ఖాకీ తీసేసి.. పచ్చచొక్కాలేసి! | Police acting as a pillar of support for TDP | Sakshi
Sakshi News home page

ఖాకీ తీసేసి.. పచ్చచొక్కాలేసి!

Oct 27 2026 5:42 AM | Updated on Oct 27 2026 5:42 AM

Police acting as a pillar of support for TDP

వెన్నుపోటు పార్టీకి వెన్నుదన్నుగా పోలీసులు!

ప్రతిపక్ష అభ్యర్థులతో విత్‌డ్రా చేయించేందుకు నేరుగా రంగంలోకి..

ఫోన్‌ చేసి బెదిరింపులు.. తట్టుకోలేరంటూ హెచ్చరికలు 

ఇళ్లలో మద్యం బాటిళ్లు పెట్టి అక్రమ కేసుల స్కెచ్‌ 

గంజాయి కేసులు పెడతామంటూ బ్లాక్‌మెయిల్‌ 

వ్యాపారాలు మూసేస్తాం.. పొలాలు ధ్వంసం చేస్తాం 

విత్‌డ్రా చేయకుంటే కేసులు పెడతాం.. జైలుకు పంపిస్తాం 

అభ్యర్థుల కోసం నేతల నిర్బంధం.. అర్ధరాత్రి అరెస్టులు 

అభ్యర్థి ఆచూకీ కోసం మరో నేతను నిర్బంధించిన పోలీసులు! 

సింగరాయకొండలో భార్య విత్‌డ్రా కోసం భర్తను అదుపులోకి తీసుకుని ఒత్తిడి 

పోలీసుల బెదిరింపులతో పలుచోట్ల నామినేషన్ల ఉపసంహరణ! 

బైండోవర్ల నుంచి విత్‌డ్రాల దాకా.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే టార్గెట్‌

సాక్షి, అమరావతి: కొందరు ఖాకీ చొక్కా తీసేశారు.. పచ్చ చొక్కాలేసి పచ్చ కండువాలు కూడా కప్పుకున్నారు. దేనికైనా సిద్ధమనే ఆత్మాహుతి దళ సభ్యుల్లా అధికారపార్టీ కోసం రేయింబవళ్లు పనిచేస్తున్నారు. బరిలో నిలిచిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ నేరుగా బెదిరిస్తున్నారు. మంగళవారం విత్‌డ్రాలకు అఖరి రోజు కావడంతో సోమవారం పలు చోట్ల పోలీసులు తమ అసలు రంగు బయటపెట్టేశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు రకరకాల కుట్రలు, కుయుక్తులతో చెలరేగిపోయారు. ఇళ్లల్లో మద్యం బాటిళ్లు వాళ్లే పెట్టి కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారు. గంజాయి కేసులు పెడతామని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. పోటీ నుంచి తప్పుకోకుంటే జైలుకుపోవాల్సి వస్తుందని, పోటీ నుంచి తప్పుకోవడం మీకే మంచిదంటూ సలహా ఇస్తున్నారు. మాటవినని కొందరు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను పోలీసులే కిడ్నాప్‌ చేసి గుర్తుతెలియని చోట్లకు తరలిస్తున్నారు. 

ప్రజాస్వామ్య పరిరక్షణలో తమ వంతు పాత్ర పోషించాల్సిన పోలీసులు.. ఎన్నికల్లో పోటీ చేసే పౌర హక్కును కాపాడాల్సిన పోలీసులు.. రాజకీయాలకు అతీతంగా పనిచేసి అభ్యర్థులను రక్షణ కల్పించాల్సిన పోలీసులు.. అధికారపక్షానికి జీ హుజూర్‌ అంటూ పచ్చ చొక్కాలు వేసుకుని పనిచేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అధికారపక్షానికి జీ హుజూర్‌ అంటూ వ్యవహరిస్తున్న పలువురు పోలీసులు ఎన్నికల నోటిఫికేషన్‌ రాక ముందు నుంచే బైండోవర్లు పేరుతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను భయపెట్టి స్థానిక ఎన్నికలకు దూరం చేసే ప్రయత్నం చేశారు. అయినా తగ్గేదే లే అని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి రావడంతో వారిని గృహనిర్బంధాలు, అక్రమ అరెస్టులతో అడ్డుకున్నారు. తమ కళ్లముందే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై పచ్చ మూకలు దాడులు చేసినా.. నామినేషన్లు చించేసినా పోలీసులు చోద్యం చూశారు. ఇవన్నీ దాటుకుని నామినేషన్లు ఎలాగోలా వేసినా ఇప్పుడు ఉపసంహరించుకోవాలంటూ రకరకాలుగా వేధిస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆచూకీ కోసం మరో నేతకు వేధింపులు
ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఉన్నం సుధాకర్‌ను నామినేషన్‌ ఉపసంహరించుకునేలా ఒత్తిడి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.  ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు స్వగ్రామం బడేవారిపాలెంలో సుధాకర్‌ నామినేషన్‌ ఉపసంహరణకు నిరాకరించి చెన్నైలోని తన కుమారుడి వద్దకు వెళ్లడంతో పోలీసులు ఆయన ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. సుధాకర్‌ ఆచూకీ చెప్పాలంటూ వైఎస్సార్‌సీపీ నేత హరిబాబును రెండు రోజులుగా స్టేషన్‌కు పిలిపించి ఒత్తిడి చేశారు. 

