వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా గొల్లపల్లి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా గొల్లపల్లి

Oct 27 2026 12:15 AM | Updated on Oct 27 2026 12:15 AM

ఏలేశ్వరం: వైఎస్సార్‌సీపీ ఏలేశ్వరం జెడ్పీటీసీ అభ్యర్థిగా గొల్లపల్లి కాశీ విశ్వనాథ్‌ పేరును ఆ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ ముద్రగడ గిరిబాబు సోమవారం ప్రకటించారు. కాశీ విశ్వనాథ్‌ గతంలో ఎంపీపీగా, ప్రత్తిపాడు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా పని చేశారు. గొల్లపల్లిని జెడ్పీటీసీ అభ్యర్థిగా ప్రకటించడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

నామినేషన్ల ఉపసంహరణ

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు వేసిన నామినేషన్లను పలువురు అభ్యర్థులు సోమవారం ఉపసంహరించుకున్నారు. జిల్లావ్యాప్తంగా 340 ఎంపీటీసీ స్థానాలకు, 12 జెడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నారు.

ఎన్నికలు విజయవంతంగా

నిర్వహించాలి

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను జిల్లాలో ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు సిబ్బంది బాధ్యతాయుతంగా పని చేయాలని స్థానిక సంస్థల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌ అన్నారు. ప్రిసైడింగ్‌ అధికారులు (పీఓ), అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులకు (ఏపీఓ) కాకినాడ జిల్లా ప్రజా పరిషత్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మొదటి దశ శిక్షణలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలింగ్‌ ప్రక్రియపై దిశా నిర్దేశం చేశారు. నిబంధనల పట్ల స్పష్టత ఉంటేనే పోలింగ్‌ విధుల నిర్వహణ సులభతరమవుతుందని చెప్పారు. ఓటింగ్‌ నిర్వహణ, డైరెక్ట్‌ బాక్స్‌ భద్రతా ప్రమాణాలు, పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

పురపోరులో బెదిరింపుల జోరు

పెరవలి: అధికార కూటమిలోని టీడీపీ నాయకులు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను బెదిరించి, నామినేషన్లు విత్‌డ్రా చేయిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాలిటీలో ఆదివారం జరిగిన ఈ ఘటనపై ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు. మున్సిపాలిటీలో 28 వార్డులు ఉన్నాయి. వీటిలో 6, 15, 18 వార్డుల వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులను నామినేషన్ల గదిలోనే విత్‌డ్రా చేసుకోవాలని టీడీపీ నాయకులు బెదిరించారు. ఎవరితో చెప్పుకోవాలో తెలియక వారందరూ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఈ వార్డులు ఏకగ్రీవమైనట్టు ప్రకటించారు. అధికార పార్టీ నాయకులు ఎన్నికల కేంద్రంలోనే తిష్ట వేసి మరీ అభ్యర్థులను బెదిరించి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేశారని, దీనికి అధికార యంత్రాంగం, పోలీసులు పూర్తిస్థాయిలో సహకరించారని సమాచారం. టీడీపీ నాయకులతో పాటు పోలీసులు నేరుగా అభ్యర్థులకు ఫోన్‌ చేసి కేసులు పెడతామని, వారి ఆస్తులు ఆక్రమించుకుంటామని, రేషన్‌ డిపోలు తొలగిస్తామని, కేసులు బనాయిస్తామని, పంట చేలు ధ్వంసం చేస్తామని బెదిరించినట్టు తెలిసింది. దీనికి సంబంధించిన ఫోన్‌ కాల్‌ రికార్డులు ఆ అభ్యర్థుల వద్ద ఉన్నాయి.

మున్సిపల్‌ కమిషనర్‌ తీరుపై విమర్శలు

కాగా, మున్సిపల్‌ కమిషనర్‌ వ్యవహార శైలిపై కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటే రాత్రి 10 గంటలకు కూడా తుది జాబితాను నోటీస్‌ బోర్డులో పెట్టలేదు. ఆయనను ఫోన్‌లో ఎన్నిసార్లు సంప్రదించినా ఫలితం లేకుండా పోయింది. విలేకర్లను ఆ సమీపంలోకి రాకుండా పోలీసులతో పహారా పెట్టారు. అధికారులు, పోలీసులు, కూటమి నేతలు ఒక్కటై ఈ దౌర్జన్యాలకు, బెదిరింపులకు పాల్పడినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement