విద్యా ప్రాంగణాలు సంస్కారానికి, నైతిక విలువలకి, మేధో వికాసానికి పునాదులు వేయాల్సిన పవిత్ర వేదికలు. విద్యార్థి భవితవ్యాన్ని తీర్చిదిద్ది, పరిశోధనలు, ప్రాక్టికల్ నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు, సామాజిక స్పృహపై దృష్టి సారించాల్సిన విద్యాసంస్థలు నేడు వినోద కేంద్రాలుగా, సినిమా ప్రమోషన్ల అడ్డాలుగా రూపాంతరం చెందుతుండటం విద్యా వ్యవస్థను పట్టిపీడిస్తున్న తీవ్ర సమస్య.
తెలంగాణ సాంస్కృతిక జీవనాడి అయిన బతుకమ్మ, ఆధ్యాత్మిక భావనను పెంచే నవరాత్రి వేడుకలను కాలేజీల్లో నిర్వహించడం తప్పు కాదు. కానీ, ఆ ఉత్సవాల ముసుగులో చేస్తున్న తంతు అసలు స్ఫూర్తికే గొడ్డలిపెట్టుగా మారుతోంది. ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ వేళ క్యాంపస్‌లలో మారుమోగాల్సింది జానపద లయలు, సంస్కృతీ వైభవం. అందుకు భిన్నంగా అశ్లీల భావాలు ధ్వనించే సినిమా పాటలు, ఐటమ్ సాంగ్స్, అసందర్భ కేరింతలతో పవిత్ర వేడుకలను అపహాస్యం చేస్తున్నారు. పండుగ సంప్ర దాయ ఔన్నత్యాన్ని తుంగలో తొక్కి, యువతను ఆకర్షించేందుకు సాగించే ఈ వాణిజ్య వికృత చేష్టలు విద్యా ప్రమాణాల పతనావస్థను తెలియ జేస్తున్నాయి.
ఈ క్రమంలో భారత రాజ్యాంగం కల్పించిన విధివిధానాలను ప్రతి యాజమాన్యం విధిగా గుర్తుంచుకోవాలి. ఆర్టికల్ 28(1) ప్రకారం ప్రభుత్వ నిధులతో నడిచే ఏ విద్యాసంస్థలోనూ మతపరమైన బోధనలకు, ప్రత్యేక పూజలకు తావులేదు. ఆర్టికల్ 28(3) ప్రకారం ఎయిడెడ్, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ సంస్థలు సాంస్కృతిక లేదా సాంప్రదాయ వేడుకలు నిర్వహించి నప్పటికీ, ఏ ఒక్క విద్యార్థినీ బలవంతంగా అందులో పాల్గొనేలా ఒత్తిడి చేయకూడదు. హాజరు, అంతర్గత మార్కులను వేడుకలతో ముడిపెట్టడం, పండుగల పేరిట విద్యార్థుల నుంచి బలవంతపు చందాలు లేదా ఫీజులు వసూలు చేయడం చట్టరీత్యా చెల్లదు. సాంస్కృతిక స్వేచ్ఛ పేరిట లౌకిక, విద్యా సంబంధ వాతావరణాన్ని విస్మరించడం సమర్థనీయం కాదు.
మరోవైపు, వాణిజ్య ప్రయోజనాల కోసం సినిమా బృందాలు కాలేజీలను ఎంచుకోవడం సర్వసాధారణమైపోయింది. విద్యార్థుల వయస్సుకు ఏమాత్రం తగని కంటెంట్ ఉన్న చిత్రాలు, హింసను లేదా వికృత ధోరణు లను ప్రోత్సహించే సినిమాల ప్రచార కార్యక్రమాలను యాజమాన్యాలే ముందుండి నిర్వహించడం బాధ్యతా రాహిత్యం. సెలబ్రిటీలను తీసుకొచ్చి ప్రచార ఆర్భాటం చేయడం వల్ల కాలేజీకి ఉచిత పబ్లిసిటీ వస్తుందనే భావన తప్ప, దీనివల్ల విద్యార్థుల ఏకాగ్రత, క్యాంపస్ పవిత్రత ఎంతలా మంట గలుస్తున్నాయో యాజమాన్యాలు విస్మరిస్తున్నాయి.
విద్యార్థికి అందించే నాణ్యమైన విద్య, ఉద్యోగావకాశాలు, క్రమశిక్షణే సంస్థకు శాశ్వత గుర్తింపును తెస్తాయి. ఉన్నత విద్యామండలి, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వాలు తక్షణమే స్పందించి క్యాంపస్‌లను వాణిజ్య వినోద కేంద్రాలుగా మార్చే పోకడలకు కఠిన మార్గదర్శకాలతో అడ్డుకట్ట వేయాలి.
– డా. మేడా జగన్మోహనరావు, విద్యారంగ నిపుణులు
ఇదీ చదవండి: స్టేషన్‌కు పిలిస్తే వెళ్లాలా?