సోమవారం తెల్లవారుజామున 4 గంటలకే గుడ్లూరు సీఐ రమేష్‌ పోలీసులతో హరిబాబు ఇంటికి చేరుకుని, అరెస్టుకు కారణం చెప్పకుండానే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పలు పోలీస్‌స్టేషన్లకు తిప్పి, రోజంతా నిర్బంధించి రాత్రి డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు. హరిబాబు భార్య భారతి తన భర్తను ఎందుకు అరెస్టు చేశారని డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని ప్రశ్నించారు. సుధాకర్‌ను తీసుకొస్తేనే హరిబాబును విడుదల చేస్తామని డీఎస్పీ చెప్పినట్లు ఆమె తెలిపారు. మరోవైపు, తన తండ్రి చెన్నైలో తమ వద్ద క్షేమంగా ఉన్నారని సుధాకర్‌ కుమారుడు వెంకట్రావ్‌ డీఎస్పీకి స్పష్టం చేశారు. వీడియో కాల్‌లో మాట్లాడించేందుకు సిద్ధమని చెప్పినా, సుధాకర్‌ను స్వయంగా తీసుకొచ్చి అప్పగించాలని పోలీసులు పట్టుబట్టారు. 

పల్నాడు జిల్లా నకరికల్లు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భర్త లక్ష్మారెడ్డిని అర్ధరాత్రి బలవంతంగా తీసుకెళ్తున్న పోలీసులు 

కేసులు.. బెదిరింపులతో.. బంటుపల్లి ఎంపీటీసీ విత్‌ డ్రా
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లిలో ఎంపీటీసీ నామినేషన్‌ను వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెనక్కి తీసుకున్నారు. వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై, తనపై పోలీస్‌ కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడటం వల్ల బంటుపల్లి ఎంపీటీసీగా నామినేషన్‌ వేసిన తన భార్య పాసపు కృష్ణవేణి, డమ్మీ అభ్యర్థి పాసపు సుధ ఇద్దరి నామినేషన్లు విత్‌ డ్రా చేసుకున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు పాసపు ముకుంద తెలిపారు. ఈ విత్‌ డ్రాతో బీజేపీకి ఏకగ్రీవమైనట్లు ఎంపీడీఓ ఎం.ఈశ్వరరావు తెలిపారు. 

సీతారామపురంలో లోకేష్‌రెడ్డిపై కేసు..
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం సీతారాంపురం ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ నేత చింతంరెడ్డి లోకేశ్‌రెడ్డి మూడు సెట్ల నామినేషన్‌ వేశారు. ఆయన నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్‌ అధికారి నోటీస్‌ బోర్డులో లిస్ట్‌ పెట్టారు. ఆదివారం రాత్రి ఎంపీడీఓ కార్యాలయంలోని నోటీసు బోర్డుపై తన పేరు ఉందో లేదో చూసుకునేందుకు వెళ్లిన లోకేష్‌రెడ్డిపై పలు ఆరోపణలతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు బెదిరించారు. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు ఎస్సై వెంకట రాజేష్‌ బసినేనిపల్లికి వెళ్లి స్థానిక నాయకులతో వాగ్వాదానికి దిగారు. 

పోలీసులే దగ్గరుండి విత్‌డ్రా..
చిలకలూరిపేట రూరల్‌ మండలం జెడ్పీటీసీ అభ్యర్థులుగా మురికిపూడిగ్రామానికి చెందిన జమ్మలమడక ఆదిబాబు, పసుమర్రు గ్రామానికి చెందిన మైలా రాజేష్‌లు నామినేషన్లు వేశారు.  వీరిని చిలకలూరిపేట రూరల్‌ సీఐ సుబ్బనాయుడు, ఎస్సై అనిల్‌లు తీవ్ర స్థాయిలో బెదిరింపులకు గురిచేసి, వారే దగ్గరుండి తీసుకెళ్లి విత్‌డ్రా చేయించారు. 

