తాడేపల్లి : అర్నాబ్ తుపానుపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. తుపాను ముప్పు నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వం తొలి ప్రాధాన్యత కావాలన్నారు. సహాయక చర్యల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలని, తీర ప్రాంత జిల్లాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వారు ఇచ్చే సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
తుపాను ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తున్నాయని, వరదలు సంభవించే ప్రమాదం ఉన్నందున ప్రజలందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలన్నారు. ముఖ్యంగా సముద్రతీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, నదులు, వాగులు, వంకల పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. తుపాను కారణంగా ప్రాణాపాయం జరగకుండా ప్రజల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
తుపాను తీరం దాటిన తర్వాత సహాయక చర్యలు చేపట్టడం మాత్రమే కాకుండా, ముందస్తు జాగ్రత్తల ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాలను సాధ్యమైనంత వరకు నివారించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. పునరావాస కేంద్రాల ఏర్పాటు, వాటిలో ఆహారం, తాగునీరు, మందులు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలకు ఎలాంటి కొరత లేకుండా చూడాలన్నారు.
‘గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు ఆస్పత్రులను, అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, తాగునీరు, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నా..వెంటనే పునరుద్ధరించేలా సిబ్బందిని, అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచాలి. తుపాను కారణంగా రైతులు, మత్స్యకారులు, ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. రైతులకు అవసరమైన సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి.
తుపాను అనంతరం రైతులకు జరిగిన నష్టాన్ని వేగంగా అంచనా వేసి..బాధితులకు సకాలంలో పరిహారం అందించేందుకు సన్నద్ధంగా ఉండాలి. మోంథా తుపానుకు సంబంధించి ఇప్పటివరకూ రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద ఒక్క రూపాయి కూడా అందలేదు. ఆ డబ్బును వెంటనే విడుదలచేయాలి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా ప్రజలకు అండగా నిలవాలి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించాలి’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:L ఈ రెండేళ్లు ఓపిక పట్టండి.. వచ్చేది జగన్ 2.0


