సాక్షి ప్రతినిధి, కాకినాడ: జెడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్ల సర్దుబాటుపై టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య ఇటీవల జరిగిన చర్చలు విఫలమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగిన చర్చల్లో చివరకు ఎటూ తేల్చకుండానే ముగించారు. చివరకు క్షేత్ర స్థాయిలోనే టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు మాట్లాడుకోవాలంటూ చంద్రబాబు ప్రకటించడంతో ‘స్థానిక’ నాయకులు దిక్కు తోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.
ఇప్పుడెలా?
జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల నామినేషన్ల ఉపంసహరణ గడువు మంగళవారంతో పూర్తి కానుంది. బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాపై స్పష్టత రానుంది. ఈ తరుణంలో సీట్ల సర్దుబాటు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది. కానీ, క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఈ పరిణామం కూటమిలో కలకలం రేపుతోంది. ఉపసంహరణ గడువు సమీపించిన తరుణంలో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే విషయమై ఆయా పారీ్టల అధిష్టానాల నుంచి స్పష్టత లేకపోవడంతో కూటమి శ్రేణుల్లో సర్వత్రా గందరగోళం నెలకొంది. సీట్ల సర్దుబాటుకు గత సార్వత్రిక ఎన్నికల విధానం పాటిద్దామని టీడీపీ అనుకుంటే అది కుదరదని జనసేన నేతలు వాదిస్తున్నారు. తమకు పట్టున్న స్థానాల్లో పోటీ చేస్తామని కుండ బద్దలుగొడుతున్నారు. ఈ పరిణామం టీడీపీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. మున్సిపాలిటీలు, వార్డుల్లో సైతం సింహభాగం జనసేనకే కట్టబెట్టి, స్థానిక సంస్థల్లోనూ ఆ పారీ్టకే ప్రాధాన్యం ఇవ్వడమేమిటనే ప్రశ్న టీడీపీ శ్రేణుల్లో ఉత్పన్నమవుతోంది. తాము పార్టీ కోసం కష్టపడితే దక్కే గౌరవం ఇదేనా అని వారు మండిపడుతున్నారు.
జెడ్పీ పీఠంపై సస్పెన్స్
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్థానం ఎవరికి కేటాయిస్తారనే విషయం మున్సిపల్ ఎన్నికల అనంతరం స్పష్టం చేస్తామని అధినేతలు వెల్లడించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ పీఠాన్ని జనసేనకు కేటాయించినట్లు ఆ పార్టీ శ్రేణులు తమకు అత్యంత ఆప్తుల వద్ద వెల్లడిస్తున్నారు. ఈ విషయం తెలిసిన తెలుగు తమ్ముళ్లు మాత్రం అంతర్గతంగా రగిలిపోతున్నారు. మరోవైపు తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ బీజేపీ నాయకులు సైతం అసంతృప్తి చెందుతున్నారు.
పోటీపై పీటముడి
జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలనే అంశంపై కూటమి అభ్యర్థులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. సీట్ల సర్దుబాటుపై స్పష్టత వస్తే తర్వాత ఉపసంహరించుకోవచ్చనే ఉద్దేశంతో టీడీపీ, జనసేన నేతలు అత్యధిక స్థానాల్లో పోటాపోటీగా నామినేషన్లు వేశారు. అయితే, చివరకు స్పష్టత రకపోవడంతో ఎవరు ఉపసంహరించుకోవాలి, ఎవరు పోటీ చేయాలో అర్థం కాక అయోమయాన్ని ఎదుర్కొంటున్నారు.


