విజయనగరం జిల్లా: రాజాం మున్సిపాల్టీ పరిధి కొండంపేటలో ఈ నెల 25న జరిగిన లలితకుమారి మృతికి సంబంధించిన కేసులో భర్తే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు వివరాలను రాజాం టౌన్ సర్కిల్ కార్యాలయంలో సీఐ డి.నవీన్‌కుమార్ విలేకరుల సమావేశంలో సోమవారం వెల్లడించారు.
కొండంపేట గ్రామానికి చెందిన గుడివాడ సీతారామరాజుతో 2003లో లలితకుమారికి వివాహం జరిగింది. 2017లో విద్యుత్‌శాఖలో ఆమె ఉద్యోగం సాధించి వీరఘట్టంలో విధులు నిర్వహించేది. ఉద్యోగరీత్యా సహచర ఉద్యోగులతో చనువుగా ఉండడం భర్త సహించేవాడు కాదు. అప్పటి నుంచి అనుమానించడంతో పాటు ప్రతి చిన్నవిషయానికి ప్రశ్నించడం మొదలు పెట్టాడు. దీంతో అక్కడి నుంచి రాజాం, మళ్లీ చీపురుపల్లి ఆమెకు ట్రాన్స్‌ఫర్ అయింది.
ఆమె రాత్రి సమయాల్లో ఆలస్యంగా ఇంటికి రావడంతో అనుమానం మరింత బలపడింది. దీంతో తరచూ గొడవలు పడేవారు. ఆమెపై తీవ్రంగా అనుమానం పెంచుకున్న సీతారామరాజు ఆమె తన మాట వినదని గ్రహించి ఆమెను అంతమొందించాలని పథకం వేసుకున్నాడు. పథకం ప్రకారమే హత్యచేసి రోడ్డు ప్రమాదంలా నమ్మించాలని చూశాడు. చివరకు పోలీసుల ధర్యాప్తులో హత్యగా నిర్దారణ అయ్యిందని సీఐ వెల్లడించారు. అటు తల్లి మృతి, ఇటు తండ్రి జైలు పాలు కావడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు.
హత్య చేశాడిలా..
భార్యను హత్యచేసేందుకు పథక రచన చేసిన సీతారామరాజు ముందుగా తాను కొనుగోలుచేసిన గొడ్డలిని దాచుకున్నాడు. ఎప్పుడు గొడవ జరిగినా లలిత కుమారి విశాఖపట్నంలోని పుట్టింటికి వెళ్లిపోయేది. పిల్లల కోసం భర్తతో సర్దుకుని కాపురం చేసేది. శనివారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరగడం, ఆమె బ్యాగు సర్దుకోవడంతో ఎలాగైనా పుట్టింటికి వెళ్లిపోతుందనుకున్నాడు. అనుకున్న ప్రకారమే ఆదివారం వేకువజామున ఆమె బయలుదేరుతున్న సమయంలో నిన్ను బస్టాప్‌లో డ్రాప్ చేస్తానని చెప్పి స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ ఇద్దరు కలిసి స్కూటీపై ఇంటి నుంచి బయల్దేరారు.
పథకం ప్రకారం గొడ్డలి దాచిపెట్టిన స్థలానికి వచ్చి స్కూటీ ఆపి ఆమెతో గొడవ పడ్డాడు. శ్మశానవాటిక సమీపంలో తుప్పల్లో దాచిన గొడ్డలి తీసి తలపై బలంగా నరకడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. మృతదేహాన్ని అక్కడినుంచి పక్కకు లాగేసి స్కూటీ రోడ్డుపై పడేసి వెళ్లిపోయాడు. ప్రమాదం జరిగిందని నమ్మించే ప్రయత్నంలో తనకేమీ తెలియదన్నట్లు వ్యవహరించాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీసి భర్తే ఆమెను హత్యచేశాడని నిర్ధారించుకుని అదుపులోకి తీసుకున్నారు. సమీపంలోని సీసీ పుటేజీని పరిశీలించామని అందులో ఇద్దరూ స్కూటీపై వచ్చినట్లు రికార్డ్ అయిందని సీఐ చెప్పారు. అలాగే ఆమెను గొడ్డలితో నరకగా రక్తం నిందితుడి చేతికి తుళ్లడం వంటి ఆధారాలతో అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించామని సీఐ వెల్లడించారు. సమావేశంలో ఎస్సై మహ్మద్ సల్మాన్ బేగ్, ఏఎస్సై డి.రాజశేఖర్, సిబ్బంది ఉన్నారు.


