక వృద్ధి అంచనాల్లో సరికొత్త విధానం
రాత్రి వేళ వెలుగుల తీవ్రతకు, రాష్ట్రాల వృద్ధికి మధ్య బలమైన అనుసంధానం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బులెటిన్‌లో అధ్యయనం వివరాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాల త్రైమాసిక ఆర్థిక వృద్ధి రేటును అత్యంత కచ్చితత్వంతో ముందే అంచనా వేయడానికి రాత్రి వేళల్లో భూమిపైనున్న లైట్ల వెలుగులకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు, గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ ఎంతగానో ఉపయోగపడతాయని ఓ అధ్యయనంలో తేలింది. ఈ సరికొత్త సాంకేతిక నమూనా ద్వారా ఆర్థిక వృద్ధి అంచనాల్లో దొర్లే పొరపాట్లను గరిష్టంగా 62 శాతం వరకు తగ్గించవచ్చు. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ఆర్థిక గణాంకాలను ప్రాతిపదికగా తీసుకుని చేసిన పరిశోధనలో రాత్రి వేళ వెలుగుల తీవ్రతకు, రాష్ట్రాల వృద్ధికి మధ్య బలమైన అనుసంధానం ఉన్నట్లు స్పష్టమైంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తాజా నెలవారీ బులెటిన్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.
ఆలస్యానికి చెక్..
ప్రస్తుతం దేశంలో రాష్ట్రాల వారీగా అధికారిక స్థూల విలువ జోడింపు (జీఎస్‌వీఏ) గణాంకాలు ఏడాదికి ఒకసారి మాత్రమే విడుదలవుతున్నాయి. పైగా ఈ వివరాలు వెల్లడి కావడానికి 12–18 నెలల సుదీర్ఘ సమయం పడుతోంది. దీనివల్ల ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా తక్షణ నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వాలకు సవాలుగా మారుతోంది. ఈ కాలయాపనను అధిగమించడానికి ఆర్‌బీఐ సిబ్బంది ఒక ప్రత్యేక అధ్యయనాన్ని నిర్వహించారు.
అంతరిక్ష సాంకేతికతను, ప్రజల డిజిటల్ అలవాట్లను కలపడం ద్వారా సరికొత్త ఆర్థిక సూచికను రూపొందించారు. ఏదైనా ఒక వస్తువు లేదా సేవను తయారు చేసేటప్పుడు, ముడిపదార్థాల ఖర్చును తీసివేసిన తర్వాత ఆ వస్తువుకు ఎంత అదనపు విలువ జతకూరిందో చెప్పేదే స్థూల విలువ జోడింపు (జీవీఏ). ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో ఒక రాష్ట్రంలో అన్ని రంగాలు కలిసి ఉత్పత్తి చేసిన మొత్తం వస్తు సేవలకు సంబంధించిన అదనపు విలువనే జీఎస్‌వీఏ.
సాంకేతికత పనిచేస్తుందిలా..
ఈ పరిశోధన కోసం నాసాకు చెందిన ’బ్లాక్ మార్బుల్’ ఉపగ్రహం అందించే రాత్రివేళ వెలుగుల సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. నగరాలు, పారిశ్రామిక వాడలు, కీలక ప్రాంతాలలో రాత్రి వేళల్లో వెలుగుల తీవ్రత పెరిగితే అక్కడ ఆర్థిక కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతున్నట్లు లెక్క. దీనికి అదనంగా ప్రజలు ఇంటర్నెట్‌లో శోధించే గూగుల్ ట్రెండ్స్ డేటాను కూడా జోడించారు. ప్రజల తక్షణ అవసరాలను, మార్కెట్ డిమాండ్‌ను ప్రతిబింబించే ఉద్యోగాలు, విద్య, రియల్ ఎస్టేట్, షాపింగ్, ఆర్థిక రంగాలు, ప్రయాణాలు, వాహన కొనుగోళ్లు వంటి 25 విభిన్న రంగాలకు సంబంధించిన శోధనలను (సెర్చ్) పరిశీలించారు.
అంచనాల్లో పెరిగిన కచ్చితత్వం..
సాధారణంగా ప్రభుత్వాలు పాత గణాంకాలు, ట్యాక్స్ వసూళ్లు, పాత సర్వేల ఆధారంగా ఒక రాష్ట్రం ఎంత వృద్ధి చెందిందో అంచనా వేస్తాయి. కానీ ఆ పాత పద్ధతి కంటే ఈ కొత్త హైబ్రిడ్ పద్ధతి ఎంతో కచ్చితమైన ఫలితాలను ఇచ్చింది. రాష్ట్రాల వారీగా అంచనా లోపాలను గమనిస్తే గుజరాత్‌లో అత్యధికంగా 62 శాతం, కర్ణాటకలో 54 శాతం, మహారాష్ట్రలో 38 శాతం మేర తప్పులు తగ్గాయి. అయితే ఈ నివేదికను తమ సిబ్బంది రూపొందించారని, ఇందులోని అంశాలు కేవలం రచయితల వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని ఆర్‌బీఐ వెల్లడించింది. దీనిని ఆర్‌బీఐ అధికారిక నివేదిక, అభిప్రాయంగా పరిగణించరాదని బులెటిన్ స్పష్టం చేసింది.
సకాలంలో సరైన వ్యూహాలు..
ఆర్థిక వ్యవస్థలో వస్తున్న విస్తృత మార్పులను ఉపగ్రహ ఆధారిత వెలుగులు ముందే పసిగట్టగలవని, గూగుల్ ట్రెండ్స్ దానికి మరింత బలాన్ని చేకూరుస్తాయని ఈ అధ్యయనం నిరూపించింది. పాత వృద్ధి గణాంకాలతో పాటు ఈ రియల్ టైమ్ డిజిటల్ సూచికలను కలపడం ద్వారా ప్రస్తుత త్రైమాసిక ఆర్థిక వృద్ధిని అత్యంత కచ్చితత్వంతో ముందే అంచనా వేయడానికి వీలవుతుంది. దీనివల్ల విధాన నిర్ణేతలు సకాలంలో, సరైన ఆర్థిక వ్యూహాలను రూపొందించుకోవడానికి మార్గం సుగమం కానుంది. కరోనా మహమ్మారి వల్ల ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్న కాలానికి సంబంధించిన త్రైమాసికాలను మినహాయించినప్పటికీ, ఈ నమూనా ఫలితాలు అత్యంత స్థిరంగా, నమ్మదగినవిగా ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది.
వాస్తవాలకు అద్దం పడుతుంది..
రాత్రి వెలుగులు ఆర్థిక అభివృద్ధికి అద్దం పడతాయి. రాజకీయ నాయకులకు మింగుడు పడని అంశమే అయినప్పటికీ వృద్ధి గణాంకాలు దాపరికం లేకుండా వాస్తవాన్ని వాస్తవంగా చెప్పడానికి శాటిలైట్ చిత్రాలు, గూగుల్ సెర్చ్ డేటాతో కూడిన ఈ రియల్ టైమ్ ఆర్థిక సూచిక దోహదం చేస్తుంది. విదేశీ ఇన్వెస్టర్లు వివిధ దేశాల్లో పెట్టుబడి చేయడానికి వాస్తవ గణాంకాలే ప్రామాణికత. –డి.పాపారావు, ఆర్థిక రంగ విశ్లేషకుడు, కాలమిస్ట్


