● వైఎస్సార్ సీపీ అభ్యర్థిని
అడ్డుకునేందుకు పన్నాగం
● బలవంతపు విత్‌డ్రా కోసం ప్రయత్నాలు
● అడ్డుకున్న కో ఆర్డినేటర్
దవులూరి దొరబాబు
పెద్దాపురం: ఎన్నికల్లో ఓటమి తప్పదని గుర్తించిన కూటమి నేతలు..వైఎస్సార్ సీపీ అభ్యర్థులపై బెదిరింపులకు, బలవంతంగా నామినేషన్ల ఉపసంహరించుకోవాలంటూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. మండలంలోని పులిమేరు ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్ సీపీ నుంచి జి.రాగంపేట వెలంపేటకు చెందిన జాగరపు వెంకట సురేష్ నామినేషన్ వేశారు. ఆయనను బెదిరించి, ఎలాగైనా బలవంతంగా నామినేషన్ ఉపసంహరించుకునేలా కూటమి నేతలు కుట్రలు పన్నారు. కనీసం బీ–ఫారం ఎన్నికల అధికారులకు ఇవ్వనీయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేశారు. తద్వారా పులిమేరు ఎంపీటీసీ స్థానాన్ని ఎలాగైనా కూటమి ఖాతాలో వేసుకునేందుకు పథకం రచించి, అమలుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున వేరే గ్రామాలకు చెందిన వారు వైఎస్సార్ సీపీ అభ్యర్థి సురేష్ ఇంటి పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు ఆ పార్టీ నాయకులు గుర్తించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు తన అనుచరులతో హుటాహుటిన జి.రాగంపేట చేరుకున్నారు. సురేష్ ఇంటి సమీపాన అనుమానాస్పదంగా తిరుగుతున్న కూటమి నాయకులను నిలదీశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో గెలవాలే తప్ప, ఇలాంటి బెదిరింపు, కిడ్నాపు రాజకీయాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.


