కడప నగరపాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ నేతలకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం
నామినేషన్ల సందర్భంగా టీడీపీ దాడులు, బెదిరింపులపై ఆరా
ధైర్యంగా ఎన్నికల బరిలో నిలిచిన పార్టీ శ్రేణులకు అభినందన
మేయర్ అభ్యర్థి బండి దీప్తిరెడ్డి గెలుపునకు కృషి చేయాలని పిలుపు
భాకరాపురం క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం
వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి సమస్యలు విన్నవించుకున్న ప్రజలు
వైఎస్సార్‌సీపీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులలో మంగళవారం సాయంత్రం కడప నగర పాలక సంస్థకు చెందిన పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. కడప కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలు, ఎన్నికల సన్నాహాలు, నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై సమీక్షించారు. పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. నామినేషన్ల దాఖలు సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు చేసిన దాడులు, బెదిరింపులపై ఆరా తీశారు. ఎదురైన ఆటంకాలు, పార్టీ అభ్యర్థులు ఎదుర్కొన్న ఇబ్బందులపై చర్చించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికార బలంతో ప్రతిపక్షాలను అణచి వేయాలని చూడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఎన్నికల్లో ప్రజల తీర్పే అంతిమమని.. దాడులు, బెదిరింపులతో ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకోలేరని స్పష్టం చేశారు. దాడులు, బెదిరింపులపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్ని దాడులు చేసినా వెనక్కు తగ్గకుండా ధైర్యంగా పోరాడి ఎన్నికల బరిలో నిలిచిన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఆయన అభినందించారు. పార్టీ శ్రేణులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. నేతలు, కార్యకర్తలు ఐక్యంగా, సమన్వయంతో పని చేసి మేయర్ అభ్యర్థి బండి దీప్తిరెడ్డి గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని కోరారు.
సమస్యలు వింటూ.. ఆప్యాయంగా పలకరిస్తూ
వైఎస్ జగన్ పులివెందుల పర్యటనలో భాగంగా మంగళవారం భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన్ను కలిశారు. రాజకీయాల పరంగా, వ్యక్తిగత సమస్యలు, స్థానికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి ఒక్కరినీ వైఎస్ జగన్ ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలను ఓపికగా విని.. యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరూ అధైర్య పడొద్దని, ఎలాంటి కష్టాలు ఎదురైనా సోదరుడిలా ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, పార్టీ తరఫున అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చిన వినతులు, విజ్ఞప్తులపై సంబంధిత పార్టీ నాయకులతో చర్చించిన జగన్.. ఆయా సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలపై దృష్టి సారించాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి, రమేష్ యాదవ్, మేయర్ అభ్యర్థి బండి దీప్తిరెడ్డి, మాజీ మేయర్లు కొత్తమద్ది సురేష్‌బాబు, పాకా సురేష్, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


