వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వానికి వైఎస్ జగన్ హెచ్చరిక
తిరగబడండి.. మీ వెంట నేనున్నానంటూ పార్టీ శ్రేణులు, ప్రజలకు పిలుపు
పోలింగ్ రోజు ఇక్కడే ఉంటా.. ఎవరొస్తారో రండి
గట్టిగా తగులుదాం.. ప్రజాస్వామ్యంలో ఎవరు మంచి చేశారో ప్రజలు వాళ్లకు తోడుగా నిలుస్తారనే సంకేతం పంపిద్దాం
అయినా అన్యాయం చేయడానికి మీరు ముందుకు వస్తారా రండి
స్థానిక ఎన్నికల్లో కౌరవుల కుట్రలు.. శకునిలా బాబు మాయా పాచికలు
ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వారే ఖూనీ చేస్తున్నారు
నామినేషన్లు వేయనీయకుండా ఏకగ్రీవాలంటూ ప్రచారం
పోటీనే లేకుండా ఏకగ్రీవాలంటూ నిస్సిగ్గుగా సంబరాలా?
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పడ్డ ప్రతి దెబ్బ నామీద పడ్డట్లే
అన్యాయం చేస్తున్న పోలీసులు, అధికారులను వదలం
మా టైమ్ తప్పక వస్తుంది.. అప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తాం
పోలీసులు, అధికారులు ఇకనైనా మీ వైఖరి మార్చుకోండి
వచ్చేది జగన్ 2.0.. జగన్ ఒకటైతే.. పార్టీ కార్యకర్త రెండు
స్థానిక ఎన్నికల్లో అంతులేని అక్రమాలు, దౌర్జన్యాలు, ఏకంగా నామినేషన్ల కేంద్రాలనే రిగ్గింగ్ చేస్తున్న దుస్థితి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్ వేయనివ్వడం లేదు. అభ్యర్థుల చేతిలోని నామినేషన్ పత్రాలు లాక్కుని చింపేస్తున్నారు. చివరకు ఆర్‌వో చేతుల్లోని పత్రాలు కూడా లాక్కుంటున్నారు. అయినా ఆర్‌ఓలు ఫిర్యాదు చేయడం లేదు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరుగుతున్నా కళ్లు మూసుకున్నారు. ఇన్ని జరుగుతున్నా ఎస్‌ఈసీ అస్సలు పట్టించుకోవడం లేదు. చంద్రబాబు కుట్రలో అందరూ భాగస్వాములవుతున్నారు. మా టైమ్ తప్పక వస్తుంది.. అప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తాం.
విపక్షం నామినేషన్లు వేయకుండానే ఎన్నికలు ఏకగ్రీవం అంటూ నిస్సిగ్గుగా ప్రచారం.. ఆపై ఎల్లో మీడియాలో జోరుగా కథనాల పర్వం.. పోటీలో ఎవరూ లేకుండా చేసి గెల్చామంటూ సంబరాలు చేసుకోవడానికి మీకు ఏ మాత్రం సిగ్గు, బుద్ధి, జ్ఞానం ఉన్నాయా? అసలు స్థానిక ఎన్నికంటే మీకెందుకంత భయం? అలాంటప్పుడు ఎన్నికల నిర్వహణ డ్రామా ఎందుకు? ఇన్ని దారుణాలు చేస్తున్నందుకు సిగ్గు పడాలి. రేపు పులివెందులలో పోలింగ్ రోజు నేను ఇక్కడే ఉంటాను. ప్రతి అభ్యర్థికి, కార్యకర్తకు అండగా నిలబడతాను. దమ్ముంటే అక్రమాలు చేసి చూపండి.
ఇప్పుడు మీరు మా పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నారు. వారిపై పడుతున్న ప్రతి దెబ్బ నా మీద పడుతున్నట్లే. ఇప్పుడు మీ టైమ్ నడుస్తోంది. అందుకే రెచ్చి పోతున్నారు. రేపు మా టైమ్ వచ్చినప్పుడు అక్రమాలకు పాల్పడ్డ వారిని వదిలే ప్రసక్తే లేదు. ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతాం. పోలీసులు, అధికారులు ఇకనైనా వైఖరి మార్చుకొండి. మీరు సేవ చేయాల్సింది చంద్రబాబుకు కాదు. భారత రాజ్యాంగానికి లోబడి పని చేయండి. ఈ వ్యవస్థను గౌరవిస్తూ, మీ బాధ్యతలు నెరవేర్చండి.
– వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కడప: స్థానిక సంస్థల ఎన్నికల్లో వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం ఇకపై అక్రమాలకు పాల్పడితే.. పులివెందులలో కొడితే గూబ గుయ్యిమంటుందని.. అది రాష్ట్రమంతా వినిపిస్తుందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. మీ వెంట నేనున్నాను.. తిరగబడండని పార్టీ శ్రేణులు, ప్రజలకు పిలుపునిచ్చారు. మున్సిపల్ పోలింగ్ రోజున తాను పులివెందులలో ఉంటానని.. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే, అక్రమాలు చేసి చూపాలని సవాల్ విసిరారు. ‘స్థానిక ఎన్నికల్లో ఓటింగ్‌కు ముందు రోజు రాత్రి నేను ఇక్కడికే వస్తాను. ఓటింగ్ రోజున మీ జగన్ కూడా బూత్‌లోకి వెళ్లి ఓటు వేస్తాడు. అయినా అన్యాయం చేయడానికి ముందుకు వస్తారా.. రండి. స్లీవ్ (చొక్కా చేతులు) ఎట్లాగూ మడిచాం. ఎంత మంది వస్తారో రండి. గట్టిగా తగులుదాం. నిలబడి మేమేంటో చూపిస్తాం’ అని హెచ్చరించారు. 
ప్రజాస్వామ్యంలో ఎవరు మంచి చేశారో వారికే ప్రజలు తోడుగా నిలబడతారన్న సంకేతాన్ని కచ్చితంగా పంపిస్తామన్నారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలోని భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గ స్థాయి పార్టీ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కౌరవుల కుట్రలు కనిపిస్తున్నాయని చెప్పారు. శకునిలా చంద్రబాబు విసిరిన మాయా పాచికలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయని.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వారే దాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో అంతులేని అక్రమాలు, దౌర్జన్యాలు సాగిస్తున్నారని నిప్పులు చెరిగారు.
ఏకంగా నామినేషన్ల పర్వంలోనే చంద్రబాబు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని, యథేచ్ఛగా నామినేషన్ కేంద్రాలను ఆక్రమించి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్ వేయనివ్వలేదని ధ్వజమెత్తారు. అభ్యర్థుల చేతిలోని నామినేషన్ పత్రాలు లాక్కుని చింపేస్తున్నారని, చివరకు ఆర్‌ఓ చేతుల్లోని పత్రాలు కూడా లాక్కుంటున్నారని, అయినా వారు ఎక్కడా ఫిర్యాదు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే జరుగుతున్నా, వారు చోద్యం చూస్తున్నారన్నారు.
రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) అస్సలు పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. ఇప్పుడు అన్యాయంగా తమ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు, నాయకులను వేధిస్తున్నారని.. వారిపై పడుతున్న ప్రతి దెబ్బ తనపైనే పడుతోందని, భవిష్యత్తులో తమ టైమ్ వచ్చినప్పుడు వడ్డీతో సహా బదులిస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడు తప్పు చేస్తున్న ఎవ్వరినీ విడిచిపెట్టబోమని, వారు ఎక్కడున్నా.. చివరకు రిటైర్ అయినా సరే తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతామని చెప్పారు. చేసిన తప్పుకు శిక్ష తప్పదని హెచ్చరించారు ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..
శకుని పాచికల్లా చంద్రబాబు రాజకీయం
నిజంగా ఈ రోజు ఎన్నికలు జరుగుతున్న తీరు చూస్తుంటే, మహాభారతంలో కౌరవుల కుతంత్రాలన్నీ కనిపిస్తున్నాయి. చంద్రబాబులో శకుని క్యారెక్టర్ కనిపిస్తుంది. ఆ రోజు ఏ రకంగా అయితే శకుని మాయా పాచికలు వేసి, తనకు అనుకూలంగా జూదాన్ని మల్చుకున్నాడో, సరిగ్గా ఈరోజు చంద్రబాబు అదే పని చేస్తూ అధికారాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ దుర్వినియోగం చేస్తున్నారు. ఆ రోజు ఆ సభలో పక్కనే ఉన్న వాళ్లంతా అలా చూస్తూ ఉండిపోయి.. శకునికి, దుర్యోధనుడికి సహకరించినట్లే.. ఈ రోజు పోలీసులు, అధికారగణం చంద్రబాబుకు పూర్తిగా సహకరిస్తోంది.
