భీకర అర్నబ్‌ | Cyclone Likely to Cross Coast Near Yanam: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

భీకర అర్నబ్‌

Oct 28 2026 5:53 AM | Updated on Oct 28 2026 5:53 AM

Cyclone Likely to Cross Coast Near Yanam: Andhra Pradesh

యానాం వద్ద తీరాన్ని తాకిన తుపాను

150 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు 

‘కోస్తా’కు రెడ్‌ అలర్ట్‌.. అత్యంత భారీ వర్షాల హెచ్చరిక

కాకినాడ, యానాం తీరాలకు ఉప్పెన ముప్పు.. కోనసీమ అతలాకుతలం.. విశాఖపై కుండపోత 

ప్రళయ గాలులు.. ఉగ్రరూపంలో సముద్రం.. అల్లకల్లోలమైన తీరం 

విశాఖ పీఎం పాలెం వద్ద 18.5 సెంటీమీటర్ల వర్షపాతం 

ఉత్తరాంధ్రలో 100కు పైగా ప్రాంతాల్లో 10 సెం.మీ.కు పైగా వర్షం 

నేలకొరుగుతున్న కొబ్బరి చెట్లు, విద్యుత్‌ స్తంభాలు 

తీగలు తెగిపడి అంధకారంలో జిల్లా 

తుపాను దెబ్బకు అన్నదాత విలవిల

నీట మునుగుతున్న వరి చేలు

సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అతి తీవ్ర తుపాను ‘అర్నబ్‌’ రాష్ట్ర తీరం వైపు వేగంగా దూసుకొచ్చింది. అనుకున్న సమయం కంటే ముందుగానే ఇది తీరం తాకింది. తొలుత బుధవారం ఉదయం తీరం దాటుతుందని అంచనా వేసినప్పటికీ ఇది వేగంగా కదిలి మంగళవారం రాత్రి 11.30 గంటలకు యానాం వద్ద తీరాన్ని తాకింది. ఈ ప్రక్రియ బుధవారం తెల్లవారుజాము 4 గంటల వరకు కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 125 నుంచి 135 కిలోమీటర్లకు పైగా వేగంతో పెనుగాలులు వీస్తాయని పేర్కొంది. తీరం దాటడానికి ముందు తుపాను గంటకు 17 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ–వాయవ్య దిశగా కదిలింది.

ముంచుకొస్తున్న సముద్రపు అలలు..
తీరం దాటే సమయంలో సాధారణ ఆటుపోట్ల కంటే 1.5 నుంచి 2.5 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాకినాడ, యానాం వద్ద ఉప్పెన తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. యానాం వద్ద రెండు మీటర్లు, కాకినాడ మండలం పోలేకుర్రు వద్ద 1.8 మీటర్లు, ముమ్మిడివరం మండలం జి.వేమవరం వద్ద 1.1 మీటర్లు, పిఠాపురం మండలం పొన్నాడ వద్ద ఒక మీటరు ఎత్తున అలలు ఎగసిపడ్డాయి. యానాంలో అర కిలోమీటరు వరకు, కాకినాడ, అమలాపురం, పిఠాపురం, నరసాపురం, రాజోలు ప్రాంతాల్లో 200–250 మీటర్ల వరకు సముద్రపు నీరు లోపలికి చొచ్చుకువచ్చింది. విశాఖ రూరల్‌ మండలం పీఎం పాలెం వద్ద అత్యధికంగా 18.5 సెంటమీటర్లు.. ఉత్తరాంధ్రలోని 100కు పైగా ప్రాంతాల్లో 10 సెం.మీ.కు పైగా వర్షం కురిసింది. ఇందులో సగం ప్రాంతాలు విశాఖ జిల్లాలోనే ఉన్నాయి. 

11 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌.. అత్యంత భారీ వర్షాలు..
ఇక కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, ఏలూ­రు, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల జిల్లాల్లోని పలుచోట్ల బుధవారం అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం రెడ్‌ అలర్ట్‌ జారీచేసింది. విజయనగరం, శ్రీకా­కు­ళం, పార్వతీపురం మన్యం, గుంటూరు, పల్నా­డు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ జిల్లాల్లో గంటకు 115–­125 కిలోమీటర్లు, గరిష్టంగా 140 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని హెచ్చరించింది. కోస్తా జిల్లాల్లో ఆకస్మిక వరదలు ముంచెత్తే ప్రమా­దం ఉందని జాతీయ ఫ్లాష్‌ ఫ్లడ్‌ బులెటిన్‌ వెల్లడించింది.

తీరం దాటాక బలహీనం..
ఇదిలా ఉంటే.. తీరం దాటిన తర్వాత తుపాను ఉత్తర దిశగా కదులుతూ క్రమంగా బలహీనపడనుంది. ఇది బుధవారం మధ్యాహ్నానికి తుపానుగా.. సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడి ఛత్తీస్‌గఢ్‌ వైపు పయనిస్తుంది. సముద్రంలో 14 మీటర్లకు పైగా ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయని, ఈనెల 29 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement