కృష్ణలంక, రాణీగారితోటకు చెందిన సాక్షుల విచారణ
ఏ–4 నిందితుడు సురేష్ ఇంట్లో సోదాలు?
సాయికృష్ణ తల్లి వద్దకు వస్తామని సమాచారం ఇచ్చిన సీబీఐ
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడ కృష్ణలంకకు చెందిన కాపు యువకుడు గాదె సాయికృష్ణపై కస్టోడియల్ టార్చర్, లాకప్‌డెత్, మృతదేహం మాయం కేసులో సీబీఐ విచారణ ఐదో రోజైన మంగళవారం కూడా కొనసాగింది. ఇందులో భాగంగా సిట్ సాక్షులుగా పేర్కొన్న కృష్ణలంక, రాణీగారితోటకు చెందిన పలువురిని పిలిచి విచారించింది. సాయికృష్ణను స్టేషన్‌లో చూశారా? ఎలాంటి స్థితిలో చూశారు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు సాయికృష్ణను బైక్‌పై బయటకు తీసుకెళ్లే సమయంలో చూసిన వారితో పాటు, సాయికృష్ణ పరిచయస్తులను కూడా సీబీఐ విచారిస్తున్నట్లు సమాచారం.
సురేష్ ఇంట్లో సోదాలు..
ఈ కేసులో సీఐ నాగరాజుకు అత్యంత సన్నిహితుడు ఏ–4 నిందితుడు గులివిందల సురేష్ ఇంట్లో సీబీఐ సోదాలు చేసినట్లు తెలిసింది. సాయికృష్ణను అచేతన స్థితిలో చివరిగా చూసింది çసురేషేనని ఇప్పటికే సిట్ తన చార్జిషీట్‌లో పేర్కొంది. అంతేకాక.. సాయికృష్ణ చనిపోయాక అతని కుటుంబంతో రాజీకి చర్చలు జరిపినట్లు కూడా అందులో పొందుపరిచింది. ఈ నేపథ్యంలోనే సీబీఐ ఆయన ఇంట్లో ఆధారాలు కోసం సోదాలు చేసినట్లు సమాచారం.
సాయికృష్ణ తల్లి కూడా విచారణ..
ఇదిలా ఉంటే.. విచారణ కోసం వస్తామని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి కూడా సీబీఐ అధికారులు తెలిపారు. వాస్తవంగా సోమవారమే వస్తామని చెప్పినప్పటికీ సాక్షులు, ఇతర విచారణలు ఉన్నందున ఆమె వద్దకు వెళ్లలేదు. మళ్లీ ఎప్పుడు వచ్చేది ముందుగా చెబుతామని ఆమెకు తెలిపారు.
కాగా.. సాయికృష్ణ కేసును సీబీఐ లోతుగా విచారిస్తుండడంతో చివరికి ఏం జరుగుతుందోనని కృష్ణలంక ప్రాంత ప్రజలతో పాటు, పోలీసుల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకూ సిట్ పాత్రధారులను మాత్రమే అరెస్టుచేయగా సూత్రధారులను తేల్చలేకపోయింది. ఇప్పుడు సీబీఐ ఆ కోణంలో దృష్టిసారిస్తున్నట్లు సమాచారం. అలాగే.. లాకప్‌డెత్ అయిన మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా కాల్చేయడం అనేది ఒక్క సీఐతో అయ్యే పనికాదని, అందులో ఉన్నతాధికారుల పాత్ర ఎంత ఉందనేది కూడా సీబీఐ తేల్చే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
సాయికృష్ణ కస్టోడియల్ మృతిపై దర్యాప్తు చేపట్టాం
హైకోర్టుకు సీబీఐ నివేదన
సాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్‌పై సీబీఐ దర్యాప్తు ప్రారంభించిన నేపథ్యంలో, ఇదే అభ్యర్థనతో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) హైకోర్టు మూసివేసింది. ఏపీ హైకోర్టుకు చెందిన మరో ధర్మాసనం సాయికృష్ణ కస్టోడియల్ డెత్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిందని, ఈ మేరకు సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిందని దర్యాప్తు సంస్థ తరఫు న్యాయవాది సురేష్ కుమార్ హైకోర్టుకు నివేదించారు.
దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, తమ ముందున్న వ్యాజ్యంలో తదుపరి విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. సాయికృష్ణ మృతిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అధ్యక్షుడు గోచిపాత శ్రీనివాసరావు హైకోర్టులో పిల్ వేయగా దీనిపై సీజే ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.