నకిరికల్లు జెడ్పీటీసీ చేత విత్‌డ్రా చేయించిన పోలీసులు
సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు జెడ్పిటీసీ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ నుంచి కందుల హనుమాయమ్మ నామినేషన్‌ దాఖలు చేశారు. ఆదివారం అర్ధరాత్రి ఎస్సై సతీష్‌ తన బృందంలో మఫ్టీలో వెళ్లి కుటుంబ సభ్యులు రోదిస్తున్నా వినకుండా హనుమాయమ్మ భర్త లక్ష్మారెడ్డిని అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి, తీవ్రంగా బెదిరించడంతో సోమవారం లక్ష్మారెడ్డి భార్య హనుమాయమ్మతో విత్‌డ్రా చేయించినట్లు తెలిసింది. బాపట్ల జిల్లా రేపల్లె మండలం మొళ్లగుంటలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిని నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని పోలీసులు, పచ్చ నేతలు ఒత్తిడి చేస్తున్నారు.

పెద్దాపురంలో కిడ్నాప్‌నకు యత్నం
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జిరాంగంపేటలో పోలీసుల సాయంతో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి జాగరపు వెంకట సురేష్‌ను కిడ్నాప్‌ చేసేందుకు కూటమి నేతలు ప్రయత్నించారని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది. పార్టీ కో–ఆరి్డనేటర్‌ దవులూరి దొరబాబు అడ్డుకోవడంతో కూటమి నేతల ప్రయత్నం విఫలమైంది. 

జి.రాగంపేటలో కూటమి నేతను అడ్డుకుంటున్న వైఎస్సార్‌సీపీ నేత దొరబాబు తదితరులు  

వేటపాలెంలో నగదు ఆశపెట్టి తప్పించే యత్నం..
చీరాల నియోజకవర్గం వేటపాలెం మండల పరిధిలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు రూ.లక్షలు నగదు ఆశచూపీ పోటీ నుండి విత్‌ డ్రా చేయడానికి టీడీపీ నేతలు ఒత్తిడి చేశారు. మాట వినకపోతే కిడ్నాప్‌ చేస్తామని, కేసులు పెడతామని బెదిరింపులకు దిగారు. 

మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌కు టీడీపీ గూండాల బెదిరింపులు..
కర్నూలులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ను టీడీపీ గూండాలు తీవ్ర దుర్భాషలాడుతూ బెదిరింపులకు దిగారు. హఫీజ్‌ఖాన్‌తో ప్రచారంలో ఉన్న వారందరినీ చంపేస్తామంటూ టీడీపీ గూండాల బెదిరించి అడ్డంకులు కల్పించారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రచారం చేసుకుంటే బెదిరిస్తారా అంటూ హఫీజ్‌ఖాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైఎస్సార్‌సీపీ నేతకు డీఎస్పీ బెదిరింపులు..
గూడూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత ఎద్దల నరేంద్రరెడ్డిపై డీఎస్పీ నరసింహమూర్తి బెదిరింపులకు దిగారు. మర్యాదగా గూడూరు రూరల్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులను విత్‌ డ్రా చేయించాలని హుకుం జారీ చేశారు. రాజకీయాలలో నువ్వు పిల్ల బచ్చావి, నేను చెప్పినట్లు నడుచుకోకపోతే పరిణామాలు దారుణంగా వుంటాయని హెచ్చరించారు. తమ నాయకుడు జగన్‌ ఆదేశాలతో పోటీ చేస్తున్నామని నరేంద్రరెడ్డి బదులిచ్చాడు. మీ నాయకుడు జగన్‌ చెప్పాడని బరిలో వుంటే బలి అవుతావు జాగ్రత్త అంటూ డీఎస్పీ నరసింహమూర్తి వార్నింగ్‌ ఇచ్చారు.
ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం బడేవారిపాలెంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు హరిబాబును తీసుకెళ్తున్న గుడ్లూరు సీఐ రమేష్‌ 
   
భార్య నామినేషన్‌ విత్‌డ్రా కోసం భర్త కిడ్నాప్‌
ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కాలరాస్తూ.. భార్య నామినేషన్‌ ఉపసంహరించుకోవాలంటూ  ప్రకాశం జిల్లా సింగరాయకొండ వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు మసనం వెంకట్రావును సింగరాయకొండ పోలీసులు వేధించారు. సోమవారం ఒంగోలులోని డీమార్ట్‌ వద్ద ఆయనను కారులో ఎక్కించుకుని జరుగుమల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ సీఐ వై. శ్రీహరి, ఎస్సై ఎల్‌. సుధీర్‌కుమార్‌ ఆయనపై ఒత్తిడి తెచ్చి, భార్య వెంకటరత్నంతో జెడ్పీటీసీ నామినేషన్‌ ఉపసంహరింపజేయాలని బెదిరించారు. వెంకట్రావు ఎంపీటీసీ అభ్యర్థిగా, ఆయన భార్య వెంకటరత్నం జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేశారు. 