ఎస్‌ఈసీ, పోలీస్ అధికారులు, మిగిలిన అధికారులు ఏ మాత్రం స్పందించరు. వ్యవస్థలన్నీ పూర్తిగా నీరు గారి తానా అంటే తందానా అంటూ చంద్రబాబునాయుడుకు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన వారే ఖూనీ చేస్తున్న పరిస్థితి చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. భావితరాలకు మనం ఎలాంటి లీడర్లను ఇవ్వబోతున్నాం.. ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నాం అన్నది ఈరోజు చంద్రబాబు పాపంలో భాగస్తులైన ప్రతి అధికారి, ప్రతి పోలీసు, ఎస్‌ఈసీ, ప్రతి వ్యవస్థ ఆలోచించాలి.
నామినేషన్ల పర్వంలోనే రిగ్గింగ్
గతంలో పోలింగ్ బూత్‌లు స్వా«దీనం చేసుకుని రిగ్గింగ్ చేయడం చూశాం. ఇప్పుడు ఏకంగా నామినేషన్ల పర్వంలోనే రిగ్గింగ్ చూస్తున్నాం. ఇలా ఇంత వరకు బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు. నామినేషన్ సెంటర్లను ఆక్రమించుకోవడం అన్నది ఇంత వరకు దేశంలోనే ఎక్కడా చూసి ఉండం. ఇప్పుడు మన రాష్ట్రంలో చంద్రబాబునాయుడు సీఎంగా ఉండగా, ఆ పరిస్థితి చూస్తున్నాం. ప్రజాస్వామ్యం ఎంత దరిద్రంగా ఉందో చెప్పడానికి నిదర్శనాలు ఇవి.
పోటీయే లేకుండా గెల్చామంటూ సంబరాలా!
మామూలుగా ఎక్కడ పోటీ జరిగినా, అందరూ పాల్గొంటారు. అప్పుడు గెలిచి, నేను గెలిచానని గర్వంగా కాలర్ ఎగరేసుకొని చెప్పుకునే పరిస్థితి చూస్తాం. కానీ ఇవాళ పోటీలో మిగిలిన ప్లేయర్లను ఎవ్వరినీ రానివ్వకుండా, వారికి ఆడే అవకాశం ఇవ్వకుండా, వారిని తప్పించి.. ఆ తర్వాత మేమే గెలిచామంటూ సంకలు గుద్దుకుంటున్నారు. ఇలాంటి వాళ్లను బహుశా ఎక్కడా చూసి ఉండం. పోటీ అంటే నువ్వు తలపడు.. నేనూ తలపడుతా.. ప్రజలు ఎవరికి ఓటు వేయాలనుకుంటే వారికే వేస్తారు. ప్రజలు ఒకవేళ నీకు ఓటు వేస్తే నువ్వు సంతోషపడు. నాకు ఓటు వేస్తే, నేను సంతోషపడతా.. దాన్ని పోటీ అంటారు. 
సిగ్గు, బుద్ధి, జ్ఞానం ఉన్నాయా?
ఇవాళ అసలు పోటీ అనేది ఉండదు. అటువైపున పోటీ పడే మనిషి ఉండకూడదు. అలాంటి పోటీ లేకుండా గెలిచి, గెలిచాము అని చెప్పి, ఆ రౌడీయిజాన్ని, ఆ దౌర్జన్యాన్ని ఈ మాదిరిగా బ్యానర్లుగా రాస్తున్నారు. ‘‘17 పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం కూటమి ఖాతాల్లోకి’’ అని రాశారు. ఈ మాదిరిగా వాళ్ల పేపర్లలో వాళ్లు గొప్పగా ఏదో చేసినట్టుగా రాసుకుంటారు. ౖచైర్‌పర్సన్ ఎన్నికల్లో తెలుగుదేశం పారీ్టకి 15, జనసేనకు ఒకటి, బీజేపీకి ఒకటి. అన్నీ ఏకగ్రీవం అట! మొత్తం వార్డుల్లో 21.08 శాతం, డివిజన్లలో 12.58 శాతం ఏకగ్రీవం అట! జగన్ సొంత జిల్లాలో కూటమి ఖాతాల్లోకి ఆరు పురపాలక సంఘాలట! నగర పంచాయతీలు కూడానట! మాజీ మంత్రి పెద్దిరెడ్డి అడ్డాలో తెలుగుదేశం జెండా అట! ఇవి వాళ్ల కరపత్రం ఈనాడులో వార్తలు. సిగ్గు, బుద్ధి, జ్ఞానం ఉన్న వాళ్లు ఎవరైనా ఈ మాదిరిగా ఎన్నికలు జరిపించి, ఇలా ఎన్నికల్లో గెలిచామని చెప్పి సంకలు గుద్దుకుంటారా.. అంటే, వాళ్లకన్నా తెలివి లేనోళ్లు ఈ ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉంటారా అని అడుగుతున్నా.
