ఓటర్ల జాబితా 'SIR'పై నేడు సుప్రీంకోర్టులో విచారణ | Rahul Gandhi’s Satyam Shivam Sundaram Post Ahead Of Supreme Court Hearing On Voter List SIR Process Draws Attention | Sakshi
Sakshi News home page

ఓటర్ల జాబితా 'SIR'పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

Oct 27 2026 11:37 AM | Updated on Oct 27 2026 12:50 PM

Rahul Gandhi invokes Lord Shiva ahead of SIR hearing in Supreme Court

సాక్షి,న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎక్స్‌ వేదికగా శివుడి చిత్రాన్ని ట్వీట్‌ చేశారు. ‘సత్యం శివం సుందరం’ అని ట్యాగ్‌ చేయడం చర్చనీయాంశమైంది. ఎన్నికల సంఘం విధివిధానాలు, ఏకపక్ష నిర్ణయాలపై ప్రతిపక్షాలు నిరసనలు తెలుపుతున్న తరుణంలో రాహుల్‌ ట్వీట్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ పనితీరును ప్రశ్నిస్తూ ఆయనపై తగిన విచారణ జరపాలని, దేశవ్యాప్త ఓటర్ల జాబితా ఎస్ఐఆర్‌ను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం విచారించనుంది. సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని, జస్టిస్‌లు జయమల్య బాగ్చీ, వి. మోహనాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టనుంది. ఇదే అంశంపై రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష నాయకులు దాఖలు చేసిన పిటిషన్లను కూడా కోర్టు విచారణకు స్వీకరించింది.  

గత విచారణల సందర్భంగా ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం..ఓటర్ల జాబితాల ఎస్‌ఐఆర్‌ నిర్వహణ పూర్తిగా నిబంధనలకు అనుగుణంగానే చేపట్టినట్లు ఈసీ స్పష్టం చేసింది. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు సంబంధించిన నిర్ణయాలలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరించారన్న ఆరోపణలను ఈసీ పూర్తిగా తోసిపుచ్చింది. సవరణకు సంబంధించిన మూడు కీలక ఉత్తర్వులను కమిషన్‌లోని ముగ్గురు సభ్యులు (సీఈసీ, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు) ఏకగ్రీవంగా ఆమోదించారని వెల్లడించింది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌పై సీఈసీతో పాటు ఇతర కమిషనర్లు కూడా సంయుక్తంగా అంగీకరించినట్లు తెలిపింది.

ఓటరు నమోదు కోసం చట్టాన్ని గానీ, నిర్దేశించిన ‘ఫారం-6’ను గానీ తాము సవరించలేదని ఈసీ స్పష్టం చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియలో సాంకేతిక సౌలభ్యం కోసం మాత్రమే కొన్ని మార్పులు చేసినట్లు వివరించింది. 

తమకు తెలియకుండా, తమ సిఫార్సు లేకుండా ఓటర్ల జాబితాల ఎస్‌ఐఆర్‌పై నిర్ణయాలు తీసుకున్నారంటూ ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గతంలో అభ్యంతరాలు వ్యక్తం చేశారంటూ వెలువడిన మీడియా నివేదికల ఆధారంగా ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. 

ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తీరుపై ప్రతిపక్షాల విమర్శలు, రాహుల్ గాంధీ తాజా ఆధ్యాత్మిక పోస్ట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఈ పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపుతుండటంతో, ఈసీ తీసుకున్న చర్యలు, కోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement