షర్మిలకు వైఎస్ భారతి లేఖ రాశారంటూ అబద్ధపు ప్రచారం
‘స్థానిక’ అరాచకాల నుంచి దృష్టి మళ్లించేందుకు బాబు అండ్ కో దుర్మార్గం
నిజాయితీగా గెలిచే దమ్ము లేక.. ఫేక్ ప్రచారంతో లబ్ధి పొందే కుట్ర!
నామినేషన్ల నుంచి విత్‌డ్రాల వరకు అష్టకుట్రలు.. అరాచకాలు
అందుకే విజయాలను కూడా సెలబ్రేట్ చేసుకోలేని దుస్థితిలో బాబు గ్యాంగ్
ఫేక్ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన వైఎస్సార్‌సీపీ
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో కిరాయి గంజాయి ముఠాలతో అడ్డగోలుగా దాడులు చేయించి.. పోలీసుల ద్వారా భయోత్పాతం సృష్టించి.. అష్టకుట్రలకు పాల్పడి నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకుని.. నామినేషన్లు వేసిన వారిని తీవ్ర స్థాయిలో బెదిరించి ఉపసంహరించుకునేలా చేసి.. ఏకగ్రీవం చేసుకోవడాన్ని ప్రజలు తీవ్ర స్థాయిలో అసహ్యించుకుంటుండటంతో.. టీడీపీ మరో డైవర్షన్ కుట్ర రాజకీయాలకు తెరతీసింది. షరి్మలకు వైఎస్ భారతి లేఖ రాశారంటూ ఓ నకిలీ లేఖను సృష్టించి ‘ఎక్స్’ వేదికగా మంగళవారం మధ్యాహ్నం అబద్ధపు ప్రచారానికి తెరతీసింది. సాయంత్రం 6.30 గంటలకు చంద్రబాబుకు భజన చేసే ఎల్లో ఛానళ్లలో వారే సృష్టించిన నకిలీ లేఖపై చర్చ పెట్టి... వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై విషం చిమ్మడంపై ప్రజలు చీదరించుకుంటున్నారు.
ఫేక్ లేఖ .. ఫేక్ ప్రచారం..
ఇంతకన్నా దిగజారిపోరులే.. అని అనుకున్న ప్రతిసారి అధఃపాతాళానికి దిగజారి.. సిగ్గూ ఎగ్గూ లేకుండా నీతిబాహ్యమైన రీతిలో చంద్రబాబు గ్యాంగ్ విషం కక్కుతుండటంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నకిలీ లేఖను సృష్టించి వైఎస్ భారతి లేఖ అంటూ ఎల్లో మీడియాలో బ్రేకింగులు వేసి నమ్మించే కుట్ర చేస్తుండటాన్ని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండిస్తూ ‘ఎక్స్’లో పోస్టు చేసింది. ‘టీడీపీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ దిగజారుడు రాజకీయాల్లో రోజురోజుకీ హద్దులు దాటేస్తున్న పచ్చమంద... వైఎస్ భారతి పేరుతో ఫేక్ లేఖను ఒకటి క్రియేట్ చేసి.. ఎల్లో మీడియా, టీడీపీ అనుకూల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో సర్క్యులేట్ చేశారు. స్థానిక ఎన్నికల వేళ నిజాయితీగా గెలిచే దమ్ము లేక.. ఇలా ఫేక్ ప్రచారంతో లబ్ధి పొందే కుట్రలు చేస్తున్నావా? చంద్రబాబూ?’ అంటూ వైఎస్సార్‌సీపీ ‘ఎక్స్’లో పోస్టు చేసింది.
ఇదేం ముష్టి ప్లాన్ బాబూ?!
స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలను సెలబ్రేట్ చేసుకోలేని దుస్థితిలో చంద్రబాబు గ్యాంగ్ ఉంది. ఎందుకంటే ఇవి నీతి నిజాయితీలతో సాధించిన విజయాలు కావు. నామినేషన్ల నుంచి విత్‌డ్రాల వరకు అన్ని దశల్లోనూ అధికారపార్టీ చేసిన అరాచకాలు, అక్రమాలను ప్రజలు చీదరించుకుంటున్నారు. స్థానిక ఎన్నికల్లో తమదే పైచేయి అని చెప్పుకోవడం కోసం అష్టకుట్రలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.. రాష్ట్రాన్ని అరాచక ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారు.
నామినేషన్ వేయకముందే పోటీ చేయాలనుకునే వారికి బెదిరింపులు... బైండోవర్ చేయడం.. ముందస్తు అరెస్టులు.. నాయకుల గృహ నిర్భంధాలు.. కిరాయి గూండాలు, గంజాయి మూకలతో నామినేషన్ కేంద్రాలు నింపేశారు. పోలీసులు చూస్తుండగానే దాడులు చేయడం, ఆర్వో చేతిలో పత్రాలు లాక్కుని చింపేయడం, బాధిత అభ్యర్థులపైనే కేసులు పెట్టడం, బలవంతపు విత్‌డ్రాలు, నామినేషన్ పత్రాలలో కీలక డాక్యుమెంట్లు మాయం చేయడం, నామినేషన్లు తిరస్కరించడం.. అధికారాన్ని అడ్డంపెట్టుకుని, అధికారులను తోలు»ొమ్మల్లా చేసి ఆడిస్తూ, ఖాకీలకు పచ్చచొక్కాలేసి పనిచేయిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, ఎన్నికల ప్రక్రియకు పాతరేసి చంద్రబాబు గ్యాంగ్ చేసుకున్న ఏకగ్రీవాలను విజయాలంటారా? అందుకే చంద్రబాబు ఓ ముష్టిప్లాన్ వేశారు.
ఓ నకిలీ లేఖ సృష్టించి ఎల్లో మీడియాలోకి వదిలారు. ఈ లేఖ ఏదో సంచలనం సృష్టించేస్తుందని, స్థానిక ఎన్నికల్లో తాను చేసిన దిగజారుడు రాజకీయాల నుంచి జనం దృష్టి మరల్చవచ్చని పథకం వేశారు. కానీ ఇలాంటి ముష్టి ప్లాన్‌లు వర్కవుట్ కావు బాబూ.. నీతిబాహ్యమైన నీ దిగజారుడు రాజకీయాలకు జనం బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుంది అని వైఎస్సార్‌సీపీ నాయకులు పేర్కొంటున్నారు.


