ప్రైవేట్‌ హాస్పిటల్స్‌లో బిల్లుల మాయాజాలం | Hyderabad: Key Factors Behind Higher Bills for Insured Patients | Sakshi
Sakshi News home page

ఇన్సూరెన్స్‌ రోగుల విషయంలో డబుల్‌ గేమ్‌

Oct 27 2026 8:00 PM | Updated on Oct 27 2026 8:09 PM

Hyderabad: Key Factors Behind Higher Bills for Insured Patients

డిశ్చార్జి సమ్మరీల్లో ఇష్టారాజ్యంగా బాదుడు

చేయని సేవలకు బిల్లు వేస్తున్న వైనం

ప్రైవేట్, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో నిత్యకృత్యంగా వివాదాలు

రోగి బంధువులు నిలదీస్తే డిస్కౌంట్‌ పేరుతో తగ్గింపులు

హయత్‌నగర్‌ భాగ్యలత కాలనీకి చెందిన ఓ వ్యక్తి న్యుమోనియా అనుమానంతో ఏడాదిన్నర బాలుడిని ఈ నెల 2న రాత్రి ఎల్‌బీనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించాడు. మూడు రోజులకు రూ.90 వేల బిల్లు వేశారు. ఆసుపత్రిలో చేరిన రోజు డైట్‌ చార్జీలంటూ రూ.1,100 బాదారు. విచిత్రమేంటంటే ఆ రోజు బాబుకు కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని దుకాణం నుంచి మూడో ఫ్లోర్‌లోని వార్డుకు మందులు తీసుకెళ్లినందుకు హేండ్లింగ్‌ చార్జీలంటూ రూ.350 బిల్లు చూపారు. బీమా ప్రాసెసింగ్‌ ఫీజు అని రూ.వెయ్యి లాగారు. ఇలా మొత్తం రూ.90 వేలు చూపించి రూ.15 వేలు డిస్కౌంట్‌ ఇచ్చారు. బీమా రూ.70 వేలు వచ్చింది. అడ్వాన్స్‌గా చెల్లించిన రూ.5 వేలు బిల్లులో పట్టుకున్నారు.  

ముషీరాబాద్‌కు చెందిన మహిళ (56) బీపీ, షుగర్‌లో హెచ్చుతగ్గులతో ఈ నెల 9న బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి వెళ్లారు. 3 రోజులు ఉంచి, అవసరం లేని పరీక్షలన్నీ చేయించారు. బయోకెమిస్ట్రీ, ల్యాబ్, ఇన్విస్టిగేషన్స్‌ అంటూ మళ్లీ మళ్లీ బిల్లు వేశారు. మొత్తంగా రూ.89 వేల అయింది. రూ.6 వేలు డిస్కౌంట్‌ ఇచ్చారు. సాధారణ చెకింగ్‌కు వస్తే 80 వేలు అయ్యాయంటూ రోగి బంధువులు వాపోయారు.

కూకట్‌పల్లికి చెందిన ఓ మహిళ స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. ఇన్సూరెన్స్‌ పాలసీకి రెండు బెడ్‌ల గది షేరింగ్‌ వర్తిస్తుందని చెప్పారు. డిశ్చార్జి సమయంలో రూ.1.10 లక్షలు చెల్లించాలని చెప్పారు. అందేంటని అడిగితే మీ ఇన్సూరెన్స్‌లో జనరల్‌ వార్డు వచ్చింది. మీరు రెండు బెడ్‌ల షేరింగ్‌ రూంలో ఉండటంతో మొత్తం బిల్లు స్వరూపం మారిపోయిందని చెప్పారు. గట్టిగా నిలదీస్తే రూ.15 వేలు డిస్కౌంట్‌ ఇచ్చారు.

ఇటీవల మలక్‌పేట్‌లోని ఓ ఆసుపత్రిలో రోగి చికిత్స కోసం 24 గంటలే ఉన్నారు. కానీ, రెండు రోజులకు రూం చార్జీలు వేశారు. రోగి బంధువులు గుర్తించి, నిలదీస్తే తప్పు జరిగిందని రూ.4 వేలు తగ్గించారు.

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైద‌రాబాద్‌లోని కార్పొరేట్, ప్రైవేట్‌ ఆస్పత్రుల దోపిడీకి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ విషయంలో అధికారుల పర్యవేక్షణ, నియంత్రణ లేకపోవడం, వైద్యశాఖ నిర్వీర్యం కావడంతో ప్రైవేట్‌ ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. అసలు ఎందుకు ఎంత బిల్లు వేస్తున్నారో అర్థం కాకున్నా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. వైద్యులను, ఆస్పత్రి సిబ్బందిని అడిగే ధైర్యం లేక చాలామంది ఎలాగోలా అప్పులు చేసి మరీ బిల్లులు చెల్లిస్తున్నారు. ఇంకొందరు రోగంతో బాధపడుతున్నా.. ఆస్పత్రికి వెళ్తే ఎంత బిల్లువేస్తారోనని భయంతో ఇంటి వైద్యానికే పరిమితం అవుతున్నారు.  

సరిచూసుకోకుంటే అంతే.. 
బిల్లుల విషయంలో కొన్ని ఆస్పత్రులు మాయ చేస్తున్నాయి. చికిత్సలు, పరీక్షలు చేయకున్నా ఎడాపెడా బాదేస్తున్నాయి. తెచ్చిన మందులు అన్నీ వాడకున్నా.. అవి ఎటువెళ్తున్నాయో తెలియడం లేదు. ఒక్కోసారి గదుల బిల్లులు, మందులు, పరీక్షలకు సంబంధించి ఎక్కువ మొత్తం బిల్లు వేస్తున్నారు. రోగులెవరూ వాటిని సరి చూసుకోలేరులే అనే ధైర్యంతో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎవరైనా గుర్తించి గట్టిగా నిలదీస్తే తప్పును సరిదిద్దుతామంటూ కంటితుడుపు చర్యగా కొంత మొత్తాన్ని తగ్గిస్తున్నారు. డిశ్చార్జి సమయంలో బిల్లు సమ్మరీని చూసుకోకుంటే మీ జేబుకు కన్నం పడుతోందన్న విషయాన్ని  గుర్తుంచుకోవాలి.

నిత్యం గొడవలు.. వివాదాలు 
అధిక బిల్లులు, తప్పుడు చికిత్సలు, నిర్లక్ష్య బిల్లింగ్‌ వంటి కారణాలతో నగరంలో నిత్యం కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వివాదాలు చెలరేగుతున్నాయి. కొంచెం పరిజ్ఞానం ఉన్నవారైతే గట్టిగా నిలదీస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తికి నెబులైజర్‌ పెట్టినందుకు రూ.400 బిల్లు వేశారు. రోజులో మూడు దఫాలకు రూ.1,200 మోపారు. దీనిపై రూ.1,200 పెడితే కొత్త నెబులైజరే వస్తుంది కదా అని రోగి బంధువు నిలదీశాడు. ఏళ్ల తరబడి ఈ పరికరంతో రూ.వేలు వసూలు చేయడం ఏంటని మండిపడ్డాడు. ఇక ఆస్పత్రిలో డాక్టర్లే కాకుండా ఒక్కోసారి ఇతర ఆస్పత్రుల నుంచి స్పెషలిస్టు డాక్టర్లను పిలిపిస్తారు. వారి కన్సల్టెన్సీ ఫీజును ఏకంగా రూ.వేలల్లో చూపిస్తున్నారు.  

ఇదీ చ‌ద‌వండి: ప్యారడైజ్‌ హోటల్‌కు రూ.20 వేల జరిమానా

రోగి బంధువులు బాధితుడిని ఇంటికి తీసుకెళ్లే క్రమంలో బిల్లును క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉండటం లేదు. 90 శాతం మంది బిల్లు చెల్లించే సమయంలో డబ్బులు సర్దుబాటు చేసుకునే ఆందోళనలో పడి సమ్మరీ చూసుకోవడం లేదు. మరోవైపు నిత్యం ఎంతో కొంత చెల్లిస్తూ రావడంతో బిల్లులోని మొత్తం ముందే ఆస్పత్రికి ముడుతోంది. ఇది కూడా కొంత ఇబ్బందిగా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement