ఒక డ్రైన్‌– రెండు శాఖలు... | Andhra Pradesh Godavari Delta Drainage Flooding Farmers | Sakshi
Sakshi News home page

ఒక డ్రైన్‌– రెండు శాఖలు...

Oct 27 2026 8:21 AM | Updated on Oct 27 2026 8:21 AM

Andhra Pradesh Godavari Delta Drainage Flooding Farmers

సెప్టెంబరు చివరి వారంలో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలో లక్ష ఎకరాలకు పైగా పంటలు నీట మునిగాయని ప్రాథమిక అంచనా; అందులో సగానికి పైగా కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల్లోనే. వర్షం ప్రకృతి చేతిలో ఉంటుంది; కురిసిన నీరు ఎన్ని రోజుల్లో పొలం విడిచిపోతుందన్నది మాత్రం మురుగు కాలువల (డ్రైన్ల) చేతిలో ఉంటుంది. పొలం నుంచి సముద్రం దాకా సాగే ఒకే మురుగు మార్గాన్ని రెవెన్యూ, జలవనరుల శాఖల మధ్య ముక్కలు చేసిన పాలనా లోపం పెద్ద సమస్య అయ్యింది.

కాలువలు పొలాలకు నీరు తెస్తే, డ్రైన్లు ఆ నీటిని బయటకు తీసుకుపోతాయి.  సముద్ర మట్టానికి పది మీటర్ల లోపు ఎత్తున్న చదునైన డెల్టాలో నీరు తనంతట తాను బయటకు పోదు. వర్షం, నదీ వరద ఒకేసారి వస్తే డ్రైన్ల ఒడ్డు భూములు 30–40 రోజుల దాకా నీటిలోనే ఉంటాయి. వరి మూడు నాలుగు రోజుల ముంపునే తట్టుకుంటుంది. తూర్పు, పశ్చిమ డెల్టాల డ్రైనేజీని తొలుత సుమారు 1.8, 2.2 లక్షల ఎకరాలకు రూపొందించారు. నేడు ఆయకట్టు రెట్టింపు దాటి ఏటా రెండు మూడు పంటలు పండుతున్నా డ్రైన్ల సామర్థ్యం ఆ మేరకు పెరగలేదు.

గోదావరి డెల్టాలో జలవనరుల శాఖ వర్గీకరించిన మేజర్, మీడియం, మైనర్‌ డ్రైన్లు సుమారు 980 ఉన్నాయి. వాటి పొడవు సుమారు 4,180 కిలోమీటర్లు. వీటికి ఆవల పొలాల మధ్య నుంచి సాగే రెవెన్యూ డ్రైన్‌ లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 891 కిలోమీటర్లు ఉన్నాయి. పొలం నుంచి సముద్రం దాకా నీటి దారి ఒక్కటే; కానీ చాలాచోట్ల ఒకే డ్రైన్‌ లైనులో ఒక భాగం జలవనరుల శాఖ నోటిఫై చేసింది, మరో భాగం రెవెన్యూ లేదా ప్రైవేటు డ్రైన్‌. జలవనరుల శాఖ తన భాగాన్ని తవ్వినా రెవెన్యూ భాగం పూడుకుపోతే పొలం నీరు మేజర్‌ డ్రైన్‌ దాకా చేరదు.

ఈ లోపాలకు నిలువుటద్దం కోనసీమలో 22.3 కిలోమీటర్లు సాగి వైనతేయ పాయలో కలిసే శంకరగుప్తం మేజర్‌ డ్రైన్‌. దీని సముద్ర ముఖద్వారం ఇసుక మేటలతో మూసుకుపోయి దిగువ 8.4 కిలోమీటర్ల నీటికి దారే లేదు. వరద వేళ నదీ నీరు, పోటు వేళ సముద్రపు నీరు లోపలికి తన్నుతాయి. ఇటీవల అదే దారిన ఉప్పు నీరు కేశనపల్లి సహా 13 గ్రామాల కొబ్బరి తోటల్లోకి చొచ్చుకు వచ్చింది. సుమారు లక్ష కొబ్బరి చెట్లు ఎండి పోయాయనీ, రెండు ఖరీఫ్‌లలో సుమారు 6,000 ఎకరాల పంటలు మునిగాయనీ 2026 ఫిబ్రవరిలో శాసనసభలోనే నమోదైంది.

డెల్టా రైతు మరో పంటను ముంపుకు కోల్పోకముందే ఈ సమస్యకు శాశ్వత ముగింపు పలకాలి. అందుకు కావలసింది కొత్త కమిటీలు కాదు. ఇప్పటికే కొన్ని కమిటీ నివేదికలు ఉండనే ఉన్నాయి. దృఢమైన నిర్ణయం, రెవెన్యూ, లోకల్, ప్రైవేటు డ్రైన్లన్నిటినీ నోటిఫై చేసి పొలం నుంచి సముద్రం దాకా మొత్తం డ్రైనేజీ నెట్‌వర్క్‌ జలవనరుల శాఖ ఒక్కదాని కిందకు తేవాలి. అది పూర్తయ్యే దాకా ప్రతి ఖరీఫ్‌కు ముందు... రెండు శాఖలూ డ్రైన్‌ లైను వారీగా ఉమ్మడి, కాలపరిమిత పూడికతీత ప్రణాళిక అమలు చేయాలి. ఆక్రమణ లను తొలగించాలి. డ్రైన్‌లను సర్వేచేసి హైడ్రాలిక్‌ పర్టిక్యులర్స్‌ని డిస్‌ఛార్జ్‌ ప్రకారంసరిచేయాలి. రెట్టింపైన ఆయ కట్టుకు తగ్గట్టు డ్రైన్ల సామర్థ్యం పెంచాలి. కొబ్బరి రైతులకు తగిన పరిహారం ఇవ్వాలి.
– కొవ్వూరి త్రినాథ రెడ్డి, ఏపీ వైఎస్సార్‌సీపీ రైతు విభాగం ఉపాధ్యక్షుడు, రాష్ట్ర నీటిసంఘాల అసోసియేషన్‌ మాజీ ప్రధాన కార్యదర్శి

ఇదీ చదవండి: విద్యాలయాలా? వినోద వేదికలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement