తుపానును
ఎదుర్కొనేందుకు సిద్ధం
అర్నాబ్ తుపాను నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా భోజనం, తాగునీరు, విద్యుత్ సరఫరా, నీటి సౌకర్యం, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతులు కల్పించాలి. ప్రజలు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టార్చ్‌లైట్లను ముందుగానే పూర్తిగా ఛార్జ్ చేసుకోవాలన్నారు. రెండు మూడు రోజులకు సరిపడా ఆహారం, తాగునీరు, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచుకోవాలి.
– డీఆర్‌ఓ తిప్పేనాయక్‌తో కలసి కలెక్టరేట్‌లో
ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్
‘అర్నాబ్’పై అప్రమత్తంగా ఉండాలి
కాకినాడ లీగల్: అర్నాబ్ తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముంపు ముప్పు ఉన్న ప్రాంతాల వారు పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ అన్నారు. తుపాను ముందస్తు సహాయక చర్యల్లో భాగంగా నగరంలోని ఏటిమొగ తీర ప్రాంతంలో సోమవారం ఆయన పర్యటించారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ చేపడుతున్న ఏర్పాట్లను, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. తుపాను సహాయక చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాలు, ఈదురు గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు ఏమాత్రం అలసత్వం చూపకుండా పునరావాస కేంద్రాలకు వెంటనే చేరుకోవాలని, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే ధైర్యంగా ఉండాలని, కంట్రోల్ రూముకు సమాచారం అందించి, సహకరించాలని కోరారు. చిన్నారులు, దివ్యాంగులు, గర్భిణులు, వృద్ధులను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. పారిశుధ్య పనులు వేగవంతం చేయాలని, అత్యవసర వైద్య సేవలు అందించడానికి ప్రత్యేక వైద్య బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ప్రియ, నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్‌వీవీ సత్యనారాయణ, అర్బన్ తహసీల్దార్ వి.జితేంద్ర, ఎంహెచ్‌ఓ పృథ్వీచరణ్ తదితరులు పాల్గొన్నారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ/బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): సముద్ర ఉపరితలం మీద నుంచి భీకర తుపాను ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం అర్నాబ్ తుపానుగా బలపడి, అతి తీవ్ర తుపానుగా మారి, బుధవారం ఉదయం యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. తుపాను తీరం దాటే సమయంలో 115 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సముద్ర తీర ప్రాంతంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారనుంది. మత్స్యకారులు ఎవరూ చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లరాదని అధికారులు సూచించారు.
అప్రమత్తమైన అధికార యంత్రాంగం
తుపాను హెచ్చరికలపై జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లావ్యాప్తంగా సముద్ర తీర గ్రామాల్లో సుమారు 89 వేల మంది జీవనం సాగిస్తున్నారు. వారిని ఇప్పటికే తుపానుపై అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 101 పునరావాస కేంద్రాలను గుర్తించారు. ఇప్పటికే ఆరు తీర ప్రాంత మండలాలతో పాటు, అదనంగా మరో ఐదు మండలాలను గుర్తించి, ఆయా ప్రాంతాల ప్రజలను మంగళవారం మధ్యాహ్నం లోగా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలో మొత్తం 4,602 బోట్లు ఉండగా, వాటిలో 4,559 ఇప్పటికే జిల్లాలోని వివిధ హార్బర్లు, ల్యాండింగ్ కేంద్రాలకు సురక్షితంగా చేరాయి. మిగిలిన 43 బోట్లు ఒడిశాలోని పారదీప్ తదితర హార్బర్లలో ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
తుపాను సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా కాకినాడ జీజీహెచ్ సహా అన్ని ఆసుపత్రుల్లోను తగిన విద్యుత్ బ్యాకప్ ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
పంట చేతికొచ్చే సమయంలో వచ్చి పడుతున్న తుపాను అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సామర్లకోట, పెద్దాపురం పరిసర ప్రాంతాల్లో ఇప్పటి వరకూ సుమారు 600 హెక్టార్లలో వరి కోతలు పూర్తయ్యాయి. మరో పది రోజుల్లో సుమారు 40 వేల హెక్టార్లలో వరి కోతలు జరిగే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో వస్తున్న ఈ తుపాను వల్ల భారీ వర్షాలు కురిస్తే కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నేలకొరిగే ప్రమాదముందని, ధాన్యం తడిసిపోయి, నాణ్యత దెబ్బ తింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సమయాల్లో వేగంగా సహాయక చర్యలు చేపట్టేందుకు ఒక ఎన్‌డీఆర్‌ఎఫ్, ఒక ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను తీర గ్రామాలకు పంపించారు.
తుపాను ముప్పు నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి బుధవారం సాయంత్రం వరకూ అత్యవసరమైతేనే బయటకు రావాలని ప్రజలకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సూచించారు.
కోనసీమను వణికించిన 1996 పెను తుపాను
అర్నాబ్ తుపాను హెచ్చరికలతో జిల్లా ప్రజలకు 1996 నవంబరు 6న సంభవించిన కోనసీమ పెను తుపాను జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. కాకినాడ – యానాం మధ్య తీరం దాటిన ఆ తుపాను అప్పట్లో కోనసీమ చరిత్రలోనే అత్యంత విషాదాన్ని మిగిల్చింది. అమలాపురం, అయినవిల్లి, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ఐ.పోలవరం, అల్లవరం తదితర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. సుమారు వెయ్యి మంది మృత్యువాత పడగా, లక్షలాది ఇళ్లు దెబ్బ తిన్నాయి. వేలాది కుటుంబాల వారు నిరాశ్రయులయ్యాయి. సుమారు 20 లక్షల కొబ్బరి చెట్లు నేలకొరిగి, దెబ్బ తిన్నాయన్నది అంచనా. ఇప్పుడు కూడా అర్నాబ్ అదే ప్రాంతంలో తీరం దాటనుందని ఐఎండీ చెబుతోంది.
నేడు, రేపు విద్యా సంస్థలకు సెలవు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): తుపాను నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈఓ) పిల్లి రమేష్ తెలిపారు. పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలల్లోని సామగ్రి, రికార్డుల రక్షణకు ఉపాధ్యాయులు చర్యలు చేపట్టాలని డీఈఓ ఆదేశించారు. ఆయా పాఠశాలల్లో తుపాను షెల్టర్లు ఏర్పాటు చేసి ఉంటే తరగతి గదుల్లోని స్మార్ట్ టీవీలు, ఐఎఫ్‌పీల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంఈఓలు ఫోన్‌కు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.
కంట్రోలు రూములు
జిల్లా స్థాయి కంట్రోల్ రూము నంబర్లు : 0884 – 2356801, 98499 03879
మండల స్థాయిలో తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు.
అతి తీవ్ర తుపానుగా
బలపడనున్న అర్నాబ్
రేపు యానాం సమీపంలో
తీరం దాటుతుందని అంచనా
ఆ సమయంలో 115 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో బలమైన
గాలులు వీచే అవకాశం
రేపు, ఎల్లుండి అత్యంత భారీ వర్షాలు


