ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై అసమ్మతి గళాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు విస్తుగొల్పుతున్నాయి. 'టీడీపీ బలంగా ఉంది వాళ్ళకి సీట్లు ఎలా తగ్గించగలం' అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు జనసేన పార్టీలో కలకలం రేపాయి. టీడీపీ తమకు తక్కువ సీట్లు ఇచ్చిందని నెత్తినోరు కొట్టుకుంటున్న జనసైనికులు పవన్ మాటలతో నీరుగారిపోయారు. తమ తరపున మరిన్ని సీట్లు అడగాల్సింది పోయి.. సైకిల్ పార్టీ ఇచ్చిన సీట్లతోనే సర్దుకోమని జనసేనాని చెప్పడంతో జనసేన కార్యకర్తలు లబోదిబోమంటున్నారు.
సీట్ల సర్దుబాటుకు తుపాను గండం
స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల కేటాయింపులో తమ పార్టీకి తగిన న్యాయం జరగలేదంటూ పలు ప్రాంతాల్లో ఇప్పటికే జనసైనికులు నిరసనలకు దిగుతున్నారు. తమకు తగినన్ని సీట్లు ఇవ్వకుండా టీడీపీ అన్యాయం చేసిందని వాపోతున్నారు. తమకు పవన్ కల్యాణ్ న్యాయం చేస్తారని ఆశించిన జనసైనికులకు స్వయంగా ఆయనే ఊహించని విధంగా షాక్ ఇవ్వడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడిపోయారు. విజయవాడలో మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌తో కలిసి పాల్గొన్న పవన్ కల్యాణ్.. వింత వ్యాఖ్యలు చేశారు. అర్నాబ్ తుపాను కారణంగా సీట్ల సర్దుబాటు కుదరలేదని చెప్పుకొచ్చారు.
25 ఏళ్లు ఆగాల్సిందే!
అంతేకాదు ఆశావహులు అందరికీ సీట్లు ఇవ్వడం కుదరని చెప్పి జనసైనికుల ఆశలపై నీళ్లు చల్లారు. బీ ఫారమ్ ఇచ్చినవాళ్లే పోటీ చేయాలంటూ ఆదేశించారు. 'స్థానిక ఎన్నికలు రిఫరెండం కాదు, విజయానికి భంగం కలిగేలా ఎవరూ నడుచుకోవద్దు. పోటీకి సిద్ధంగా వేల మంది ఆశావహులు ఉన్నారు. ఈ సమయంలో తుపాను రావడం వల్ల సీట్ల సర్దుబాటు కుదరలేదు. టీడీపీ బలంగా ఉంది వాళ్ళకి సీట్లు ఎలా తగ్గించగలం? జనసేన బలం జనసేనకి ఉంది. కాకపోతే భారీ స్థాయిలో వెళ్లడానికి 25 ఏళ్లు పడుతుంది. కొందరు ఓట్లేసి ఉండొచ్చు.. కొందరు కేత్రస్థాయిలో తిరిగి ఉండొచ్చు.. ఆశావహులు ఉండొచ్చు. బీ ఫారమ్ దక్కిన వారే పోటీ చేయాల'ని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: ‘జనసేన జెండా మోసి తప్పు చేశాం!’
కార్యకర్తల దృష్టి మళ్లించడానికేనా?
కాగా, సీట్లు తక్కువ దక్కడంతో కారాలు మిరియాలు నూరుతున్న జనసేన కార్యకర్తల చూపు మళ్లించడానికి పవన్ కల్యాణ్.. అర్నాబ్ తుపానును ఆసరా చేసుకున్నారన్న వాదనలు విన్పిస్తున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు నిలదీయకుండా ఉండడానికే నెపాన్ని తుపాను మీదకు నెట్టేశారని సోషల్ మీడియాలో సైటర్లు విన్పిస్తున్నాయి. మీడియాతో మాట్లాడిన ముగ్గురు నేతలు.. తమ పార్టీలు ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాయో ప్రకటించలేకపోయారని ఎద్దేవా చేస్తున్నారు. కనీసం నంబరు కూడా చెప్పలేకపోయారని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.