అసలు మీకు ఎన్నికలంటే ఎందుకు భయం?
ఎన్నికల్లో పోటీ పెట్టించడానికి ఎందుకు భయపడుతున్నారని చంద్రబాబునాయుడును, ఆయనకు వత్తాసు పలుకుతున్న ఇలాంటి దిక్కుమాలిన పేపర్లు, దిక్కుమాలిన టీవీలు, ఇలాంటి వాళ్లందరినీ అడుగుతున్నాను. అందుకు కారణం ఒక్కటే. సూపర్ సికుŠుస్ల లేవు, సూపర్ సెవెన్లు లేవు. గత ఎన్నికలప్పుడు ఇంటింటికీ పంచిన బాండ్లను ఎవరూ మర్చిపోలేదు. ప్రజలంతా ఆ బాండ్లు చూపించి తెలుగుదేశం పార్టీని నిలదీసే పరిస్థితి వచ్చింది. అదే చర్చ ప్రతి ఇంట్లో జరుగుతోంది. ఏకంగా 143 హామీలు ఇచ్చి, దాదాపు మూడేళ్లు అవుతుంటే వాటిని బోడి సున్నా చేశారు. అందుకే ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్లే ముఖం లేక, ఎన్నికల్లో పోటీకి నిలబడే ధైర్యం లేక, మాయా పాచికలతో చంద్రబాబు శకుని రాజకీయం చేస్తున్నారు.
ఇలా జరుగుతుంటే సిగ్గనిపించడం లేదా?
మీ వల్ల అందరికన్నా ఎక్కువగా నష్టపోయింది ఎవరో తెలుసా.. అని చంద్రబాబు, ఈ దౌర్భాగ్యపు పేపర్లు, టీవీ ఛానళ్లు నడుపుతున్న వారిని అడుగుతున్నా.. 50 శాతం రిజర్వేషన్ ప్రకారం, ఈ ఎన్నికల్లో సగానికి పైగా సీట్లలో పోటీ చేసేది నా అక్కచెల్లెమ్మలే. నామినేషన్ వేయడానికి వస్తున్నారంటే గౌరవిస్తూ సంతోషించాలి. కానీ, అందుకు భిన్నంగా వారిని నడి రోడ్డు మీద అడ్డుకుంటున్నారు. చెక్ పోస్టులు పెడుతున్నారు. ఆ చెక్ పోస్టు దాటి, దాదాపు కిలోమీటర్ దూరంలో ఉన్న ఆర్వో కేంద్రానికి వారు రావాల్సి వస్తోంది. అభ్యర్థినితో పాటు, కేవలం ముగ్గురిని మాత్రమే అనుమతిస్తున్నారు. దీంతో మధ్యలో దాదాపు నాలుగు చోట్ల టీడీపీ గూండాలు అక్కచెల్లెమ్మల మీద దాడులు చేయడం, చీరలు లాగడం, అగౌరవంగా వ్యవహరించడం, చివరికి ఆ నామినేషన్ పత్రాలను చించేయడం చేస్తున్నారు. ఈ అడ్డంకులూ దాటుకుని నామినేషన్ కేంద్రంలోకి వెళితే.. అప్పటికే అక్కడ టీడీపీ గూండాలు ఆక్రమించి తిష్ట వేసి ఉంటారు. ఇలా జరుగుతుంటే నీకు సిగ్గనిపించడం లేదా.. చంద్రబాబూ.
మా ప్రభుత్వ హయాంలో అక్కచెల్లెమ్మలు ఎలా ఉన్నారంటే..