వెంకట్రావు నామినేషన్‌ను అధికారులు తిరస్కరించడంతో ఆయన ఆర్డీఓకు అప్పీల్‌ చేసుకునేందుకు ఒంగోలు వచ్చారు. తిరిగి వెళ్తుండగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి అనడం కన్నా దారికాచి కిడ్నాప్‌ చేశారు. భార్యతో నామినేషన్‌ ఉపసంహరింపజేస్తానని వెంకట్రావుతో అంగీకరింపజేసి, హైదరాబాద్‌లో ఉన్న ఆయన భార్య వెంకటరత్నంతో ఫోన్‌లో మాట్లాడించారు. విత్‌డ్రా పత్రాలపై సంతకాలు తీసుకుని వాటిని ఆన్‌లైన్‌లో తెప్పించుకుని అనంతరం  41 నోటీసు ఇచ్చి వెంకట్రావును విడుదల చేశారు. ఈ వ్యవహారం వెనుక మంత్రి హస్తం ఉందనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి.

పొలాలు ధ్వంసం చేస్తాం.. వ్యాపారాలు మూసివేయిస్తాం...
ఇవీ.. పోలీసుల బెదిరింపులు.. తూర్పుగోదా­వరి జిల్లా కొవ్వూరు మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను బెదిరించి నామినేషన్లు ఉపసంహరింపజేసే వ్యవహారంలో పోలీసులు కీలక పాత్ర పోషించారు. టీడీపీ నేతలతో కలిసి రంగంలోకి దిగిన పోలీసులు.. వ్యాపారాలు మూసివేయిస్తామని, పొలాలు ధ్వంసం చేస్తామని, ఇళ్ల స్థలాలు ఆక్రమిస్తామని, పోటీలో ఉంటే అక్రమ కేసులు పెడతామని అభ్యర్థులను బెదిరించారు. వారి కుటుంబ పెద్దలకూ ఫోన్లు చేసి ఒత్తిడి తెచ్చా­రు. ఈ బెదిరింపులకు భయపడి ముగ్గురు వార్డు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో 6, 15, 18 వార్డులు టీడీపీకి ఏకగ్రీవమయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు మధ్యాహ్నం 3 గంటలకే ముగిసినా.. కొవ్వూ­రు మున్సిపల్‌ కార్యాలయంలో పోలీసుల ఒత్తిళ్ల పర్వం రాత్రి 10 గంటల వరకు కొనసాగింది.

మద్యం సీసాలు పోలీసులే పెట్టి కేసులు పెట్టే యత్నం..
నెల్లూరు జిల్లా గూడూరు రూరల్‌ పరిధిలోని మిట్ట ఆత్మకూరులో వైఎస్సార్‌సీపీ ఎంపీపీ అభ్యర్థి శ్రీనివాసులురెడ్డి నివాసంలో పోలీసులు అర్ధరాత్రి హడావుడి చేశారు. నామినేషన్‌ ఉపసంహరించుకోకపోతే కేసు నమోదు చేస్తామని బెదిరించారు. పోలీసుల వాహనం నుంచి మద్యం బాటిళ్లు తీసుకొచ్చి ఇంటి ఆవరణలో పెట్టి అక్రమ కేసు నమోదు చేసేందుకు ప్రయత్నించారు. కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండటంతో ఈ వ్యవహారం బయటపడింది. గూడూరు రూరల్‌ మండలం రామలింగపురంలో కూడా వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థుల ఇళ్లల్లో మద్యం బాటిళ్లు పెట్టి అక్రమ అరెస్టులు చేసేందుకు పోలీసులు స్కెచ్‌ వేశారు. కరెంటు ఆఫ్‌చేసి ఇళ్ల వద్దకు చొరబడిన పోలీసులు తప్పుడు కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. నామినేషన్‌ దాఖలు చేసిన వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను టార్గెట్‌ చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement