దూసుకొస్తున్న అర్నబ్‌ తుపాను | Cyclone Arnab likely to intensify into a very severe | Sakshi
Sakshi News home page

దూసుకొస్తున్న అర్నబ్‌ తుపాను

Oct 27 2026 6:02 AM | Updated on Oct 27 2026 6:02 AM

Cyclone Arnab likely to intensify into a very severe

గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ఏపీ తీరం వైపు

నేడు అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం

నేటి రాత్రికి తీరానికి దగ్గరగా రానున్న తుపాను

రేపు మధ్యాహ్నంలోగా యానాం వద్ద తీరాన్ని దాటే అవకాశం

అనంతరం తూర్పుగోదావరి, అల్లూరి జిల్లాల మీదుగా భద్రాచలం వైపు ప్రయాణం

11 జిల్లాల్లో, యానాంలో అతి భారీ వర్షాలు

140 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడి

సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్‌ తుపాను సోమవారం సాయంత్రం తీవ్ర తుపానుగా బలపడింది. ఉదయం గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదిలిన తుపాను సాయంత్రానికి 17 కిలోమీటర్ల వేగంతో ఏపీ తీరం వైపు దూసుకువస్తోంది. సోమ­వారం రాత్రికి ఇది విశాఖపట్నానికి 490 కిలోమీటర్లు, కాకినాడకు 560, మచిలీపట్నానికి 660, బాపట్లకు 730 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. మంగళవారం ఉదయానికి అతి తీవ్ర తుపానుగా బలపడి సాయంత్రా­నికి తీరానికి బాగా దగ్గరకు వస్తుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాత్రికి కాకినాడ తీరానికి మరింత చేరువై అక్కడి నుంచి కాకినాడ–యానాం వైపు తిరిగి బుధవారం మధ్యాహ్నంలోగా యానాం సమీపంలో అతి తీవ్ర తుపానుగానే తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. తీరం దాటాక తూర్పుగోదావరి, అల్లూరి జిల్లాల మీదుగా భద్రాచలం పరిసరాల వైపు ప్రయాణిస్తూ బుధవారం రాత్రికి తుపానుగా, గురువారానికి వాయుగుండంగా బలహీనపడి ఛత్తీస్‌గఢ్‌ వైపు కదులుతుంది. ఈ నేపథ్యంలో కోస్తా జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు, పెను గాలులు వీస్తాయని హెచ్చరిస్తూ రెడ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. 

నేడు గోదావరి జిల్లాలపై ప్రభావం
తుపాను తొలి ప్రభావం మంగళవారం గోదావరి జిల్లాలపై ఉండనుంది. అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలు, యానాంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి, విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

బుధవారం ఈ జిల్లాలకూ రెడ్‌అలెర్ట్‌
బుధవారం తీరాన్ని దాటే సమయంలో తుపాను ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఆ రోజు విశాఖ, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సైతం రెడ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. దీంతో బుధవారం విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలు, యానాంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, బాపట్ల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం దాటిన మరుసటి రోజు గురువారం కూడా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నాలుగు రోజులు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 


అంతకంతకు పెరగనున్న గాలుల తీవ్రత
తుపాను ప్రభావంతో మంగళవారం ఉదయం నుంచే తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రానికి ఈ గాలుల వేగం 60 నుంచి 70 కిలోమీటర్లకు పెరుగుతుందని పేర్కొంది. మంగళవారం రాత్రి నుంచి కృష్ణా నుంచి అనకాపల్లి వరకు ఉన్న జిల్లాల్లో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయి. బుధవారం తెల్లవారుజాము నుంచి తీరం దాటే వరకు గాలుల వేగం 115 నుంచి 125 కిలోమీటర్లకు, గరిష్టంగా 140 కిలోమీటర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. తుపాను తీరం దాటాక గాలుల వేగం నెమ్మదిగా తగ్గుతుంది. తీరం దాటే సమయంలో లోతట్టు ప్రాంతాల్లోకి సముద్రం చొచ్చుకొచ్చే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఉత్తరాంధ్ర తీరంలో అలలు ఎగసిపడనున్నాయి.

ఓడరేవులకు హెచ్చరికలు జారీ 
విశాఖ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో రెండో నంబర్‌ హెచ్చరిక జారీ చేశారు. కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవు పోర్టులకు హెచ్చరికలు జారీ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement