11 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు
254 మండలాల్లో ఓ మోస్తరు కరువు
జాబితా విడుదల చేసిన సీఎస్ సంజయ్‌జాజు ∙6 నెలల పాటు అమల్లో నోటిఫికేషన్
జిల్లా కలెక్టర్ల తక్షణ కర్తవ్యంపై పలు సూచనలు
గెజిట్‌లో పొందుపర్చాలి.. వెంటనే ఉపశమన చర్యలు చేపట్టాలి
కేంద్రానికి నివేదికలు పంపాలి..
ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తుండాలి
అవసరమైతే మలి జాబితా విడుదల చేస్తామని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 365 మండలాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వం ఈ మేరకు అధికారికంగా నిర్ధారించింది. రాష్ట్రంలోని 31 జిల్లాల పరిధిలోని 365 మండలాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రకటించింది. వర్షాభావ పరిస్థితులతో 18 జిల్లాల్లోని 111 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులుండగా, 27 జిల్లాల్లోని 254 మండలాల్లో ఓ మోస్తరు కరువు ఉందని తెలిపింది. జిల్లాల వారీగా కరువు మండలాల జాబితాను విపత్తు నిర్వహణ శాఖ పక్షాన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు విడుదల చేశారు. మంగళవారం రాత్రి జీవో ఎంఎస్ నం:3 ద్వారా రాష్ట్రంలోని ఏయే జిల్లాల్లో కరువు మండలాలున్నాయి? అందులో తీవ్రంగా కరువున్న మండలాలేవి? ఓ మోస్తరు మండలాలేవి? జిల్లా కలెక్టర్లు ఏం చేయాలి? కరువుతో సంబంధమున్న పలు శాఖల తక్షణ కర్తవ్యమేంటనే వివరాలను వెల్లడించారు. ఆ జీవో ప్రకారం..
శాస్త్రీయ అంచనాలతో..
2026 ఖరీఫ్ సీజన్‌కు గాను అక్టోబర్ 30లోగా కరువును నోటిఫై చేయాల్సి ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ 18న రాష్ట్ర అసెంబ్లీలో చేసిన తీర్మానం మేరకు రాష్ట్రంలోని అన్ని మండలాల్లో బహుళ ప్రాతిపదికన శాస్త్రీయ అంచనాలు నిర్వహించాం. టెలీమెట్రీ పద్ధతిలో జూన్1 నుంచి సెప్టెంబర్ 30 వరకు వచ్చిన వర్షపాతాన్ని లెక్కించాం. వ్యవసాయ సాగులో తగ్గుదల, భూమితో తేమ శాతం, భూగర్భ జలాలు, రిమోట్ సెన్సింగ్ అనే నాలుగు రకాలుగా ఈ అంచనా వేశాం. ప్రతి మండలంలోని 10 శాతం గ్రామాల్లో భూగర్భ పరిస్థితులను శాంపిల్ సర్వే ద్వారా నిర్ధారించిన మీదట అన్ని శాఖల అంచనాల మేరకు రూపొందించిన జాబితాను కేబినెట్ సబ్ కమిటీ ముందుంచాం. అక్టోబర్ 23న జరిగిన ఈ సమావేశం 31 జిల్లాల్లోని 365 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించేందుకు ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఆ మేరకు వాటిని కరువు మండలాలుగా ప్రకటిస్తున్నాం. ఈ మేరకు విడుదల చేసే నోటిఫికేషన్ ఆరు నెలల పాటు అమల్లో ఉంటుంది.
కలెక్టర్లు గెజిట్ నోటిఫికేషన్ చేయాలి
ప్రస్తుత జాబితాలో లేని మండలాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైతే మలి జాబితాను కూడా విడుదల చేస్తాం. ఈ వివరాలను అన్ని జిల్లాల కలెక్టర్లు గెజిట్ నోటిఫికేషన్ చేయాలి. జిల్లా యంత్రాంగాలు వెంటనే ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపు, భూగర్భజలాల పెంపుదలకు తీసుకోవాల్సిన చర్యలు, గడ్డి ఏర్పాట్లు, పశు శిబిరాలు నిర్వహించడం, వీబీజీ రాంజీ చట్టానికి అనుగుణంగా ఉపాధి కల్పన లాంటి ఉపశమన చర్యలు తీసుకోవాలి. రిజర్వు బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా వ్యవసాయ రుణాల రీస్ట్రక్చర్, రుణాల రికవరీ కోసం ఒత్తిడి తేకుండా ఉండడం లాంటి చర్యలు తీసుకోవాలి.
తీవ్ర కరువు పరిస్థితులు ఉన్న మండలాల్లో అవసరమైన చర్యలు తీసుకునేందుకు గాను అన్ని వివరాలను ప్రణాళిక శాఖ ఏడు రోజుల్లో కేంద్ర వ్యవసాయ, హోంశాఖలకు నివేదిక రూపంలో పంపాలి. కరువు ఉపశమన చర్యలకు సంబంధించిన అన్ని వివరాలను, లబ్ధిదారులు, ఖర్చు గణాంకాలతో సహా ప్రతి రోజూ ప్రగతి నివేదికలను వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ డైరెక్టర్, పౌరసరఫరాల శాఖకు పంపాల్సి ఉంటుంది. కరువు పరిస్థితులకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పూర్తి సవివర నివేదికను పంపిచండంతో పాటు, త్వరగా కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించేలా విజ్ఞప్తి చేసేలా ప్రణాళిక శాఖ నివేదికను పంపించాలి.
ఓ మోస్తరు కరువున్న మండలాలివే..
ఆదిలాబాద్‌లో 16, భద్రాద్రి కొత్తగూడెంలో 12, హనుమకొండలో 14, జగిత్యాలలో 3, జనగామలో 3, భూపాలపల్లిలో 5, కామారెడ్డిలో 4, కరీంనగర్ 3, ఖమ్మంలో 7, ఆసిఫాబాద్‌లో 5, మహబూబాబాద్‌లో 7, మహబూబ్‌నగర్‌లో 11, మంచిర్యాలలో 11, మెదక్‌లో 1, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 6, ములుగులో 4, నాగర్‌కర్నూల్‌లో 3, నల్లగొండలో 8, నిర్మల్‌లో 8, నిజామాబాద్‌లో 18, రాజన్న సిరిసిల్లలో 2, రంగారెడ్డిలో 13, సంగారెడ్డిలో 26, సిద్దిపేటలో 7, సూర్యాపేటలో 19, వికారాబాద్‌లో 9, వనపర్తిలో 5, వరంగల్‌లో 8, యాదాద్రి భువనగిరిలో 16 మండలాల్లో మోస్తరు కరువు పరిస్థితులున్నాయి.


