‘స్థానికం’లో ‘సీన్‌’ లేదని.. | Local body elections cannot be treated as a referendum | Sakshi
Sakshi News home page

‘స్థానికం’లో ‘సీన్‌’ లేదని..

Oct 28 2026 5:25 AM | Updated on Oct 28 2026 5:25 AM

Local body elections cannot be treated as a referendum

కాడి పడేసిన కూటమి నేతలు చంద్రబాబు, పవన్‌ 

బయటపడిన ఓటమి భయం

స్థానిక సంస్థల ఎన్నికలు రిఫరెండంగా తీసుకోలేమని వెల్లడి 

ప్రజా వ్యతిరేకతతో గెలవలేమని ముందే గ్రహించిన నేతలు 

అందుకే వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు 

నామినేషన్లు అడ్డగింత, ఏకగ్రీవాలకు కుట్ర 

సూపర్‌ సిక్స్‌ అమలుపై అవే అబద్ధాలు 

బీసీలకు 34 శాతం సీట్ల హామీకి మంగళం 

సర్దుబాటుపైనా పొంతన లేని మాటలు

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ప్రజల మద్దతు తమకు లేదని చంద్రబాబు సారథ్యంలోని కూటమి స్వయంగా అంగీకరించింది. స్థానిక ఎన్నికలను ప్రజాభిప్రాయంగా (రిఫరెండంగా) తీసుకోలేమని చెప్పడం ద్వారా రెండున్నరేళ్ల పాలనలో చేసిందేమీ లేదని పరోక్షంగా ఒప్పేసుకొంది. అనేక వివాదాలు, గొడవల నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు పూర్తయిందని చెప్పుకోవడం కోసం టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వ బేలతనం బయటపడిపోయింది. తమ పాలన అద్భుతమని పైకి చెప్పుకున్నా, ఈ ఎన్నికలు రిఫరెండం కాదని పవన్, మిడ్‌టర్మ్‌ అప్రైజల్‌ (మధ్యంతర సమీక్ష) కాదని చంద్రబాబు తేల్చి చెప్పడాన్ని బట్టి గెలుపుపై వారికి నమ్మకం లేదని రూఢీ అవుతోంది.  

దేశంలోనే నంబర్‌ వన్‌ అయితే అంత జంకెందుకో..? 
రెండున్నరేళ్లలో రాష్ట్రాన్ని మార్చేశామని, సంక్షేమంలో దేశంలోనే నంబర్‌ వన్‌ అని సొంత డప్పు కొట్టుకుంటున్న చంద్రబాబు.. ఆ పాలనకు స్థానిక ఎన్నికలను తీర్పుగా స్వీకరించడానికి ఎందుకు జంకుతున్నారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. నిజానికి చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతోంది. ఎన్నికల్లో ఇచి్చన సూపర్‌ సిక్స్‌ సహా ఏ హామీ అమలు చేయకుండా మోసం చేయడం, రాష్ట్రంలో ఏమాత్రం అభివృద్ధి లేకపోవడంతో చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దీనికితోడు ప్రభుత్వ స్థాయి నుంచి కింది స్థాయి వరకు అవినీతి విలయ తాండవం చేస్తుండటం ప్రజలకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ప్రజా సమస్యలు పరిష్కారం కాకపోగా.., వేధింపులు, బెదిరింపులు, అధికార పార్టీ నేతల అరాచకాలు, పెరిగిపోయిన నేరాలు, ఘోరాలు, ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులతో రాష్ట్రాన్ని చంద్రబాబు నయా బిహార్‌గా మార్చేశారనే ఆందోళన సామాన్య ప్రజల నుంచి మేధావి వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో గెలుపుపై వారిలో ధీమా కనిపించడం లేదు. 

ఓటమి భయంతోనే దౌర్జన్యాలు 
జనం ఓట్లేయరనే భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల దశ నుంచే ప్రతిపక్ష అభ్యర్థులపై కూటమి నేతలు దాడులు, అరాచకాలు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. నామినేషన్లు వేయనీయకుండా బెదిరింపులు, కిడ్నాపులు.. పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ సాగించిన గూండాయిజాన్ని రాష్ట్రమంతా చూసింది. ప్రతిపక్ష అభ్యర్థులను బరిలో లేకుండా చేసి అనేకచోట్ల ఏకగ్రీవాలు చేసుకున్నారు. ప్రతిపక్ష పార్టీ ఎంపీలపైనే హత్యాయత్నాలు, ఆ పార్టీ నేతల కార్ల దగ్ధం, ధ్వంసం, మహిళా అభ్యర్థులపై కీచకపర్వం.. ఈ ఎన్నికల్లో టీడీపీ మూకలు చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. 

ఒకవైపు స్థానిక ఎన్నికలను రక్తసిక్తం చేసి హింసాత్మకంగా మార్చిన చంద్రబాబు.. మీడియా సమావేశాల్లో మాత్రం తన రాజకీయ జీవితంలో హింసకు తావే లేదని చెబుతుండటం చూసి మహానటులే నివ్వెరపోతున్నారు. తమ అభ్యర్థులకు రక్షణ లేదని ప్రతిపక్షం న్యాయస్థానాలను ఆశ్రయిస్తే దాన్ని కూడా నేరంగా చిత్రీకరించడం చంద్రబాబు నైజాన్ని పట్టిచూపుతోంది. హింసకు తావు లేదని నీతులు చెప్పిన పవన్‌.. అదే నోటితో ప్రతిపక్షం 2.0 చూపిస్తే తాము పది రెట్లు చూపిస్తామని హెచ్చరించడం ఏమిటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.  

సూపర్‌ సిక్స్‌ అమలు చేయకుండానే.. 
సూపర్‌ సిక్స్‌ అమలు చేశామంటూ చంద్రబాబు, పవన్‌ మళ్లీ అబద్ధాలు వల్లె వేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 ఇస్తామన్న హామీ ఏమైంది? నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి ఎక్కడ? 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.4 వేల పింఛన్‌ ఊసేది? ఇలాంటివి ఇంకా ఎన్నో అమలు చేయకుండానే సూపర్‌ సిక్స్‌ అమలు చేశామని చెప్పి జనాన్ని నిలువునా మోసం చేస్తున్నారు. వీటని ప్రజలు ప్రశ్నిస్తూనే ఉన్నారు. 

బీసీలకు వెన్నుపోటు 
జనాభా దామాషా ప్రకారం రాజ్యాధికారం, సోషల్‌ రీ­ఇంజినీరింగ్‌.. అంటూ బాబు ఉపన్యాసాలు దంచినా, సా­్థనిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇ­వ్వకుండా మంగళం పాడేశారు. బీసీ రిజర్వేష­న్లు ఇ­చ్చా­కే ఎన్నికలకు వెళ్తామని చెప్పి.. ఆ హామీని గంగలో కలిపేశారు.  

సమన్వయం ఉందంటూనే.. సర్దుబాటులో తలనొప్పులట! 
దేశంలో ఎక్కడా లేని సమన్వయం తమ కూటమిలో ఉందని ఒకవైపు చెబుతున్న కూటమి నేతలు.. మరోవైపు సీట్ల సర్దుబాటులో తలనొప్పులు వచ్చాయని, చంద్రబాబు, లోకేశ్‌ నలిగిపోయారని చెప్పడాన్ని బట్టి వారి మాటలకు ఒకదానికొకటి పొంతన లేదని స్పష్టమవుతోంది. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత కసరత్తు ఎప్పుడూ చేయలేదని చంద్రబాబే ఒప్పుకున్నారు. ఐక్యత అంత బలంగా ఉంటే.. సహకరించని వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని ఎందుకు హెచ్చరించాల్సి వచ్చిందన్న ప్రశ్నకు వారి వద్ద జవాబు లేదు. 

ఇదో విడ్డూరం..! 
తుపాను వల్ల సీట్ల సర్దుబాటు మరింత కష్టమైందని పవన్‌ చెప్పడం మరో విడ్డూరం. నెల రోజులుగా సీట్ల చర్చలు జరుపుతూ, రెండు రోజుల క్రితం వచ్చిన తుపానును సాకుగా చూపడం అబద్ధం కాక మరేమిటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. పైగా మర్నాడే తుపాను తీరం దాటనున్న వేళ, ఉదయం నుంచే వర్షాలు మొదలైనా, సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరూ గంటల తరబడి ఎన్నికల ప్రెస్‌మీట్‌లోనే గడ³డాన్ని తప్పుపడుతున్నారు. మొత్తంగా చూస్తే.. పాలనపై నమ్మకం లేదు, హామీలపై సమాధానం లేదు, కూటమిలో సఖ్యత లేదు. అందుకే పోలింగ్‌కు ముందే రిఫరెండం కాదంటూ కూటమి నేతలు చేతులెత్తేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement