జ్ఞానేశ్‌ రాజీనామా చేసేదాకా పోరాటం ఆగదు  | Rahul Gandhi Demands CEC Gyanesh Kumar Resignation | Sakshi
Sakshi News home page

జ్ఞానేశ్‌ రాజీనామా చేసేదాకా పోరాటం ఆగదు 

Oct 28 2026 5:54 AM | Updated on Oct 28 2026 5:54 AM

Rahul Gandhi Demands CEC Gyanesh Kumar Resignation

ఎస్‌ఐఆర్‌ను నిలిపివేయాల్సిందే  

పేద ప్రజల హక్కులను కాలరాస్తున్నారు  

‘జన్‌ సున్వాయి’లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ ఆగ్రహం 

న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేసేంత వరకు లేదా ప్రధానమంత్రి మోదీ స్వయంగా జోక్యం చేసుకొని ఆయనను సీఈసీ పదవి నుంచి తొలగించే వరకు తమ పోరాటం ఆగదని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ తేల్చిచెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( ఐఖ) ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం ఢిల్లీలోని త్రిలోక్‌పురిలో జన్‌ సున్వాయి(ప్రజా విచారణ) కార్యక్రమంలో రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. 

త్రిలోక్‌పురి ప్రాంతంలోని నాలుగు పోలింగ్‌ బూత్‌ల నుంచి 416 మంది ఓటర్ల పేర్లను అక్రమంగా తొలగించారని ఆరోపించారు. దీనిపై సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ను ప్రశ్నించగా, ఆయన సమాధానం చెప్పడానికి నిరాకరిస్తున్నారని, తప్పించుకొని తిరుగుతున్నారని మండిపడ్డారు. కానీ, ఈ విషయాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులను రాహల్‌ గాంధీ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్‌) నేత దీపాంకర్‌ భట్టాచార్య, స్వరాజ్‌ ఇండియాకు చెందిన యోగేంద్ర యాదవ్‌ కూడా పాల్గొన్నారు.  

బిలియనీర్ల కోసం కొత్త హిందూస్తాన్‌  
ఎస్‌ఐఆర్‌ కారణంగా దేశంలో కోట్లాది మంది ప్రజలు తమ ఓటు హక్కును కోల్పోతున్నారని రాహుల్‌ గాంధీ ఆందోళన వ్యక్తంచేశారు. పెద్ద ఎత్తున ఓట్ల చోరీ జరుగుతోందన్న విషయం దేశం మొత్తానికి అర్థమవుతోందని పేర్కొన్నారు. పేద ప్రజల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించి, వారి హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. కొద్దిమంది బిలియనీర్ల కోసం ఒక కొత్త భారతదేశాన్ని సృష్టించే ప్రయత్నం జరుగుతోందని ధ్వజమెత్తారు. ఆ కొత్త దేశంలో పౌరులకు ఎలాంటి హక్కులు ఉండవు, పేదలకు వారి హక్కులు దక్కవని చెప్పారు. 

అలాంటి కొత్త దేశం కేవలం బిలియనీర్ల ప్రయోజనాల కోసమే పని చేస్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కేవలం ధనికుల కోసం మాత్రమే ఒక హిందుస్తాన్‌ను సృష్టించే పనిలో నిమగ్నమై ఉన్నారని రాహుల్‌ గాంధీ విమర్శించారు. జ్ఞానేశ్‌ కుమార్‌ ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్నారని, ఇది దేశద్రోహంతో సమానమని ఆరోపించారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా గళమెత్తుతామని, ప్రజల ఓటు హక్కును కాపాడుకుంటామని ప్రకటించారు. జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేసే వరకు ఏకతాటిపై ఉండి, అన్యాయానికి వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపిస్తూనే ఉంటామని వెల్లడించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement