సాక్షి,కాకినాడ : జిల్లాలో జనసేన పార్టీలో సీట్ల కేటాయంపు వివాదం ఒక్కసారిగా భగ్గుమన్నది. పెద్దాపురం జెడ్పీటీసీ జనసేన అభ్యర్థి ఎంపిక రచ్చకెక్కింది. పార్టీ కోసం కష్టపడి జెండా మోసిన నాయకులను కాదని, చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చడంపై కార్యకర్తలు, ఆశావహులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా ఎంపీ ఇంటి ముందే పెట్రోల్ క్యాన్‌తో నిరసనకు దిగడం కలకలం రేగింది.
కాకినాడ జిల్లా పెద్దాపురం జెడ్పీటిసి జనసేన అభ్యర్థిగా గుడివాడకు చెందిన అంబటి గంగాధర్ నామినేషన్ దాఖలు చేశారు. తొలుత ఆయనకు టికెట్ ఇస్తామని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ స్వయంగా హామీ ఇవ్వడంతోనే ఆయన నామినేషన్ వేశారు. అయితే, చివరి నిమిషంలో సీన్ రివర్స్ అయింది. గంగాధర్‌కు కాకుండా అంబటి శివరాణికి పెద్దాపురం జెడ్పీటీసీ జనసేన టికెట్‌ను కేటాయించారు. తనకు ముందుగా మాటిచ్చి, ఆఖరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడంతో అంబటి గంగాధర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తన అనుచరులతో కలిసి నేరుగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ నివాసానికి చేరుకుని బైఠాయించి ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన చేతిలో పెట్రోల్ క్యాన్ పట్టుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసి, కష్టపడ్డ నాయకులకు జనసేనలో విలువ లేదా? అని ప్రశ్నించారు. కేవలం డబ్బున్న వ్యక్తులకే పెద్దపీట వేస్తూ, క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తల పొట్ట కొడుతున్నారని మండిపడ్డారు. పెద్దాపురం జనసేనలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు, ఎంపీ ఇంట జరిగిన నిరసన ఇప్పుడు జిల్లా రాజకీయల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఇదీ చదవండి : సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజుకు చుక్కెదురు