నా అక్కచెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు ఉండాలని, వారు సంతోషంగా ఉంటే, ఆ కుటుంబాలు బాగుంటాయని చెప్పి తపన, తాపత్రయ పడ్డ ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. వారి కోసం ఆసరా, చేయూత, ఓబీసీ నేస్తం, కాపు నేస్తం, ఇంకా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల కోసం సున్నా వడ్డీ, అక్కచెల్లెమ్మల పిల్లలైన నా మేనల్లుళ్లు, మేనకోడళ్ల కోసం అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు తీసుకొచ్చాం. తద్వారా ఆయా పథకాల నగదును నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో జమ చేశాం. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు, 21 లక్షల ఇళ్లు అక్కచెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేయించి, కట్టించి ఇచ్చే బృహత్తర కార్యక్రమం కూడా చేపట్టాం.
అక్కచెల్లెమ్మలను చేయి పట్టుకొని నడిపించడమే కాకుండా, వారు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా కూడా ఎదగాలని చెప్పి.. నామినేటెడ్ పదవుల్లో, నామినేటెడ్ కాంట్రాక్టుల్లో ఏకంగా 50% రిజర్వేషన్ ఇస్తూ చట్టం చేసి మరీ అమలు చేశాం. అలాంటి అక్కచెల్లెమ్మల గౌరవాన్ని ఈరోజు నిర్దాక్షిణ్యంగా మంట గలుపుతున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబునాయుడు. 80 ఏళ్ల వయసులో చేస్తున్న ఇలాంటి దౌర్భాగ్యకర పనులకు ఆయన సిగ్గుతో తల దించుకోవాలి. నిజంగా పోటీ మధ్య ఎన్నికలు జరిగితే ఎవరు ప్రజలకు మంచి చేశారనేది తెలుస్తుంది. అప్పుడు ఆ గెలుపునకు ఒక సంతోషం అనేది ఉంటుంది. కానీ, ఈ రోజు అలా జరగడం లేదు.
పులివెందులలో మరీ దారుణం
పులివెందులలో జరిగిన ఈ ఘటనలు వింటే గుండె తరుక్కుపోతుంది. 40 వార్డులున్న పులివెందులలో కేవలం 20 వార్డుల్లో మాత్రమే నామినేషన్లు వేయనిచ్చారు. అంటే, మనం నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేదా? అని ఈ పాలకులంతా సిగ్గుతో తల దించుకోవాలి. ఇదే నియోజకవర్గంలో ఏడు జెడ్పిటీసి స్థానాలకు గాను నాలుగింటిలో మాత్రమే పోటీ జరుగుతోంది. ఒక స్థానంలో దగ్గరుండి తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ క్యాండిడేట్ భార్య దగ్గరుండి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నామినేషన్ చింపేశారు. మరో వైపు స్క్రూటినీ పేరిట రెండు నామినేషన్లు రిజెక్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంకో వైపు పోలీసులే స్వయంగా అడ్డుకోవడం దారుణం.
అక్టోబరు 17న, మన కౌన్సిలర్లు నామినేషన్ వేయడానికి అక్కడికి వెళ్తే, పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది కాబట్టి, మధ్యాహ్నం రావాలని పోలీçసులు తిప్పి పంపించారు. మధ్యాహ్నం దాకా వేచి చూసి, 1 గంటకు నామినేషన్లు వేయడానికి వెళ్తే అదే పోలీసులు మళ్లీ అడ్డుకోవడం అన్నది ఎప్పుడూ చూడలేదు. పైగా నామినేషన్లు వేయడానికి వీలు లేదని హుకుం జారీ చేశారు. దీంతో ఎంపీ అవినాష్, దుష్యంత్ ఏం చెప్పారంటే.. ‘అయ్యా మేము ఇక్కడే ఉంటాం. మా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులంతా మూడు వాహనాల్లో ఎక్కుతారు. అప్పుడు మీరే స్వయంగా వారిని తీసుకుపోయి, మీరే దగ్గరుండి నామినేషన్లు వేయించండి’ అని విజ్ఞప్తి చేశారు. ఇందుకు కూడా పోలీసులు ససేమిరా అనడంతో, మా పార్టీ నాయకులు ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు.
పైగా మానవత్వం అన్నది పూర్తిగా మర్చిపోయి లాఠీఛార్జ్ చేశారు. ఏకే–47తో ఏకంగా 37 రౌండ్లు కాల్పులు జరిపారు. దాంతో ఇద్దరి కాళ్లు, తొడల్లోకి గుండ్లు దూసుకుపోయాయి. నిజంగా ఇలాంటి ఘటనల గురించి నాడు స్వాతంత్య్ర పోరాట సమయంలోనే విన్నాం. పులివెందులలో పోలీసులు కేవలం కాల్పులతోనే ఆగిపోలేదు. 20 స్టన్ షెల్స్, 40 స్మోక్ షెల్స్ కూడా ప్రయోగించారు. ఇంకా ఏడు హ్యాండ్ గ్రెనేడ్స్ కూడా ఉపయోగించారు. అసలు మా పార్టీ అభ్యర్థులు చేసిన తప్పేమిటి? అంతæ బల ప్రయోగం ఎందుకు చేశారు? కేవలం నామినేషన్లు వేయడానికి రావడమే మా అభ్యర్థులు చేసిన తప్పా? అని చంద్రబాబునాయుడును గట్టిగా నిలదీస్తున్నా. కాల్పులతో అడ్డుకున్న పోలీసులనూ అడుగుతున్నా.
924 మందిపై హత్యాయత్నం కేసులా!?
ఎన్నికల్లో పోటీ చేయడానికే ఇంతగా భయపడుతున్నప్పుడు మీరు అసలు ఎన్నికలు ఎందుకు పెట్టారు? అన్ని నామినేషన్ పద్ధతిలో మీరే నింపుకోవచ్చు కదా? అందుకు చంద్రబాబునాయుడు సిగ్గు పడాల్సిన పరిస్థితి. పులివెందులలో దౌర్జన్యాలు ఇంకా అక్కడితో ఆగిపోలేదు. ఆయా ఘటనల్లో బాధితులైన వారిలో 924 మంది మీద ఏకంగా హత్యాయత్నం సెక్షన్–307 కింద కేసు నమోదు చేశారు. అంటే పోలీసులను చంపడానికి వీరంతా ప్రయత్నించారట!
తొండి.. దౌర్జన్యం.. అన్యాయం
నిజానికి మమ్మల్ని చంపడానికి నువ్వు తుపాకులు కాల్చావు. ఏకంగా 37 రౌండ్లు కాల్చారు. బాంబులు విసిరారు. దాంతో మా వాళ్లకి గాయాలయ్యాయి. ఇన్ని పనులు చేసిన మీరు, తిరిగి మా వాళ్లు 924 మందిపై హత్యాయత్నం కేసులు పెట్టడం అత్యంత హేయం. నిజం చెప్పాలంటే వారంతా ఈ ఎన్నికల్లో కనిపించకుండా ఉండడమే మీ లక్ష్యం. అదే మీ కుట్ర. అందుకే అంత దారుణంగా కేసులు పెట్టారు. తొండి తొండి.. అని చిన్న పిల్లలు ఆడుకుంటున్నప్పుడు అంటుంటారు. మరి ఇది కూడా తొండి కాకపోతే మరేమిటి? తొండి ఒక్కటే కాదు.. అడుగడుగునా దౌర్జన్యం, అన్యాయం. నిజంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా చంద్రబాబులో మార్పు రాలేదు.
ఎస్‌ఈసీలో మార్పు రాలేదు. కలెక్టర్లలో మార్పు రాలేదు. ఇలాంటి అధికారులు ఇలాగే కొనసాగుతుంటే, ఎన్నికలు సజావుగా జరుగుతాయా? నీవు ఎన్నికలు నిర్వహిస్తున్నావా? లేక నామినేషన్ పద్ధతిలో ఎన్నికలకు పోతున్నావా? చంద్రబాబు గుండెపై చెయ్యి వేసుకొని సమాధానం చెప్పాలి. కడప జిల్లాలో 39 మంది జెడ్పిటీసీలు పోటీ చేయాల్సి ఉంటే, వాటిలో ఏకంగా 17 చోట్ల పోటీ లేకుండా చేశారు. 6 చోట్ల నామినేషన్లు వేయనివ్వలేదు. మరో 11 చోట్ల, అర్ధరాత్రి దాటాక స్రూ్కటినీ పేరుతో నామినేషన్లు తిరస్కరించారు. అలా 39 చోట్లలో 17 చోట్ల అసలు ఎన్నిక లేకుండా, పోటీ లేకుండా చేసి, కడప జెడ్పీ స్థానాన్ని గెల్చుకున్నామని రేపు చెప్పుకుంటారు. అందుకు మీకు సిగ్గు ఉండాలి.
రేపు ఆస్తులు లాగేసుకుంటారు
ఈరోజు ఈ వెన్నుపోటు పార్టీ, వెన్నుపోటు పార్టీ నాయకుడు చేస్తున్న రాజకీయాల ద్వారా మన హక్కులు లాగేసుకున్నారు. పోలీసులు, అధికారుల సమక్షంలోనే నామినేషన్ పత్రాలను చింపేశారు. ఇలాగే చూస్తూ ఊరకుంటే రేప్పొద్దున మీ ఆస్తి పత్రాలను ఇదే మాదిరిగా వీళ్లు లాక్కుంటారు. వీళ్లే ఆ పత్రాలను చింపేస్తారు. ఇక ఆ ఆస్తి మీది కాదు.. మాది అని చెప్పే రోజు కూడా త్వరలోనే వస్తుంది. పులివెందుల నుంచి మొదలయ్యే ఈ ఆలోచనను రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. రేపు మనం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళితే అక్కడ వాళ్లే మన పేపర్లు చింపేసి, ఇక ఈ ఆస్తి నీది కాదు.. నాది అని చెప్పే పరిస్థితి త్వరలోనే వస్తుంది. కాబట్టి దీని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరుతున్నా’ అని వైఎస్ జగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి, పులివెందుల మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మ, ఇన్‌ఛార్జి వైఎస్ మనోహరరెడ్డి, నేతలు వైఎస్ మధురెడ్డి, చవ్వా దుష్యంత్‌రెడ్డి పాల్గొన్నారు.
తిరగబడండి.. మీ అన్న తోడుగా ఉంటాడు
మన హక్కులను మనం కాపాడుకోకపోతే, మన హక్కులు మనకు ఎప్పటికీ దక్కకుండా పోతాయన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. అందుకే అందరినీ ఒక్కటే కోరుతున్నా. తిరగబడండి.. మీ అన్న మీకు తోడుగా ఉంటాడని గట్టిగా చెబుతున్నా. పులివెందులలో మీరు కొట్టే దెబ్బకు కూటమి గూబ గుయ్యిమనాలి. అది రాష్ట్రమంతా వినిపించాలి. ఎందుకంటే, ఇక్కడ చాలా దారుణంగా వ్యవహరించారు. ఇక్కడి మున్సిపాలిటీలో మనం కేవలం 29 స్థానాల్లోనే ఉండేలా చేశారు. అదే వారు మాత్రం మొత్తం స్థానాల్లో పోటీ చేస్తున్నారు.
అలాగే జెడ్పీటీసీల్లో వారు మొత్తం ఏడు చోట్ల పోటీ చేస్తుంటే, మనం నాలుగింటిలోనే పోటీకి దిగుతున్నాం. అంతగా తొండి, అన్యాయం, దౌర్జన్యం చేస్తున్నారు. చూస్తుండగానే రెండున్నర ఏళ్లు గడిచిపోయాయి. కళ్లు మూసుకుని తెరిచేలోగా మరో రెండేళ్లు. వచ్చే సంవత్సరం సెపె్టంబర్‌లో నా పాదయాత్ర ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఏడాదికి ఈ ప్రభుత్వం పూర్తిగా తుడిచిపెట్టుకుపోబోతుంది. ఇది నేను గట్టిగా చెబుతున్నా.
తనకు ఆహ్వానం పలకడానికి వచ్చిన కార్యకర్తలకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఆ చేయి నా మీద వేసినట్లే
పులివెందులలో ప్రతి పోలీస్ అధికారికి, అధికారికి చెబుతున్నా. పులివెందులలో మా వాళ్ల మీద చెయ్యి వేశారంటే దానర్థం, మీరు నా మీద చేయి వేసినట్లే. అదే గట్టిగా చెబుతున్నాను. ఈ రోజు టైమ్ మీది. మా మీద చేయి వేస్తున్నారు. రేపు మా టైమ్ వస్తుంది. అప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తాం. అన్యాయం చేసిన ఏ అధికారిని వదిలిపెట్టబోం. ఇప్పుడు అన్యాయం చేసిన, చేస్తున్న ఏ అధికారి ఎక్కడికీ పోలేడు. ఒకవేళ రిటైర్ అయిపోయి ఉన్నా కూడా తీసుకొస్తాం. చంద్రబాబునాయుడుకు కూడా గట్టిగా చెబుతున్నా. ప్రతి పోలీస్ అధికారికి, ప్రతి అధికారికి చెబుతున్నా.
మీరు డ్యూటీ చేస్తోంది మీ టోపీ మీద ఉన్న మూడు సింహాల కోసం అని ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు డ్యూటీ చేస్తోంది భారత రాజ్యాంగ వ్యవస్థ కోసం అని కూడా గుర్తు పెట్టుకోండి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలను గౌరవించలేని పరిస్థితికి వస్తే, రక్షకులుగా ఉండాల్సిన వారే దౌర్జన్యం చేస్తే, ఇక రక్షించే వాడు ఎవడు? అని ఒకసారి ఆలోచించండి. ఇప్పటికైనా సమయం మించి పోలేదు. మీలో మార్పు రావాలి. ఆ మార్పు తెచ్చుకొని మీరు అడుగులు ముందుకు వేయండి.
మనకు పోరాటాలు కొత్త కాదు
⇒ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవన్నీ మనకు కొత్త కాదని గుర్తు చేస్తున్నా. మన పార్టీ పుట్టింది ప్రతిపక్షంలోనే. మన పార్టీ నడిచింది కష్టాల్లోనే. కానీ ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా చివరికి జరిగింది ఏమిటి? కొంచెం ఆలస్యమైనా మనం సీఎం సీట్లో కూర్చున్నాం. ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తు పెట్టుకోండి. ఆ రోజు జగన్ తప్పకుండా మంచి చేస్తాడు అన్న నమ్మకంతో మనల్ని గెలిపించారు. మనం ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాం.
⇒ ఈ రోజు జగన్ చేసిన మంచి ప్రతి ఇంట్లో బతికే ఉంది. అందుకే చంద్రబాబునాయుడు పాలన, జగన్ పాలన మధ్య తేడాపై ప్రతి ఇంట్లో ఈ రోజు చర్చ జరుగుతోంది. అందుకే ఈసారి ప్రజలు ఓటు వేస్తే చంద్రబాబునాయుడుకు సింగిల్ డిజిట్ కూడా రాని పరిస్థితి వచ్చింది. రెండు సంవత్సరాలు కాస్త ఓపిక పట్టండి. ఆ తర్వాత వచ్చేది జగన్ 2.0 అన్నది మాత్రం గుర్తు పెట్టుకోండి. జగన్ 2.0 లో జగన్ ఒకటైతే.. పార్టీ కార్యకర్త రెండు అని గుర్తు పెట్టుకోండి. మీ ద్వారానే ప్రజలకు మంచి చేస్తాను. మీ సంక్షేమం నా లక్ష్యం. మీ సమస్యలు నా సమస్యగా భావించి మీకు తోడుగా ఉంటాను.
⇒ మీ మీద దెబ్బ పడితే మీ అన్న ఊర్కే చూస్తూ ఉండిపోడు. పులివెందుల ప్రజలు ఎప్పుడూ, నాన్న చనిపోయిన తర్వాత కూడా నా కుటుంబ సభ్యులుగానే అండగా నిలబడ్డారు. నాకు కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా.. ఎవరి భుజానైనా నేను కన్నీళ్లు పెట్టుకోవాలని అంటే అది పులివెందుల ప్రజలే. మీరు నన్ను గెలిపించారు కాబట్టే ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి కాగలిగాను.
⇒ మీ బిడ్డకు మీరు ఇలాగే తోడుగా నిలబడండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే కార్యక్రమానికి పులివెందుల నుంచే బీజం వేస్తాం. ఇక్కడి నుంచి పడే బీజం రేప్పొద్దున ఒక చెట్టుగా మారి చంద్రబాబునాయుడు కుటిల రాజకీయాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేస్తుంది.
⇒ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో దెబ్బలు తగిలిన వాళ్లు, కష్టాలు అనుభవించిన వాళ్లు, అన్నింటికీ ధైర్యంగా నిలబడ్డ నా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గం, మున్సిపాలిటీకి సంబంధించిన అందరికీ కృతజ్ఞతలు.


