ఊరూరా ‘వానర’కం! | Troops of monkeys attack homes, crops, and people all over Telangana | Sakshi
Sakshi News home page

ఊరూరా ‘వానర’కం!

Oct 27 2026 4:18 AM | Updated on Oct 27 2026 4:18 AM

Troops of monkeys attack homes, crops, and people all over Telangana

నిర్మల్‌ పట్టణంలోని శాస్త్రి నగర్‌లో ఓ ఇంటిపైన వానర సైన్యం

ఇళ్లు.. పంటలు.. ప్రజలపై గుంపులుగా దాడులు 

భయభ్రాంతులకు గురిచేస్తున్న వానర సైన్యం

అడవిని వదిలి 55.58 శాతం ఊళ్లపై స్వైరవిహారం

6,112 గ్రామాల్లో సమస్య తీవ్రంగా ఉన్నట్లు గుర్తింపు 

5,660 గ్రామాల్లో కూరగాయలు, పండ్ల తోటలకు నష్టం 

4,380 గ్రామాల్లో భయభ్రాంతులకు గురవుతున్న జనం

పంటలపై ప్రభావం.. సాగుకు జంకుతున్న రైతులు 

సంతాన నియంత్రణకు శస్త్రచికిత్సలు శూన్యం..


ఎలుగుబంటి వేషధారణలో గ్రామంలో తిరుగుతున్న వీరు గ్రామ పంచాయతీ సిబ్బందే. మహబూబాబాద్‌ జిల్లా నెక్కొండలో కోతులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఎలుగుబంటి వ్రస్తాలను కొనుగోలు చేసింది. సిబ్బందికి వాటిని వేసి గ్రామంలో తిప్పుతున్నారు. దీంతో వారిని చూసి కోతులు పారిపోతుండటంతో తాత్కాలిక ఉపశమనంపొందుతున్నామని చెబుతున్నారు.  

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర వ్యాప్తంగా వానర సైన్యం స్వైర విహారం చేస్తోంది. అడవిని వదిలి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. గుంపులుగా ఇళ్లపై పడుతున్నాయి. ఇంటిపైకప్పులోని పెంకులను తొలగిస్తున్నాయి. కిటికీలు, బాల్కనీల ద్వారా ఇళ్లలోకి ప్రవేశించి ఇంట్లోని వస్తువులను చిందరవందర చేçస్తున్నాయి. వంట గదుల్లోకి చొరబడి ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తున్నాయి. ఇంట్లో ఉన్న పిల్లలు, వృద్ధులు అందరిపై దాడులకు దిగుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తీవ్ర స్థాయిలో పంట నష్టం కలిగిస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా 10,995 గ్రామ పంచాయతీలుంటే అందులో 6,112 గ్రామాల్లో (55.58 శాతం) కోతుల బెడద తీవ్రంగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇటీవల పంచాయతీరాజ్‌ శాఖ సేకరించిన లెక్కలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కోతుల వల్ల 5,660 గ్రామాల్లో పంట నష్టం వాటిల్లగా 4,380 గ్రామాల్లో ప్రజలు కోతుల వల్ల ఇబ్బందులతోపాటు భయభ్రాంతులకు గురవుతున్నట్లు తేలిసింది. ఒకప్పుడు అడవుల్లో కనిపించే వానరాలు ఇప్పుడు ఊళ్లలో స్వైరవిహారంతో ఆగమాగం చేస్తున్నాయి. కోతుల సంతతి పెరుగుతున్నా, వాటి నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమవుతుండడంతో సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. 

పంటలపై దండయాత్ర 
ఇళ్లలోనే కాదు పంట పొలాలపై దండెత్తి రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కూరగాయలు, పండ్లు, ఇతర పంటలను దెబ్బతీస్తూ అన్నదాతలకు నష్టాలను మిగులుస్తున్నాయి. ఇప్పటికే పెట్టుబడుల భారం, వాతావరణ మార్పులు, సాగునీటి సమస్యలతో సతమతమవుతున్న రైతులకు కోతుల బెడద అదనపు సమస్యగా మారింది. పంటలు ఏపుగా పెరిగి, దిగుబడి చేతికొచ్చే సమయంలో కోతుల గుంపులు పొలాలపై పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కూరగాయల పంటలు, పండ్ల తోటలతో పాటు ఇతర పంటలకూ నష్టం వాటిల్లుతోంది. కోతులు మొక్కలను పీకేయడం, కాయలు, పండ్లను దెబ్బతీయడం, పంటను చిందరవందర చేయడంతో దిగుబడిపై ప్రభావం పడుతోంది. 

పంటలను కాపాడుకునేందుకు రైతులు పొలాల వద్ద కాపలా కాయాల్సిన పరిస్థితి నెలకొంటోంది. కోతుల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏ పంట సాగు చేయాలన్నా రైతులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తోంది. ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల్లో కూరగాయల సాగువైపు మొగ్గు చూపినా, పెట్టుబడి పెట్టి పంట పండించే పంట చివరకు కోతుల వల్ల నష్టపోవాల్సి వస్తుందన్న వారిని వెంటాడుతోంది. ఒక్క నల్లగొండ జిల్లాలోనే 554 గ్రామాలు, ఖమ్మం జిల్లాలో 406 గ్రామాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు లెక్కలు వేశారు. 

బాల్కనీలకు వైర్‌ మెష్‌లు, సోలార్‌ కంచెలు 
కోతుల బారి నుంచి తప్పించుకునేందుకు గ్రామీణ ప్రజలు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. ఇళ్ల కిటికీలు, బాల్కనీలకు వైర్‌ మెష్‌లు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరికొందరు కోతులు లోపలికి రాకుండా ఖరీదైన సోలార్‌ కంచెలను ఏర్పాటు చేస్తున్నారు. కిరాణా దుకాణాల వద్ద కూడా కోతులు లోపలికి రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయినా కోతుల బెడదకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడటం లేదు. దీంతో కోతులు ఎప్పుడు వస్తాయోనని ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది. తలుపులు, కిటికీలు మూసి ఉంచడం నుంచి ఆహార పదార్థాలను భద్రపరచడం వరకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా గుంపులుగా వచ్చే కోతులను నియంత్రించడం సాధ్యం కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. 

నియంత్రణ చర్యలేవీ? 
గ్రామాల్లో కోతుల బెడద పెరుగుతున్నా వాటిని నియంత్రించేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టడం లేదు. జనావాసాల్లోకి కోతులు రాకుండా చూడటంతోపాటు వాటి సహజ ఆవాసాల పరిరక్షణ, ఆహారం కోసం గ్రామాల్లోకి వచ్చే పరిస్థితులను తగ్గించడం, అవసరమైన చోట్ల అటవీశాఖ సహకారంతో సురక్షితంగా పట్టుకుని తరలించడం వంటి చర్యలపై దృష్టి సారించడం లేదు. 2022లో రాష్ట్ర ప్రభుత్వం కోతుల సంతాన నియంత్రణకు శస్త్రచికిత్సలు చేయడం, జిల్లాకో పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించినా అమలుకు నోచుకోలేదు. అనంతరం మూడు జిల్లాలకు ఒక కేంద్రం ఏర్పాటు చేయాలని భావించినా ఆచరణరూపం దాల్చలేదు. 

ప్రజల భద్రతకు, పంటనష్టం నుంచి కాపాడేందుకు కోతుల బెడదను నియంత్రించేందుకు చేపట్టిన చర్యలపై 2025 మార్చిలో హైకోర్టు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అయినా ఇంతవరకు పక్కా చర్యలు చేపట్టలేదు. తాజాగా కోతుల బెడద తీవ్రంగా ఉన్న గ్రామాల వివరాలను సేకరించాలని పంచాయతీరాజ్‌ శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. అయితే వాటిపై జిల్లా కలెక్టర్లు నివేదికలు పంపినా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మల్‌ జిల్లాలోని చించోలి గ్రామ సమీపంలోని గండి రామన్న హరితవనంలో కోతుల పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి వాటి సంతాన నియంత్రణ శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోనూ పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినా ఆచరణకు నోచుకోలేదు. 

ధారూరులో కోతుల విజృంభన
ధారూరు: వికారాబాద్‌ జిల్లా ధారూరు మండలంలోని 34 గ్రామ పంచాయతీల్లో కోతులు స్వైరవిహారం చేస్తున్నాయి. పంట పొలాల్లో చేరి నాశనం చేస్తున్నాయి. కూరగాయలను సైతం వదిలిపెట్టడం లేదని వారు వాపోయారు. మహిళలు ఇంట్లో ఉండగానే లోనికి దూరి ఆహార పదార్థాలను యథేచ్ఛగా లాక్కెళ్తున్నాయి. గ్రామాలు, తండాల్లోని బండల ఇళ్లపై దూకుతూ హంగామా చేయడంతో పాటు బండలను పగులగొడుతున్నాయి. ఇళ్లపై ఉన్న డిష్‌లను పీకేస్తున్నాయి. చేతిలో ఏమి లేకపోతే మగవారిని సైతం వెంబడించి కరుస్తున్నాయి.రూ.వేలల్లో పెట్టుబడులు పెట్టి సాగుచేసిన పంటలను, కూరగాయలను నాశనం చేస్తుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. 

అనేక సార్లు అధికారులకు విన్నవించినా స్పందన లేకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఆందోళనలు సైతం నిర్వహించారు. రోడ్లపై కూరగాయలు విక్రయిస్తున్న సమయంలోనూ గుంపులుగా దాడి చేస్తున్న కోతులు బుట్టలతో సహా పట్టుకెళ్తున్నాయి. కిరాణ షాపుల్లో దూరి చేతికందిన వస్తువులు, తినుబండారాలను ఎత్తుకెళ్తున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు ఎమ్మెల్యే, మంత్రి, సీఎం స్థాయి వరకు ఫిర్యాదు చేస్తున్నా ఫలితం శూన్యమని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement