breaking news
campuses
-
ఇది ఆరంభం మాత్రమే
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘ ఐటీరంగం విస్తరణలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారుతోంది. వరంగల్‌లో టెక్ మహీంద్రా, సైయంట్ ఐటీ ఇంక్యుబేషన్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇది ఆరంభం మాత్రమే. ఈ రెండు కంపెనీలు రావడంతోనే సంతృప్తి చెందట్లేదు. హైదరాబాద్ తర్వాత అంతటి పెద్ద నగరం వరంగల్. ఇంకా చాలా కంపెనీలు రావాలి. వేలాది మందికి ఉద్యోగాలు లభించాలి. వరంగల్‌కు తొలుత ఒక్క సైయంట్ కంపెనీ వచ్చింది. ఆ తర్వాత టెక్ మహీంద్రా వచ్చింది. ఒక దాని తర్వాత మరో కంపెనీ వస్తుంది. హైదరాబాద్, వరంగల్ కాదు.. కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మంతో పాటు దశల వారీగా అన్ని ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరిస్తాం. దీంతో స్థానిక యువతకు ఉద్యోగాలు లభించాలన్నదే సీఎం కేసీఆర్ కల. ఈ కల సాకారం కానుంది’అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా మడికొండలోని ఐటీ సెజ్‌లో ఏర్పాటు చేసిన టెక్ మహీం ద్రా, సైయంట్ ఐటీ ఇంక్యుబేషన్ సెంట ర్లను కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. అభివృద్ధి, సంక్షేమ రంగంలో రాష్ట్రం దేశానికి మార్గదర్శకంగా ఉందని.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. మడికొండలోని ఐటీ సెజ్‌లో టెక్ మహీంద్రా కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న సీఈఓ గురునాని, మంత్రి కేటీఆర్ పారిశ్రామిక కారిడార్.. ‘రెండేళ్ల కిందట ఆనంద్ మహీంద్రా, బీవీఆర్ మోహన్‌రెడ్డిని కలిసి వరంగల్‌లో కంపెనీ పెట్టాలని కోరాం. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వారు కంపెనీలు పెట్టారు. ఐటీ తెలం గాణ జిల్లాల కు విస్తరించడం వరంగల్ నుంచి ప్రారంభమైంది. టెక్ మహీంద్రా, సైయంట్ కంపెనీ ల ఏర్పాటు ద్వారా హైదరాబాద్ కాకుండా తెలంగాణ జిల్లాల్లో శ్రీకారం జరిగింది. ఈ కంపెనీల ద్వారా వరంగల్‌లో 10 వేల మందికి ఉపాధి కల్పించాలి’అని కేటీఆర్ కోరారు. హైదరాబాద్–వరంగల్ మార్గం పారిశ్రామిక కారిడార్‌గా మారబోతోందని స్పష్టం చేశారు. ఆలేరు, భువనగిరి, జనగామ ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. మహబూబాబాద్‌లో ఆహారశుద్ధి ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఐటీ, వ్యాపార, పరిశ్రమల వరంగల్ ప్రాంతాలను మరింత విస్తరించేందుకు మామునూరు ఎయిర్‌పోర్టును తిరిగి ప్రారంభించే ప్రయత్నం చేస్తామన్నారు. జీఎంఆర్ సంస్థనే ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు వివరించారు. ఈ దిశగా సీఎం కేసీఆర్ చర్చలు జరుపుతున్నారని, సానుకూలంగా స్పందించే అవకాశముందన్నారు. అప్పటి వరకు హెలీపోర్ట్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆలోచన చేస్తున్నామన్నారు. మరో హరిత విప్లవం.. రాష్ట్రంలో త్వరలోనే రెండో హరిత విప్లవం రాబోతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సాగు, తాగు నీటి విషయంలో సీఎం కేసీఆర్ విజన్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ నిర్మూలనకు విప్లవాత్మకమైన మార్పులతో టీఎస్ ఐపాస్ ద్వారా పెట్టుబడులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నట్లు గుర్తుచేశారు. ప్రభుత్వ పథకాలు యజ్ఞంలా కొనసాగుతున్నాయని, కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరాన్ని కాలంతో పోటీ పడి నిర్మించుకుంటున్నట్లు చెప్పారు. ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలో 1.25 కోట్ల ఎకరాల భూమి సాగులోకి రానుందని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి పెట్టామని, ఇప్పటికీ 12 వేల పరిశ్రమలకు అనుమతులిచ్చామని, తద్వారా రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 13 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి కల్పించామని వివరించారు. కొరియాకు చెందిన యంగ్టక్ కంపెనీ 8 ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిందని తెలిపారు. మరో 18 సంస్థలు టెక్స్టైల్స్ పార్కులో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు వస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటల రాజేందర్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్‌లు దాస్యం వినయ్‌భాస్కర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, సైయంట్ వ్యవస్థాపకుడు బీవీఆర్ మోహన్‌రెడ్డి, టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్ నాని, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, ఎంపీలు బండ ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ పోచం పల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇన్ఫీలో భారీగా ఉద్యోగుల నియామకం
బెంగళూరు: భారీగా ఉద్యోగాలకు కోత పెడతారంటూ ఓ వైపు ఐటీ ఇండస్ట్రీ నుంచి తీవ్ర ప్రతికూల సంకేతాలు వస్తుండగా.. దేశీయ రెండో అతిపెద్ద ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది వార్షికంగా క్యాంపస్ రిక్రూట్ మెంట్ కింద 20వేల మంది ఇంజనీర్లను కంపెనీలోకి తీసుకోనున్నట్టు ప్రకటించింది. అయితే డిజిటల్, అనాలిటిక్స్ లాంటి కొత్త స్కిల్స్ ఉన్న అభ్యర్థులకే తాము ఎక్కువ ఛాన్స్ ఇవ్వనున్నామని తెలిపింది. ఇటీవల కాలంలో క్లయింట్స్ ఎక్కువగా డిజిటల్, క్లౌడ్, అనాలిటిక్స్ వైపు ఎక్కువగా దృష్టిసారిస్తున్నారని ఇన్ఫీ పేర్కొంది. సెప్టెంబర్ నుంచి వార్షిక క్యాంపస్ నియామకాలు చేపట్టనున్నట్టు ఇన్ఫీ అధికార ప్రతినిధి చెప్పారు. అదేవిధంగా ఎన్ని ఉద్యోగాలు కల్పించనున్నారో కూడా ఆయన ధృవీకరించారు. ఫిబ్రవరి వరకు ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్లేస్ మెంట్ల ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం నియామకాల పద్ధతిని మార్పు చేస్తున్నామని, విభిన్నమైన స్కిల్స్ ఉన్న హై-వాల్యు గ్రాడ్యుయేట్లు ఎక్కువగా ఆకట్టుకునే అవకాశముందని కూడా ఇన్ఫోసిస్ అధికార ప్రతినిధి తెలిపారు. స్కేల్ వైపు నుంచి స్కిల్ వైపు ఎక్కువగా ఐటీ సర్వీసుల సెక్టార్ ఫోకస్ చేసిందని కంపెనీలు చెబుతున్నాయి. అయితే అంతకముందు ఉద్యోగాలపై ఎలాంటి ప్రభావముండేది కాదని, చివరేడాదిలోనే ప్లేస్ మెంట్లో 95 శాతం మంది విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేయని ఆర్ వీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ట్రస్ట్ ఎంకే పాండురంగ శెట్టి చెప్పారు. కానీ వచ్చే ఏడాది మారుతున్న ఇంటస్ట్రి పరిస్థితులకు అనుగుణంగా కంపెనీలు ఎలా మారుతాయో వేచిచూడాల్సి ఉందన్నారు. 10వేల మంది అమెరికన్లకు స్థానికంగా ఉద్యోగాలు కల్పించనున్నట్టు గత నెలలోనే ఇన్ఫోసిస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
వనజాతర
వనదేవతల జాతర ఆరంభమైంది. భక్తుల పూనకాలు, ఒగ్గుడోలు నృత్యాల మధ్య కుంకుమభరిణె రూపంలో ఉన్న సారలమ్మను కోయపూజారులు గద్దెపైకి తీసుకురావడంతో జాతరలో తొలిఘట్టం మొదలైంది. బంగారం మొక్కుల చెల్లింపు, ఒడిబియ్యం సమర్పణతో జాతర ప్రాంగణాలు కిటకిటలాడాయి. జిల్లా వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. గురువారం సమ్మక్క భక్తులకు దర్శనమివ్వనుంది.