తుపాన్‌ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి | Ys Jagan Mohan Reddy has appealed to people to remain vigilant | Sakshi
Sakshi News home page

తుపాన్‌ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Oct 28 2026 6:00 AM | Updated on Oct 28 2026 6:00 AM

Ys Jagan Mohan Reddy has appealed to people to remain vigilant

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి

ప్రజల ప్రాణాలు కాపాడడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత కావాలి

పునరావాస కేంద్రాలు, ఆహారం, తాగునీరు, మందులు, మౌలిక వసతులపై దృష్టి పెట్టాలి

గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలు, వృద్ధులు, వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి

రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ బకాయిలు వెంటనే అందజేయాలి 

సహాయక చర్యల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలి

సాక్షి, అమరావతి: అర్నబ్‌ తుపాను తీవ్ర రూపం దాల్చి తీరానికి సమీపంలో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తున్నందున, వరదలు సంభవించే ప్రమా­దం ఉన్నందున ప్రజలందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలన్నారు. సముద్రతీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, నదులు, వాగులు, వంకల పరీవాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

తుపాను కారణంగా ప్రాణాపాయం జరగకుండా ప్రజల రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తుపాను తీరం దాటిన తర్వాత సహాయక చర్యలు చేపట్టడం మాత్రమే కాకుండా, ముందస్తు జాగ్రత్తల ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాలను సాధ్యమైనంత వరకు నివారించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పునరావాస కేంద్రాల ఏర్పాటు, వాటిలో ఆహారం, తాగునీరు, మందులు, విద్యుత్, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాలకు ఎలాంటి కొరత లేకుండా చూడాలని చెప్పారు. గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. 

అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు ఆస్పత్రులను, అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలని, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, తాగునీరు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు దెబ్బతింటే, వెంటనే పునరుద్ధరించేలా సిబ్బందిని, అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచాలని కోరారు. తుపాను కారణ­ంగా రైతులు, మత్స్యకారులు, ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, రైతులకు అవసరమైన సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలన్నారు.

 తుపాను అనంతరం పంటలు, ఆక్వా సాగు, ఇళ్లు, ఇతర ఆస్తులకు జరిగిన నష్టాన్ని వేగంగా అంచనా వేసి, బాధితులకు సకాలంలో పరిహారం అందించేందుకు సన్నద్ధం కావాలని చెప్పారు. మోంథా తుపానుకు సంబంధించి ఇప్పటి వరకు రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద ఒక్క రూపాయి కూడా అందజేయలేదని, ఆ డబ్బును వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు తుపా­ను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement