నోబెల్‌ బహుమతి సాధించే స్థాయికి ఎదగాలి | CP Radhakrishnan at the Ruby Jubilee celebrations of Dr NTR University of Health Sciences | Sakshi
Sakshi News home page

నోబెల్‌ బహుమతి సాధించే స్థాయికి ఎదగాలి

Oct 27 2026 3:48 AM | Updated on Oct 27 2026 3:48 AM

CP Radhakrishnan at the Ruby Jubilee celebrations of Dr NTR University of Health Sciences

విజయవాడలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం 40వ వార్షికోత్సవంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, చిత్రంలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌నజీర్‌ తదితరులు

డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య వర్సిటీ రూబీ జూబ్లీ వేడుకలలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ ఆకాంక్ష 

మానవతా దృక్పథం, అంకితభావంతో సేవ చేయండి 

వర్సిటీ కులపతి, గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ పిలుపు 

సాక్షి, అమరావతి: డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం విద్యార్థులు వైద్యరంగంలో ప్రపంచస్థాయి సవాళ్లను ఎదుర్కొని భవిష్యత్‌లో నోబెల్‌ బహుమతి సాధించే స్థాయికి ఎదగాలని భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ ఆకాంక్షించారు. మానవాళి ఎదుర్కొంటున్న క్యాన్సర్‌ వంటి ప్రమాదకర ఆరోగ్య సమస్యల పరిష్కారానికి పరిశోధనలను, ఆవిష్కరణలను మరింత బలోపేతం చేయా­లని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడలో సోమవారం నిర్వహించిన డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం 40వ వార్షికోత్సవ(రూబీ జూబ్లీ)వేడుకలకు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి, వర్సిటీ రాధాకృష్ణన్, కులపతి, రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ విచ్చేసి ప్రసంగించారు. 

ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో గత 12 ఏళ్లలో దేశంలో వైద్యకళాశాలల సంఖ్య 387 నుంచి 846కు పెరిగాయని, ఎంబీబీఎస్‌ సీట్లు 1.4 లక్షలకు పైగా చేరాయని గణాంకాలతో వివరించారు. కృతిమమేథ, డిజిటల్‌ హెల్త్, టెలిమెడిసిన్‌ వంటి అధునాతన సాంకేతికతలను అందిపుచ్చుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత సంస్థలతో హెల్త్‌వర్సిటీ ఒప్పందాలు చేసుకోవాలని సూచించారు.  

మానవతా దృక్పథంతో సేవ చేయండి.. 
డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్యవిశ్వవిద్యాలయం కులపతి, రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌నజీర్‌ మాట్లాడుతూ, వైద్య వృత్తి అనేది కేవలం సంపాదన కోసమే కాదని, నిరుపేదలకు సమాజానికి సేవ చేయడానికి ఒక పవిత్రమైన బాధ్యత అని విద్యార్థులకు గుర్తుచేశారు. పట్టభద్రులైన వైద్యులందరూ మానవతా దృక్పథంతో, అంకితభావంతో రోగులకు సేవలందించాలని ఆకాంక్షించారు. వైద్యరంగంలో వస్తున్న ఏఐ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూనే రోగుల పట్ల కరుణ, ప్రేమ, సానుభూతి వంటి మానవీయ విలువలను ఎప్పటికీ మరువకూడదన్నారు. డిగ్రీలు, మెడల్స్‌ అందుకున్న యువవైద్యులకు వారిని ఈస్థాయికి తీసుకువచ్చిన తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు గవర్నర్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, ఎన్‌ఎంసీ ఎంఏఆర్‌బీ అధ్యక్షుడు డాక్టర్‌ రమేశ్, వీసీ డాక్టర్‌ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.   

శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి 
తిరుమల: తిరుమల శ్రీవారిని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ సోమవారం దర్శించుకున్నారు. ఆల­య సంప్రదాయాన్ని అనుసరించి వరాహస్వామిని దర్శించుకున్న అనంతరం శ్రీవారి ఆలయానికి వచ్చారు. అక్కడ ఆయనకు టీటీడీ ఈ­వో రవిచంద్ర, ఏఈవో సీహెచ్‌ వెంకయ్య చౌదరి, సీవీఎస్‌వో మురళీకృష్ణ స్వా­గతం పలికారు. అర్చకులు ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్‌ స్వా­గ­తం పలికిన అనంతరం ఆయన ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవా­రిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ వకుళమాత, విమాన వేంకటేశ్వరస్వా­మి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనా­న్ని, ఈవో, ఏఈవోలు స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలను ఉపరాష్ట్రపతికి అందజేశారు. ఆలయం ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయ స్వామి వారిని కూడా ఉపరాష్ట్రపతి దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement