భారత్‌కు దిక్సూచి నావిక్‌ | ISRO is strengthening its navigation system | Sakshi
Sakshi News home page

భారత్‌కు దిక్సూచి నావిక్‌

Oct 27 2026 4:06 AM | Updated on Oct 27 2026 4:06 AM

ISRO is strengthening its navigation system

నావిగేషన్‌ వ్యవస్థను బలోపేతం చేస్తున్న ఇస్రో  

ఈనెల 30న నావిక్‌–03 ఉపగ్రహ ప్రయోగం   

సూళ్లూరుపేట: దేశానికి పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నావిగేషన్‌ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రమిస్తోంది. సెకండ్‌ జనరేషన్‌ ఉపగ్రహాలను నావిక్‌ పేరుతో ప్రయోగిస్తోంది. ప్రజలకు, సైనిక అవసరాలకు ఎంతో ఉపయోగపడే ఈ వ్యవస్థ రూపకల్పనలో భాగంగా ఈ నెల 30వ తేదీన నావిక్‌–03 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తోంది. భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ (ఇండియన్‌ రీజనల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టం–ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌)లో ఇబ్బందులు తలెత్తడంతో నావిక్‌ సిరీస్‌ ఉపగ్రహాలను రోదసీలోకి పంపుతోంది. నిరంతరాయంగా నావిగేషన్‌ సేవలు అందించాలంటే ఏడు ఉపగ్రహాలు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. కనీసం నాలుగు ఉపగ్రహాలు పనిచేస్తుండాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

ప్రస్తుతం రెండు ఉపగ్రహాలు మాత్రమే నావిగేషన్‌ సేవలు అందిస్తున్నాయి. ఇస్రో 2013 నుంచి 2018 వరకు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ సిరీస్‌లో 9 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇందులో 8 ఉపగ్రహాలు మాత్రమే నిర్దిష్టమైన కక్ష్యలోకి చేరాయి. ఒక ప్రయోగంలో రాకెట్‌ చివరి భాగంలోని హీట్‌ షీల్డ్స్‌ విడిపోకపోవడంతో ఉపగ్రహం బయటకు రాక డెబ్రిస్‌గా మారిపోయింది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ సిరీస్‌ 8 ఉపగ్రహాల్లో ఐదు ఉపగ్రహాలు (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1ఏ, 1సీ, 1డీ, 1ఈ, 1జీ) మాత్రమే సేవలు అందిస్తున్నాయి. ఇందులో మూడు ఉపగ్రహాల్లో అటామిక్‌ గడియారాలు  సాంకేతికంగా పనిచేయడంలేదు. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఉపగ్రహాల్లో అటామిక్‌ గడియారాలు పనిచేస్తేనే కచ్చితమైన సమయాన్ని, నావిగేషన్‌ను అందిస్తాయి. 

ఒక్కసారి ఇవి విఫలమైతే ఉపగ్రహాలు పనికిరాకుండాపోతాయి. ఫస్ట్‌ జనరేషన్‌ ఉపగ్రహాలుగా ఉన్న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ సిరీస్‌కు స్వస్తిచెప్పిన ఇస్రో.. అధునాతన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేందుకు సెకండ్‌ జనరేషన్‌ ఉపగ్రహాల సిరీస్‌ను నావిక్‌ పేరుతో తీసుకొచ్చింది. 2023 మే 29 నావిక్‌–01 ఉపగ్రహాన్ని, 2025 జనవరి 29న నావిక్‌–02 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. నావిక్‌–02 ఉపగ్రహం జియో ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ నుంచి జియో ఆర్బిట్‌లోకి చేరే క్రమంలో సాంకేతికలోపం తలెత్తింది. ఇంధనాన్ని మండించేందుకు ఆక్సిడైజర్‌ వాల్వ్‌లు ఓపెన్‌ కాక కక్ష్య దూరాన్ని పెంచలేకపోవడంతో ఇది విఫలమైంది. 

సెకండ్‌ జనరేషన్‌ శాటిలైట్స్‌గా చెబుతున్న నావిక్‌ ఉపగ్రహాల సిరీస్‌లో ప్రయోగించిన రెండు ఉపగ్రహాల్లో ఒకటే పనిచేస్తోంది. అంటే ప్రస్తుతం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ సిరీస్‌లోని రెండు ఉపగ్రహాలు, నావిక్‌ ఉపగ్రహాల్లో ఒకటి.. మొత్తం మూడు మాత్రమే సేవలు అందిస్తున్నాయి. అందుకే నావిగేషన్‌ వ్యవస్థను బలోపేతం చేయడానికి నావిక్‌–03 ఉపగ్రహాన్ని ఈ నెల 30న ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమైంది. ఈ ఉపగ్రహంతో నావిగేషన్‌ వ్యవస్థ కొంత బలపడే అవకాశం ఉంది. ఈ వ్యవస్థ బలపడితే భారతదేశం అంచునుంచి సుమారు 1,500 కిలోమీటర్ల పరిధి దాకా ఈ సేవలు అందుతాయి.  

ప్రయోజనాలెన్నో... 
ఈ ఉపగ్రహాల వ్యవస్థతో భూ, జల, వాయు మా­ర్గాల స్థితిగతులు, దిక్కులు తెలియజేయడం, ఆప­ద సమయాల్లో భూగోళానికి సంబంధించిన సమా­చారం, వాహన చోదకులకు దిశానిర్దేశం, ఇంటర్నె­ట్‌తో అనుసంధానం వంటి ఎన్నో సౌకర్యాలు అందుబా­టులోకి వస్తాయి. అదేవిధంగా భారత విమా­నయా­న, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరా­లకు కూడా ఈ ఉపగ్రహ వ్యవస్థ ఉపయోగపడుతుంది.  రూ.3,425 కోట్లతో సొంత నావిగేషన్‌ దేశానికి పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నావిగేషన్‌ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు ఏడు ఉపగ్రహాల అవసరాన్ని 2006లోనే ఇస్రో గుర్తించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.3425 కోట్లను కేటాయించింది.

ఏడు ఉపగ్రహాలకు రూ.1,000 కోట్లు, రాకెట్లకు రూ.1,125 కోట్ల వ్యయం అంచనాతో ఈ ప్రాజెక్ట్‌ చేపట్టారు. ఈ ఉపగ్రహ వ్యవస్థ కోసం ప్రత్యేకంగా బెంగళూరు సమీపంలోని బైలాలు అనే ప్రాంతంలో రూ.1,300 కోట్లతో గ్రౌండ్‌స్టేషన్‌ నిర్మించారు. ఈ ఉపగ్రహ వ్యవస్థలోని ఏడు ఉపగ్రహాల్లో మూడు భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తు­లోని భూస్థిర కక్ష్యలో 34 డిగ్రీలు, 83 డిగ్రీలు, 130.5 డిగ్రీల తూర్పు రేఖాంశాల వద్ద కక్ష్యలో ఉండి పనిచేయాల్సి ఉంది. మిగిలిన నాలుగు ఉపగ్రహాలు  భూస్థిర కక్ష్యలోనే 55 డిగ్రీలు, 115 డిగ్రీల తూర్పు భూమ«ధ్య రేఖాతలానికి 31 డిగ్రీల వాలు­తో కక్ష్యలో సేవలందించే విధంగా ప్రణాళికలు తయారుచేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement