ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు
నదుల్లో జలాలు సాగుకు వినియోగించుకోకుండా సముద్రంలోకి వదిలేస్తున్నారు
కాళేశ్వరం పంపులు ఆన్ చేయకుండా పంటలు ఎండబెడుతున్నారు
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్
11న నిర్మల్‌లో భారీ సభ నిర్వహించనున్నట్లు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థ పాలన, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. ‘ఇది దేవుడు తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు.. రేవంత్‌రెడ్డి తన వైఫల్యాలతో ప్రజల నెత్తిన రుద్దిన కరువు..’అని మండిపడ్డారు. రాష్ట్రంలో సాగునీరు, యూరియా కొరత, విద్యుత్ సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. గోదావరి, కృష్ణా నదుల్లో నీళ్లు పారుతున్నా వాటిని సాగుకు వినియోగించుకోకుండా సముద్రంలోకి వదిలేస్తున్నారని, అందుబాటులో ఉన్న నీటిని రైతులకు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్మల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
కేసీఆర్ పాలనలో రైతులకు భరోసా
‘చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది. గాడిదను చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుంది. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని ఎప్పుడు చేసుకుందామా అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. తెలంగాణను ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడేయాలంటే కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ మళ్లీ గట్టెక్కుతుంది. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణకు 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి సదుపాయాలు అందించాం. రైతుబంధు, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలతో ప్రజలకు అండగా నిలిచాం. అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు మోసపోయారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే అన్నీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
మూడేళ్లు గడుస్తున్నా హామీలు ఎందుకు అమలు చేయలేదు? దీనిపై ప్రశ్నిస్తే మూడు నెలల్లో పిల్లలు పుడతారా అంటూ ముఖ్యమంత్రి మాట్లాడటం బాధ్యతారాహిత్యం. గోదావరి నుంచి 750 టీఎంసీలు, కృష్ణా నుంచి 250 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లింది. ఈ నీటిని వినియోగించుకుని ఉంటే కోటి ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉండేది. కాళేశ్వరం పంపులు ఆన్ చేస్తే ప్రాజెక్టుపై ఇంతకాలం చేసిన ఆరోపణలు తప్పని తేలిపోతాయనే భయంతోనే బటన్ నొక్కడం లేదు. దేవుడు తెలంగాణ ప్రజల కోసం నీళ్లు పంపిస్తే, మధ్యలో పూజారి రేవంత్‌రెడ్డి అడ్డుపడి బటన్ నొక్కకుండా అడ్డుకున్నారు. రైతుల కష్టాలను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలకే ప్రాధాన్యం ఇస్తున్నారు..’అని కేటీఆర్ ధ్వజమెత్తారు. నవంబర్ 11న నిర్మల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.


