పల్లెలపై నీటి బాంబు | Tax on drinking water in villages | Sakshi
Sakshi News home page

పల్లెలపై నీటి బాంబు

Oct 27 2026 3:52 AM | Updated on Oct 27 2026 3:52 AM

Tax on drinking water in villages

మంచినీటి సరఫరాకు పన్ను పిండాలని చంద్రబాబు సర్కారు నిర్ణయం

సాక్షి, అమరావతి:  స్థానిక ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారు పల్లె ప్రజల నెత్తిన నీటిబాంబు పేల్చింది. ప్రతిఒక్కరూ ఇకపై తాగునీటికి పన్ను కట్టాలంటూ ఆదేశాలు జారీచేసింది. జలజీవన్‌ మిషన్‌ 2.0లో భాగంగా గ్రామాల్లోని తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ, మరమ్మత్తు కోసం విలేజీ కమిటీలకు ప్రభుత్వం సోమవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌–గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్‌ దండే నోటిఫికేషన్‌ జారీచేశారు. 

మంచినీటి పథకాల విద్యుత్‌ బిల్లులు, అక్కడ పనిచేసే సిబ్బంది వేతనాలు, నిర్వహణ ఖర్చులను పూర్తిగా స్థానిక ప్రజల నుంచే పన్ను రూపంలో వసూలుచేసుకోవాలని అందులో స్పష్టంచేశారు. గ్రామాన్ని ప్రామాణికంగా తీసు­కుని ఆయా కార్యక్రమాల నిర్వహణకు గ్రామస్థాయిలో ప్రత్యే­క కమిటీలను ఏర్పాటుచేసుకుని వాటి ఆధ్వర్యంలో నీటి పథకాలను కొనసాగించాలని ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరిచి స్థానికుల నుంచి వసూలుచేసిన యూజర్‌ ఛార్జీలను అందులో జమచేయాలని చెప్పింది.   

ప్రతీ వ్యక్తికి రోజుకు 55 లీటర్ల నీరు.. 
మరోవైపు.. ఏమైనా కారణాలతో తాగునీటి సరఫరా పథకాలు పనిచేయని పక్షంలో గరిష్టంగా రెండ్రోజుల్లో మరమ్మతులు చేయాలని స్పష్టంచేసింది. ఇందుకోసం ప్రతీ మంచినీటి పథకం వద్ద శిక్షణ పొందిన ప్లంబర్, పంపు మెకానిక్‌ గ్రామంలో ఉండేలా ఏర్పాట్లుచేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.  గ్రామాల్లో మొత్తం ఇళ్లకు కుళాయిల ద్వారా నీటి సరఫరా చేస్తూ ప్రతీ వ్యక్తికి రోజుకు 55 లీటర్ల చొప్పున అందించాలని.. ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించడం వంటి ఎనిమిది అంశాలకు సంబంధించి సెంట్రల్, పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్, ఇంజనీరింగ్‌ ఆర్గనైజేషన్‌ ప్రమాణాల ప్రకారం పథకం నిర్వహించాలని ప్రభుత్వం తెలిపింది.  ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతమున్న సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు, బోర్ల నిర్వహణ, మరమ్మతులకు ఏటా రూ.1,680.29 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement